10.1-318-క.
కొడుకులు లేరని యొక సతి
కడు వగవఁగఁ దన్ను మగనిఁగాఁ గైకొనినం
గొడుకులు గలిగెద రని పైఁ
బడినాఁ డిది వినుము శిశువు పనులే? తల్లీ!
10.1-319-క.
"తలఁగినదానం దల" మనఁ
దలఁగక యా చెలికి నాన తలయెత్తఁగ "నీ
తలఁగిన చోటెయ్యది" యని
తల యూఁచెన్ నీ సుతుండు తగవె? మృగాక్షీ!
భావము:
ఓ యమ్మా యశోదా! ఈ విచిత్రం విను. ఓ యిల్లాలు తనకు కొడుకులు లేరే “అపుత్రస్య గతిర్నాస్తిః” అని శాస్త్రం కదా మరి మా గతేంటి అని బాధపడుతుంటే, “నన్ను మొగుడుగా చేసుకో కొడుకులు పుడతారు” అని మీదమీదకి వచ్చాడుట మీ వాడు. ఇవేమైనా పసివాడి పనులా చెప్పు.
అవును అతనేమైనా పసివాడా కాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే కదా. పరబ్రహ్మస్వరూపు డైన తన్ను భర్తగా స్వీకరించ మని సద్గతులు కలుగుతాయి అని నొక్కి చెప్పే, ఆ కపట శైశవ కృష్ణమూర్తి దొంగజాడల బాల్యచేష్టలను చేస్తున్నాడు. చక్కని లేడికన్నులవంటి కళ్ళు నీ కున్నాయిలే కాని ఓ యశోదమ్మ! ఇటు చూడు. ఈ అమ్మాయి “బహిష్ఠు అయ్యాను దూరంగా ఉండు” అంటే, నీ పుత్రుడు తప్పుకోడు. పైగా తలూపుతూ “బహిష్ఠు అయిన చోటేది” అని అడిగాడుట. ఈ అమ్మాయేమో పాపం సిగ్గుతో చితికిపోయింది. ఇదేమైనా బావుందా చెప్పు.
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment