Thursday, May 31, 2018

శ్రీకృష్ణ లీలలు - 20

10.1-324-క.
తెఱవ యొకతె నిద్రింపఁగ
నెఱిఁ గట్టిన వలువ వీడ్చి నే టగు తేలుం
గఱపించి నీ కుమారుఁడు
వెఱచుచు నది పఱవ నగియె విహితమె? సాధ్వీ!
10.1-325-క.
నా కొడుకును నా కోడలు
నేకతమునఁ బెనఁగ బాము నీతఁడు వైవం
గోక లెఱుంగక పాఱినఁ
గూఁక లిడెన్ నీ సుతుండు గుణమె? గుణాఢ్యా!

భావము:
ఒకామె నిద్రపోతుంటే బట్టలు విప్పేసి, నీ కొడుకు ఇంత పెద్ద తేలు తెచ్చి కరిపించాడు. ఆమె బెదిరిపోయి పెద్ద నోరు పెట్టుకొని అరుస్తూ గంతులు వేస్తుంటే మీ అబ్బాయి పకపక నవ్వాడు. ఇదేమైనా బాగుందా తల్లీ! ఎంతో సాధు స్వభావివి కదా నువ్వు చెప్పు మరి. నా కొడుకు కోడలు ఏకాంతంలో ఉంటే, నీ కొడుకు వెళ్ళి పాము నొకదానిని వారిమీద పడేసాడు. వంటిమీద బట్టలు లేవని తెలియనంతగా భయపడిపోయి, వాళ్ళు పరుగులు పెడుతుంటే, చూసి హేళనగా కేకలు పెట్టాడు. ఓ యశోదమ్మా! నీవేమో సుగుణాల రాశివి కదా. మరి మీ వాడి గుణ మేమైనా బావుందా చెప్పు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=45&padyam=325

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Wednesday, May 30, 2018

శ్రీకృష్ణ లీలలు - 19

10.1-322-క.
నమ్మి నిదురబోవ నా పట్టిచుంచు మా
లేఁగతోఁకతోడ లీలఁ గట్టి
వీథులందుఁ దోలె వెలది! నీ కొమరుండు; 
రాచబిడ్డఁ డైన ఱవ్వ మేలె?
10.1-323-క.
నా పట్టి పొట్ట నిండఁగఁ
బై పడి నీ పట్టి వెన్న బానెం డిడినాఁ; 
డూపిరి వెడలదు; వానిం
జూపెద నేమైన నీవ సుమ్ము లతాంగీ!


భావము:
ఓ ఉత్తమురాలా! యశోదమ్మా! నా కొడుకు ఆడి ఆడి అలసి నిద్రపోయాడు. నీ సుపుత్రుడు వచ్చి నా కొడుకు జుట్టును మా లేగదూడ తోకకు కట్టి, దాన్ని వీథు లమ్మట తోలాడు. ఎంత గొప్ప నాయకుడి పిల్లా డైతే మాత్రం ఇంతగా అల్లరి పెట్టవచ్చా. పూతీగెలాంటి చక్కదనాల సుందరాంగీ ఓ యశోదమ్మా! నీ కొడుకు నా కొడుకును పట్టుకొని వాడి పొట్ట నిండిపోయినా వదలకుండా బలవంతంగా బానెడు వెన్న పట్టించేసాడు. వాడికి ఊపిరి ఆడటం లేదు. మా వాడిని తీసుకు వచ్చి చూపిస్తా. ఇదిగో వాడి కేమైనా అయిందంటే నీదే బాధ్యత సుమా.


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=45&padyam=323


: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Friday, May 25, 2018

శ్రీకృష్ణ లీలలు - 18

10.1-320-క.
వ్రాలఁగ వచ్చిన నీ సతి
"చూలాలం దలఁగు" మనుడు "జూ లగుటకు నే
మూలంబు జెప్పు" మనె నీ 
బాలుఁడు; జెప్పుదురె సతులు? పర్వేందుముఖీ!
10.1-321-క.
మగువా! నీ కొమరుఁడు మా
మగవా రటు పోవఁ జూచి మంతనమునకుం
దగఁ జీరి పొందు నడిగెను
జగముల మున్నిట్టి శిశువు చదువంబడెనే?

భావము:
ఓ యశోదమ్మా! నీ కొడుకు ఈ ఇల్లాలు ఒళ్ళో కూర్చోడానికి వచ్చేడు. ఈమె “గర్భవతిని దూరంగా ఉండు అంది”. “ గర్భవతివి కావటానికి కారణం ఏమిటి చెప్పు” అని అడుగుతున్నాడు నీ కొడుకు. సుందరి! ఈ తెలివితేటలకు నిండుపున్నమి నాటి చందమామలా నీ మోము వికసించిందిలే. కాని, అలా అడిగితే ఆడవాళ్ళు ఎవరైనా చెప్తారుటమ్మా. ఓ ఇల్లాలా! మా మగవాళ్ళు బైటకు వెళ్ళటం చూసి రహస్యం చెప్పాలి దగ్గరకి రా అని పిలిచి, నీ కొడుకు క్రీడిద్దాం వస్తావా అని అడిగాడు. ఇలా అడిగే పసిపిల్లాడు ఉన్నా డని ఇంతకు ముందెప్పుడైనా విన్నామా?
గోపికలు యశోదకి చెప్పిన బాలకృష్ణుని అల్లరి ఇది. ఇక్కడ పాలపర్తి నాగేశ్వర శాస్త్రి గారు చెప్పిన విశేషార్థం చూడండి. అసంభవ నాదుల చేత బ్రహ్మైక్యం భంగపరచే దుర్వృత్తులు లే నప్పుడు, రహస్యమున నా యం దైక్యము గమ్మని పిలిచేడు. (ఉపనిషత్ ప్రమాణం – చిదేవాహం చిదేవత్వం సర్వ మే త చ్చిదేవహి.)

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=45&padyam=321

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Thursday, May 24, 2018

శ్రీకృష్ణ లీలలు - 17

10.1-318-క.
కొడుకులు లేరని యొక సతి
కడు వగవఁగఁ దన్ను మగనిఁగాఁ గైకొనినం
గొడుకులు గలిగెద రని పైఁ
బడినాఁ డిది వినుము శిశువు పనులే? తల్లీ!
10.1-319-క.
"తలఁగినదానం దల" మనఁ
దలఁగక యా చెలికి నాన తలయెత్తఁగ "నీ
తలఁగిన చోటెయ్యది" యని
తల యూఁచెన్ నీ సుతుండు తగవె? మృగాక్షీ!


భావము:
ఓ యమ్మా యశోదా! ఈ విచిత్రం విను. ఓ యిల్లాలు తనకు కొడుకులు లేరే “అపుత్రస్య గతిర్నాస్తిః” అని శాస్త్రం కదా మరి మా గతేంటి అని బాధపడుతుంటే, “నన్ను మొగుడుగా చేసుకో కొడుకులు పుడతారు” అని మీదమీదకి వచ్చాడుట మీ వాడు. ఇవేమైనా పసివాడి పనులా చెప్పు.
అవును అతనేమైనా పసివాడా కాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే కదా. పరబ్రహ్మస్వరూపు డైన తన్ను భర్తగా స్వీకరించ మని సద్గతులు కలుగుతాయి అని నొక్కి చెప్పే, ఆ కపట శైశవ కృష్ణమూర్తి దొంగజాడల బాల్యచేష్టలను చేస్తున్నాడు. చక్కని లేడికన్నులవంటి కళ్ళు నీ కున్నాయిలే కాని ఓ యశోదమ్మ! ఇటు చూడు. ఈ అమ్మాయి “బహిష్ఠు అయ్యాను దూరంగా ఉండు” అంటే, నీ పుత్రుడు తప్పుకోడు. పైగా తలూపుతూ “బహిష్ఠు అయిన చోటేది” అని అడిగాడుట. ఈ అమ్మాయేమో పాపం సిగ్గుతో చితికిపోయింది. ఇదేమైనా బావుందా చెప్పు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Tuesday, May 22, 2018

శ్రీకృష్ణ లీలలు - 16

10.1-316-క.
చేబంతి దప్పి పడెనని 
ప్రాబల్యముతోడ వచ్చి భవనము వెనుకన్
మా బిడ్డ జలక మాడఁగ
నీ బిడ్డఁడు వలువఁ దెచ్చె నెలఁతుక! తగునే?
10.1-317-క.
ఇచ్చెలువఁ జూచి "మ్రుచ్చిలి
యచ్చుగ నుఱికించుకొనుచు నరిగెద; నాతో
వచ్చెదవా?" యని యనినాఁ
డిచ్చిఱుతఁడు; సుదతి! చిత్ర మిట్టిది గలదే?

భావము:
ఓ యింతి! తన చేతి ఆట బంతి ఎగిరివచ్చి పడిందని దబాయింపుగా మా పెరట్లోకి వచ్చేసాడు. అప్పుడు మా అమ్మాయి స్నానం చేస్తోంది. మీ అబ్బాయి చీర తీసుకొని పారిపోయాడు, ఇదేమైనా బావుందా చెప్పమ్మా యశోదా! ఈ చక్కటామెను “దొంగతనంగా లేవదీసుకుపోతాను, నాతో వచ్చేస్తావా” అని అడిగాడట మీ చిన్నాడు. విన్నావా యశోదమ్మ తల్లీ! ఇలాంటి విచిత్రం ఎక్కడైనా చూసామా చెప్పు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=45&padyam=316

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలలు - 15

10.1-314-క.
వెన్నఁ దినఁగఁ బొడగని మా
పిన్నది యడ్డంబు వచ్చి పిఱిఁదికిఁ దివియన్
జన్నొడిసి పట్టి చీఱెనుఁ
జిన్ని కుమారుండె యితఁడు? శీతాంశుముఖీ!
10.1-315-క.
ఇమ్మగువ దన్ను వాకిటఁ 
గ్రుమ్మరుచోఁ జీరి నిలిపికొని పే రడుగం
గెమ్మోవిఁ గఱచి వడిఁ జనె
నమ్మా! యీ ముద్దుగుఱ్ఱఁ డల్పుఁడె? చెపుమా.


భావము:
చంద్రముఖీ! యశోదమ్మా! మా ఇంట్లోకి చొరబడి నీ కొడుకు వెన్న తింటున్నాడు. అది చూసి మా చిన్నమ్మాయి అడ్డంవెళ్ళి ఇవతలకి లాగింది. మీ వాడు మా పడచుపిల్ల రొమ్ముమీద గోళ్ళతో గీరేసి పారిపోయాడు. చంద్రుళ్ళా వెలిగిపోతున్న ముఖం పెట్టుకొని మరీ చూస్తున్నావు గాని చెప్పవమ్మా! ఇవి పసిపిల్లలు చేసే పనులా. ఈ ఇల్లాలు వాకిట్లోంచి వెళ్తున్న నీ పిల్లాడ్ని పిలిచి నిలబెట్టి పేరు అడిగింది. మీ వాడు చటుక్కున ఆమె పెదవి కొరికి పారిపోయాడు. ఓ యమ్మో! మీ ముద్దుల కొడుకు తక్కువ వాడేం కాదు తెలుసా.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Sunday, May 20, 2018

శ్రీకృష్ణ లీలలు - 14

10.1-312-క.
వా రిల్లు చొచ్చి కడవలఁ
దోరంబగు నెయ్యిఁ ద్రావి తుది నా కడవల్
వీరింట నీ సుతుం డిడ
వారికి వీరికిని దొడ్డ వా దయ్యె సతీ!
10.1-313-క.
"వేలుపులఁటె; నా కంటెను
వేలుపు మఱి యెవ్వ" రనుచు వికవిక నగి మా
వేలుపుల గోడపై నో
హేలావతి! నీ తనూజుఁ డెంగిలిఁ జేసెన్.


భావము:
ఓ యిల్లాలా! మీ సుపుత్రుడు వాళ్ళింట్లోకి దూరి ఘమఘమలాడే నె య్యంతా తాగేసి, చివరకి ఆ కుండలు వీళ్ళింట్లో పడేసి పోయాడు. దాంతో వాళ్ళకీ వీళ్ళకీ పెద్ద గొడవ అయిపోయింది తెలుసా? ఓ యమ్మ! యశోదమ్మ! గొప్పగా నవ్వేవు గాని దీనికేమంటావు. మా యింట్లో దేవతలను చిత్రించిన గోడను చూసి, “వీళ్ళా దేవతలు? నాకంటె వేరె దేవతలు ఎవరున్నారు?” అంటు పకపక నవ్వుతూ నీ కొడుకు గోడమీద ఎంగిలి చేసాడు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :