Saturday, October 8, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౯(649)

( భూభారంబు వాపుట ) 

11-8-వ.
అని వితర్కించి జగదీశ్వరుం “డత్యున్నత వేణుకాననంబు వాయువశంబున నొరసికొన ననలం బుద్భవంబయి దహించు చందంబున యదుబలంబుల కన్యోన్య వైరానుబంధంబులు గల్పించి హతం బొనర్చెద” నని విప్రశాపంబు మూలకారణంబుగాఁ దలంచి యదుబలంబుల నడంచె" నని పలికిన మునివరునకు రాజేంద్రుం డిట్లనియె.

భావము:
ఇలా తర్కించుకొని లోకనాయకుడైన వాసుదేవుడు చాలా ఎత్తైన వెదురు పొదల అడవిలో పుట్టిన గాలికి వెదురులు ఒరుసుకుని నిప్పు పుడుతుంది. ఆ అగ్నిలో తనకు తానే కాలిపోతుంది. అదే విధంగా యదుబలాలకు పరస్పర విరోధాలు కల్పించి నాశనం చేయాలని నిశ్చయించాడు. దానికి మూలకారణం బ్రాహ్మణశాపం కావాలని తలచాడు. ఆ ప్రకారమే యాదవనాశనం కలిగించాడు.” అని పలికిన శుకమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=1&Padyam=8

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Friday, October 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౮(648)

( భూభారంబు వాపుట ) 

11-6-మ.
విదితుండై సకలామరుల్‌ గొలువ నుర్వీభారమున్‌ మాన్పి, దు
ర్మద సంయుక్త వసుంధరాధిపతులన్‌ మర్దించి, కంసాదులం
దుదిముట్టన్‌ వధియించి, కృష్ణుఁ డతిసంతుష్టాత్ముఁడై యున్నచో
యదుసైన్యంబులు భూమి మోవఁగ నసహ్యం బయ్యె నత్యుగ్రమై.
11-7-సీ.
ఈ రీతి శ్రీకృష్ణుఁ డేపారఁ బూతనా-
  శకట తృణావర్త సాల్వ వత్స
చాణూర ముష్టిక ధేను ప్రలంబక-
  దైత్యాఘ శిశుపాల దంతవక్త్ర
కంస పౌండ్రాదిక ఖండనం బొనరించి-
  యటమీఁదఁ గురుబలం బణఁచి మఱియు
ధర్మజు నభిషిక్తుఁ దనరఁగాఁ జేసిన-
  నతఁడు భూపాలనం బమరఁ జేసె
11-7.1-తే.
భక్తులగు యాదవేంద్రులఁ బరఁగఁ జూచి
"యన్యపరిభవ మెఱుఁగ రీ యదువు లనుచు
వీరిఁ బరిమార్ప నేఁ దక్క వేఱొకండు
దైవ మిఁక లేదు త్రిభువనాంతరమునందు. "

భావము:
దుర్మదాందులైన రాజులను మర్దించి, కంసుడు మొదలైనవారిని సంహరించి భూమికి బరువును తగ్గించి నందనందనుడు దేవతలందరూ తనను కొలుస్తుండగా ప్రసిద్ధుడు అయ్యాడు. అలా శ్రీకృష్ణుడు మిక్కిలి సంతుష్టితో ఉండగా యదుసైన్యాలు విజృంభించి భూమి మోయలేని స్థితి వచ్చింది.
ఇలాగ, మహానుభావుడైన శ్రీకృష్ణుడు అతిశయించి; పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, వత్సాసురుడు, ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు మున్నగు రాక్షసులను; చాణూర, ముష్టికులను; కంస, సాల్వ, పౌండ్రక, శిశుపాల, దంతవక్త్రులను సంహరించాడు. అంతేకాక కౌరవసైన్యాన్ని అణచివేసి ధర్మరాజును చక్రవర్తిగా అభిషేకించాడు. ధర్మరాజు భూపాలనం చేస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు “తన భక్తులైన యాదవులు ఇతరుల వలన ఓటమి లేని వారు. వీరిని సంహరించడానికి నేను తప్ప మరొక దైవం ముల్లోకాల యందు లేడు” అని ఆలోచించాడు

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=1&Padyam=7

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

శ్రీకృష్ణ విజయము - ౬౪౭(647)

( భూభారంబు వాపుట ) 

11-3-మ.
"బలవత్సైన్యముతోడఁ గృష్ణుఁడు మహాబాహా బలోపేతుఁడై
కలనన్‌ రాక్షసవీరవర్యుల వడిన్‌ ఖండించి, భూభారము
జ్జ్వలమై యుండఁగ ద్యూతకేళి కతనం జావంగఁ గౌరవ్య స
ద్బలముంబాండవ సైన్యమున్నడఁచె భూభాగంబు గంపింపఁగన్‌.
11-4-వ.
అంత.
11-5-క.
మునివరులు సంతసిల్లిరి
యనయము నందాదులకును హర్షం బయ్యెం;
దన నిజభక్తులు యాదవ
ఘనవీరసమూహ మపుడు గడు నొప్పెసఁగెన్‌.

భావము:
“శ్రీకృష్ణుడు మిక్కిలి బలమైన సైన్యంతో గొప్ప భుజబలం కలవాడై యుద్ధంలో గొప్ప రాక్షసవీరులను వడివడిగా వధించాడు. భూభారం ఇంకా ఎక్కువగా ఉండటం చేత ద్యూతక్రీడ వంక పెట్టి భూమి అదిరిపోయేలా కౌరవపాండవ యుద్ధం జరిపించి ఉభయ సైన్యాలను హతమార్చాడు. అప్పుడు మునీశ్వరులు, ఆ దుష్ట శిక్షణకు సంతోషించారు. తన భక్తులు, మహావీరులు అయిన యాదవులు అప్పుడు మిక్కిలి వృద్ధిచెందుతుండుట చూసి నందుడు మొదలైనవారు చాలా సంతోషించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=1&Padyam=5

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, October 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౬(646)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1338-క.
అని యిట్లు బాదరాయణి
మనమున రాగిల్ల నాభిమన్యునకుం జె
ప్పిన విధమున సూతుఁడు ముని
జనుల కెఱింగింప వారు సమ్మతితోడన్.
10.2-1339-క.
సూతుని బహువిధముల సం
ప్రీతునిఁ గావించి మహిమఁ బెంపారుచు వి
ఖ్యాతికి నెక్కిన కృష్ణక
థాతత్పరు లైరి బుద్ధిఁ దఱుఁగని భక్తిన్.

భావము:
ఈరీతిగా శుకమహర్షి పరీక్షన్మహారాజు మనసు రంజిల్లేలా చెప్పిన ప్రకారంగా సూతుడు శౌనకాది మహామునులకు ప్రవచించాడు. వారెంతో సంతోషించారు. ఆ మునులు సూతుడిని అనేక విధముల సత్కరించి, అతనిని పూర్తి సంతుష్టుని చేసారు. వారందరు కూడ శ్రీకృష్ణకథలపై మిక్కిలి ఆసక్తి తఱగని భక్తి లభించాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=88&Padyam=1339

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Tuesday, October 4, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౫(645)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1336-వ.
ఇవ్విధంబున గోపికాజన మనోజాతుండైన కృష్ణుండు లీలామా నుష విగ్రహుండై నిజరాజధాని యైన ద్వారకాపురంబున నమానుష విభవంబు లగు సౌఖ్యంబులం బొదలుచుండె” నని చెప్పి మఱియు నిట్లనియె.
10.2-1337-మ.
"మనుజేంద్రోత్తమ! యేను నీకుఁ ద్రిజగన్మాంగల్యమై యొప్పఁ జె
ప్పిన యీ కృష్ణకథాసుధారసము సంప్రీతాత్ములై భక్తిఁ గ్రో
లిన పుణ్యాత్ములు గాంతు రిందు సుఖముల్‌; నిర్ధూతసర్వాఘులై
యనయంబుం దుదిఁ గాంతు రచ్యుతపదం బై నట్టి కైవల్యమున్. "

భావము:
ఈలాగున గోపికామన్మథుడు అయిన శ్రీకృష్ణుడు లీలామానుష రూపం ధరించినవాడు అయి తన రాజధాని ఐన ద్వారకలో లోకాతీత సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నాడు.” అని చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో మరల ఇలా అన్నాడు. “ఓ మహారాజా! నేను నీకు చెప్పిన ఈ శ్రీకృష్ణకథారసం ముల్లోకాలకూ శుభదాయకమైనది. భక్తితో ఆస్వాదించే పుణ్యాత్ములు ఈ లోకంలో సుఖాలను పొందుతారు. వారి పాపాలు సమస్తము తొలగిపోతాయి. తుదకు శాశ్వతమైన కైవల్యాన్ని అందుకుంటారు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=88&Padyam=1337

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Sunday, October 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౪(644)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1334-మ.
"పరమోత్సాహముతోడ మాధవుఁడు శుంభల్లీలఁ బూరించు న
మ్మురళీగానము వీనులం జిలికినన్ మోదించి గోపాల సుం
దరు లేతెంతు రరణ్యభూములకుఁ; దద్దాస్యంబు గామించి య
క్కరుణావార్థి భజింప కుందురె బుధుల్‌ కౌరవ్యవంశాగ్రణీ!
10.2-1335-మ.
మతినెవ్వాని యమంగళఘ్న మగు నామం బర్థిఁ జింతించినన్
నుతిగావించిన విన్న మానవులు ధన్యుల్‌; భూరిసంసార దు
ష్కృతులం ద్రోతురు; కాలచక్ర మహితాసిం బట్టి యా కృష్ణుఁ డీ
క్షితిభారం బుడుగంగఁ జేయు టిది యే చిత్రంబు? భూవల్లభా!

భావము:
“ఓ కురుకులోత్తమరాజ! మహోత్సాహంతో శ్రీకృష్ణుడు మురళిని మ్రోగిస్తే ఆ గానం చెవులలో సోకగానే కృష్ణుడిని సేవించాలనే కాంక్షతో సుందర గోపికలు పరమానందంతో బృందావన ప్రాంతా అడవులకు పరుగెత్తుకుని వస్తారు. ప్రాజ్ఞులైనవారు ఆ కరుణామూర్తిని ఆయన సేవను కోరి పూజించకుండా ఎవరు ఉండలేరు కదా. రాజేంద్రా! అశుభాన్నితొలగించే శ్రీకృష్ణుడి నామాన్ని చింతించేవారు, వినేవారు గొప్ప ధన్యులు. వారు సంసారపరమైన కష్టాల నుంచి విముక్తులు అవుతారు. కాలచక్రమనే ఆయుధాన్ని ధరించిన శ్రీకృష్ణుడు ఈ లోకభారాన్ని పోగొట్టడంలో విచిత్రము ఏముంది

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=88&Padyam=1335

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

Saturday, October 1, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౩(643)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1333-వ.
అట్టి యన్వయంబు నందు మాధవునకు రుక్మిణీదేవి యందుఁ బితృసముండును, సమగ్ర భుజావిజృంభణుండును నై ప్రద్యుమ్నుండు జనియించె; నతనికి రుక్మికూఁతురగు శుభాంగివలన ననిరుద్ధం డుదయించె; నతనికి మౌసలావశిష్టుండైన ప్రజుండు సంభవించె; నతనికిఁ బ్రతిబాహుండుపుట్టె; వానికి సుబాహుండు జన్మించె; నతనికి నుగ్రసేనుండుప్రభవించె; నతనికి శ్రుతసేనుండు గలిగె; నిట్లు యదు వృష్టి భోజాంధక వంశంబులు పరమ పవిత్రంబులై పుండరీకాక్షుని కటాక్షవీక్షణ శయ్యాసనానుగత సరసాలాప స్నానాశన క్రీడావినోదంబుల ననిశంబునుం జెందుచు, సర్వదేవతార్థంబు సమస్తంబైన క్రతువు లొనరింపుచుఁ బరమానంద కందళిత చిత్తులై యుండి" రని చెప్పి వెండియు.

భావము:
అలాంటి వంశంలో శ్రీకృష్ణునికి రుక్మిణివల్ల ప్రద్యుమ్నుడు పుట్టాడు. అతడు అన్నిటా తండ్రి వంటివాడు మహాభుజబలం కలవాడు అతని భార్య రుక్మి కూతురు శుభాంగి. ఆమెకు అనిరుద్ధుడు జన్మించాడు. అతనికి ప్రజుడు పుట్టాడు. ఇతను మాత్రమే ముసలం బారినుండి తప్పించుకున్నాడు. ఆ ప్రజుడికి ప్రతిబాహుడు, ప్రతిబాహుడికి సుబాహుడు పుట్టారు. అతనికి ఉగ్రసేనుడు జన్మించాడు. ఈ విధంగా యదు, వృష్ణి, భోజ, అంధక, వంశాలు పవిత్రాలు అయ్యాయి. కృష్ణుడితో సహవాసంచేస్తూ ఆయన కటాక్షవీక్షణలు అందుకుంటు, ఆయనతో కంచాలు మంచాలు ఆసనాలు పంచుకుంటు, కలిసి స్నానాలు భోజనాలు చేస్తు, వినోదాలలో పాల్గొంటు, సకల దేవతలను ఉద్దేశించి యాగాలు చేస్తూ యాదవులు పరమానందం పొందుతూ జీవించారు.” అని చెప్పిన శుకమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=88&Padyam=1333

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :