Thursday, September 8, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౨౨(622)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1292-చ.
లలిత విశిష్ట సంచిత జలంబుల నాచమనంబు సేసి, సు
స్థలమున నిల్చి రుద్రునకు సమ్మతి మ్రొక్కి మహాస్త్రవేది ని
ర్మల శుభమంత్ర దేవతల మానసమందుఁ దలంచి గాండివం
బలవడ నెక్కు ద్రోచి బిగియం గదియించి నిషంగయుగ్మమున్.
10.2-1293-వ.
ఇవ్విధంబునఁ గట్టాయితంబై యప్పుడు.

భావము:
విశిష్టమైన పవిత్రజలాలతో ఆచమనం చేసాడు. పరిశుద్ధ ప్రదేశంలో నిలబడి శివుడికి నమస్కరించాడు. గొప్పగొప్ప అస్త్రాలను వేయగలిగిన అర్జునుడు శుభప్రదులైన మంత్రదేవతలను మనసున తలచుకుని గాండీవాన్ని ఎక్కుపెట్టి పట్టుకున్నాడు. అమ్ముల పొదులు రెంటినీ కట్టుకున్నాడు. ఈ విధంగా సంసిద్ధుడు అయిన అర్జునుడు అంతట....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1292

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, September 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౨౧(621)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1291-వ.
అని నమ్మంబలికిన యర్జును ప్రతిజ్ఞకు భూసురుండు మనంబున నూఱడిల్లి యతని నభినందించుచు నిజ మందిరంబునకు జని; కొన్ని దినంబు లుండునంత భార్యకుం బ్రసూతివేదనా సమయంబయినం జనుదెంచి వివ్వచ్చుం గని తద్విధం బెఱింగించిన నయ్యింద్రనందనుం డప్పుడు.

భావము:
ఇలా నమ్మకంగా పలికిన పార్థుడి మాటలపై బ్రాహ్మణుడి మనసు శాంతించింది. అతడు నరుని కొనియాడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నిదినాలు గడిచాయి. విప్రుడి భార్యకు మళ్ళీ ప్రసవవించే సమయం సమీపించింది. భూసురుడు వెంటనే వచ్చి పరమ భీభత్సంగా యుద్ధంచేసే వాడైన అర్జునుడికి ఈ విషయం చెప్పాడు. ఆ ఇంద్రపుత్రుడు అంతట...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1291

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, September 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౨౦(620)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1288-మ.
"బలుఁడంగాను; మురాసురాంతకుఁడఁగాఁ; బ్రద్యుమ్నుఁడంగాను; నేఁ
దెలియం దత్తనయుండఁగా"నని "విరోధివ్రాతమున్ భీషణో
జ్జ్వలగాండీవ ధనుర్విముక్త నిశితాస్త్రశ్రేణిచేఁ బీన్గుపెం
టలు గావించు పరాక్రమప్రకటచండస్ఫూర్తి నేఁ బార్థుఁడన్.
10.2-1289-వ.
అదియునుం గాక.
10.2-1290-చ.
బలిమిఁ బురాంతకుం దొడరి బాహువిజృంభణమొప్ప నెక్కటిం
దలపడి పోరినట్టి రణధైర్యుని నన్ను నెఱుంగ వక్కటా!
పెలుకుఱ మృత్యుదేవతను బింకమడంచి భవత్తనూజుల
న్నలవుఁజలంబుఁ జూపి కొనియాడఁగ నిప్పుడతెచ్చియిచ్చెదన్. "

భావము:
“నేను బలరాముడినికాను కృష్ణుడిని కాను; ప్రద్యుమ్నుడిని కాను; అతని కొడుకైన అనిరుద్ధుడిని కాను. యుద్ధంలో నా భీకరమైన గాండీవం నుండి వెలువడే వాడిబాణాలతో శత్రువులను చీల్చిచెండాడే మహాపరాక్రమం కలిగిన నేను అర్జునుడిని. అంతేకాక అయ్యా! ఆ పరమశివుడినే ఎదిరించి పోరాడి భుజబలం చూపిన నన్నే ఎరుగవా? మృత్యుదేవత పొగరు అణచి, నా పట్టు ప్రదర్శించి, నీ పుత్రులను ఇప్పుడే తీసుకు వచ్చి ఇస్తాను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1290

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, September 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౯(619)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1286-తే.
వినుతబలు లైన యాదవ వీరవరులుఁ
గలుగ వారలచేఁ గాని కార్య మీవు
చక్కఁబెట్టుట యెట్లు? నీచనెడు త్రోవఁ
బొమ్ము" నావుడు నయ్యింద్రపుత్త్రుఁ డపుడు
10.2-1287-క.
మనమున దురహంకారము
ఘనముగఁ బొడముటయు, నపుడు కవ్వడి విప్రుం
గనుఁగొని యచ్చటిజనములు
వినఁగా నిట్లనియె రోషవిహ్వలమతియై.

భావము:
ప్రశంసించదగిన బలం కలిగిన యాదవవీరులు ఉండగా, వారిచేతనే కాని పనిని చక్కపెట్టడం నీవు ఎలా చేయగలవు కానీ, నీ దారిన నీవు వెళ్ళు.” ఇలా అంటున్న ఆ బ్రాహ్మణుడి మాటలు వినిన ఇంద్రతనయుడు అర్జునుడి మనసులో దురహంకారం పెచ్చుమీరింది. రెండు చేతులతో వడిగా బాణాలు వేయగలిగిన ఆ మహావీరుడు రోషంతో వశంతప్పి, అక్కడి జనాలు అందరు వినేలా విప్రుడితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1287

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, September 4, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౮(618)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1284-క.
"ఈ పగిది నీవు వగలన్
వాపోవఁగఁ జూచి యకట! వారింపంగా
నోపిన విలుకాఁ డొక్కం
డీ పురి లేఁ డయ్యె నయ్య! యిది పాపమగున్.
10.2-1285-సీ.
పుత్త్రులఁ గోల్పోయి భూరిశోకంబున-
  వనటఁ బొందుచు విప్రవరులు సాల
నే రాజురాజ్య మందేని వసించుదు-
  రా రాజుఁ దలపోయ నవనిమీఁద
నటునిఁగా నాత్మ నెన్నం దగు; నీ పుత్త్రు-
  నే బ్రతికించెద నిపుడ పూని
యటు సేయనైతి నే ననలంబు సొచ్చెద"-
  నని భూసురుఁడు వెఱఁగందఁ బలుక
10.2-1285.1-తే.
నతఁడు విని "యీ వెడఁగుమాట లాడఁ దగునె?
భూరివిక్రమశాలి రాముండు మేటి
బలుఁడు హరియును శౌర్యసంపన్ను లనఁగఁ
దనరు ప్రద్యుమ్నుఁ డతని నందనుఁడు మఱియు.

భావము:
“అయ్యా! ఇలా నీవు దుఃఖిస్తుంటే చూసి ఈ అన్యాయాన్ని వారించే సమర్ధత గల విలుకాడు ఒక్కడు అయినా ఈ నగరంలో లేడా? ఇది పాపము. ఈలోకంలో అధికంగా ఎవరి రాజ్యంలో కన్నబిడ్డల్ని పోగొట్టుకుని దుర్భరశోకంతో పరితపించే బ్రాహ్మణులు ఉంటారో, ఆ రాజు రాజు కాడు కేవలం వేషగాడు మాత్రమే. నీ కుమారుడిని నేను బ్రతికిస్తాను అలా చేయకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను.” ఈ పలుకులు వినిన బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి ఇలాగా అన్నాడు. “అయ్యా! ఇలాంటి అవివేకపు మాటలు పలుక తగదు. మహా వీరులు, మహా బలశాలురు అయిన బలరామకృష్ణులు, కృష్ణకుమారుడు ప్రద్యుమ్నాదులు ఉండగా, ఇంకా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1285

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, September 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౭(617)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1283-వ.
ఇవ్విధంబున మఱియు దన సుతులు మృతులయినపు డెల్ల వారలం గొనివచ్చి యవ్విప్రుండు రాజుమొగసాలంబెట్టి రోదనంబు సేయుచు నెప్పటియట్ల కొన్నిగాథలు సదివిపోవుచుండె; నివ్విధంబున నెనమండ్రు సుతులు మృతులైనపిదపం దొమ్మిదవ సుతుండును మృతుండైన వాని నెత్తికొని వచ్చి యెప్పటి విధంబునఁ బలవరించుచున్న యా బ్రాహ్మణునిం గని యర్జునుం డిట్లనియె.

భావము:
ఈ విధంగా తనకు కొడుకులు పుట్టి మరణించిన ఎనమండుగురు కొడుకులను ప్రతిసారి, వారిని తీసుకు వచ్చి రాజమందిర ద్వారం ముందు పెట్టి, ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ మునుపటిలాగే కొన్ని కథలు చదివి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా అతనికి పుట్టి చనిపోయిన తొమ్మిదవకొడుకును కూడ ఆ బాలుని శవాన్ని తెచ్చి ఆక్రందిస్తున్న బ్రాహ్మణుడిని చూసిన అర్జునుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1283

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, September 1, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౬(616)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1282-సీ.
అధికశోకంబున నలమటఁ బొందుచు-
  నచ్చటి జనులతో ననియెఁ బెలుచ
"బ్రాహ్మణ విద్వేషపరుఁ డయి తగ శాస్త్ర-
  పద్ధతి నడవక పాపవర్తి
యై క్షత్రబంధువుఁ డగు వాని దురితంబు-
  చేత మత్పుత్త్రుండు జాతమైన
యప్పుడ మృతుఁ డయ్యె నక్కట! హింసకు-
  రోయక యెప్పు డన్యాయకారి
10.2-1282.1-తే.
యగుచు విషయానుగతచిత్తుఁ డైన యట్టి
రాజుదేశంబు ప్రజలు నిరాశు లగుచు
దుఃఖములఁ జాల వనటఁ బొందుదు ర"టంచు
నేడ్చుచును నట నిల్వక యేగె నపుడు.

భావము:
దుర్భరశోకంతో కుమిలిపోతున్న ఆ విప్రుడు అక్కడి ప్రజలతో “బ్రాహ్మణద్వేషి, శాస్త్రాచారాన్ని పాటించని వాడు, పాపాత్ముడు అయిన క్షత్రబంధువు చేసిన పాపం వలన నా కుమారుడు పుట్టగానే చచ్చిపోయాడు. దేశాన్ని ఏలే రాజు హింసను ఏవగించుకోకుండా, న్యాయానికి దూరుడు, ఇంద్రియలోలుడు అయితే ఆ ప్రజలు నిరాశతో దుఃఖాలవలన అధికమైన కష్టాలను పొందుతారు.” అని ఏడుస్తూ ఇక అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1282

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :