Sunday, May 20, 2018

శ్రీకృష్ణ లీలలు - 14

10.1-312-క.
వా రిల్లు చొచ్చి కడవలఁ
దోరంబగు నెయ్యిఁ ద్రావి తుది నా కడవల్
వీరింట నీ సుతుం డిడ
వారికి వీరికిని దొడ్డ వా దయ్యె సతీ!
10.1-313-క.
"వేలుపులఁటె; నా కంటెను
వేలుపు మఱి యెవ్వ" రనుచు వికవిక నగి మా
వేలుపుల గోడపై నో
హేలావతి! నీ తనూజుఁ డెంగిలిఁ జేసెన్.


భావము:
ఓ యిల్లాలా! మీ సుపుత్రుడు వాళ్ళింట్లోకి దూరి ఘమఘమలాడే నె య్యంతా తాగేసి, చివరకి ఆ కుండలు వీళ్ళింట్లో పడేసి పోయాడు. దాంతో వాళ్ళకీ వీళ్ళకీ పెద్ద గొడవ అయిపోయింది తెలుసా? ఓ యమ్మ! యశోదమ్మ! గొప్పగా నవ్వేవు గాని దీనికేమంటావు. మా యింట్లో దేవతలను చిత్రించిన గోడను చూసి, “వీళ్ళా దేవతలు? నాకంటె వేరె దేవతలు ఎవరున్నారు?” అంటు పకపక నవ్వుతూ నీ కొడుకు గోడమీద ఎంగిలి చేసాడు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: