Wednesday, May 30, 2018

శ్రీకృష్ణ లీలలు - 19

10.1-322-క.
నమ్మి నిదురబోవ నా పట్టిచుంచు మా
లేఁగతోఁకతోడ లీలఁ గట్టి
వీథులందుఁ దోలె వెలది! నీ కొమరుండు; 
రాచబిడ్డఁ డైన ఱవ్వ మేలె?
10.1-323-క.
నా పట్టి పొట్ట నిండఁగఁ
బై పడి నీ పట్టి వెన్న బానెం డిడినాఁ; 
డూపిరి వెడలదు; వానిం
జూపెద నేమైన నీవ సుమ్ము లతాంగీ!


భావము:
ఓ ఉత్తమురాలా! యశోదమ్మా! నా కొడుకు ఆడి ఆడి అలసి నిద్రపోయాడు. నీ సుపుత్రుడు వచ్చి నా కొడుకు జుట్టును మా లేగదూడ తోకకు కట్టి, దాన్ని వీథు లమ్మట తోలాడు. ఎంత గొప్ప నాయకుడి పిల్లా డైతే మాత్రం ఇంతగా అల్లరి పెట్టవచ్చా. పూతీగెలాంటి చక్కదనాల సుందరాంగీ ఓ యశోదమ్మా! నీ కొడుకు నా కొడుకును పట్టుకొని వాడి పొట్ట నిండిపోయినా వదలకుండా బలవంతంగా బానెడు వెన్న పట్టించేసాడు. వాడికి ఊపిరి ఆడటం లేదు. మా వాడిని తీసుకు వచ్చి చూపిస్తా. ఇదిగో వాడి కేమైనా అయిందంటే నీదే బాధ్యత సుమా.


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=45&padyam=323


: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




1 comment:

Unknown said...

nice information.
www.youtube.com/channel/UCJMx6_3I6oTEC858UVMuyzg/videos
plz watch our channel