Tuesday, September 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౨౦(620)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1288-మ.
"బలుఁడంగాను; మురాసురాంతకుఁడఁగాఁ; బ్రద్యుమ్నుఁడంగాను; నేఁ
దెలియం దత్తనయుండఁగా"నని "విరోధివ్రాతమున్ భీషణో
జ్జ్వలగాండీవ ధనుర్విముక్త నిశితాస్త్రశ్రేణిచేఁ బీన్గుపెం
టలు గావించు పరాక్రమప్రకటచండస్ఫూర్తి నేఁ బార్థుఁడన్.
10.2-1289-వ.
అదియునుం గాక.
10.2-1290-చ.
బలిమిఁ బురాంతకుం దొడరి బాహువిజృంభణమొప్ప నెక్కటిం
దలపడి పోరినట్టి రణధైర్యుని నన్ను నెఱుంగ వక్కటా!
పెలుకుఱ మృత్యుదేవతను బింకమడంచి భవత్తనూజుల
న్నలవుఁజలంబుఁ జూపి కొనియాడఁగ నిప్పుడతెచ్చియిచ్చెదన్. "

భావము:
“నేను బలరాముడినికాను కృష్ణుడిని కాను; ప్రద్యుమ్నుడిని కాను; అతని కొడుకైన అనిరుద్ధుడిని కాను. యుద్ధంలో నా భీకరమైన గాండీవం నుండి వెలువడే వాడిబాణాలతో శత్రువులను చీల్చిచెండాడే మహాపరాక్రమం కలిగిన నేను అర్జునుడిని. అంతేకాక అయ్యా! ఆ పరమశివుడినే ఎదిరించి పోరాడి భుజబలం చూపిన నన్నే ఎరుగవా? మృత్యుదేవత పొగరు అణచి, నా పట్టు ప్రదర్శించి, నీ పుత్రులను ఇప్పుడే తీసుకు వచ్చి ఇస్తాను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1290

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: