Tuesday, October 4, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౫(645)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1336-వ.
ఇవ్విధంబున గోపికాజన మనోజాతుండైన కృష్ణుండు లీలామా నుష విగ్రహుండై నిజరాజధాని యైన ద్వారకాపురంబున నమానుష విభవంబు లగు సౌఖ్యంబులం బొదలుచుండె” నని చెప్పి మఱియు నిట్లనియె.
10.2-1337-మ.
"మనుజేంద్రోత్తమ! యేను నీకుఁ ద్రిజగన్మాంగల్యమై యొప్పఁ జె
ప్పిన యీ కృష్ణకథాసుధారసము సంప్రీతాత్ములై భక్తిఁ గ్రో
లిన పుణ్యాత్ములు గాంతు రిందు సుఖముల్‌; నిర్ధూతసర్వాఘులై
యనయంబుం దుదిఁ గాంతు రచ్యుతపదం బై నట్టి కైవల్యమున్. "

భావము:
ఈలాగున గోపికామన్మథుడు అయిన శ్రీకృష్ణుడు లీలామానుష రూపం ధరించినవాడు అయి తన రాజధాని ఐన ద్వారకలో లోకాతీత సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నాడు.” అని చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో మరల ఇలా అన్నాడు. “ఓ మహారాజా! నేను నీకు చెప్పిన ఈ శ్రీకృష్ణకథారసం ముల్లోకాలకూ శుభదాయకమైనది. భక్తితో ఆస్వాదించే పుణ్యాత్ములు ఈ లోకంలో సుఖాలను పొందుతారు. వారి పాపాలు సమస్తము తొలగిపోతాయి. తుదకు శాశ్వతమైన కైవల్యాన్ని అందుకుంటారు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=88&Padyam=1337

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: