Sunday, September 4, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౮(618)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1284-క.
"ఈ పగిది నీవు వగలన్
వాపోవఁగఁ జూచి యకట! వారింపంగా
నోపిన విలుకాఁ డొక్కం
డీ పురి లేఁ డయ్యె నయ్య! యిది పాపమగున్.
10.2-1285-సీ.
పుత్త్రులఁ గోల్పోయి భూరిశోకంబున-
  వనటఁ బొందుచు విప్రవరులు సాల
నే రాజురాజ్య మందేని వసించుదు-
  రా రాజుఁ దలపోయ నవనిమీఁద
నటునిఁగా నాత్మ నెన్నం దగు; నీ పుత్త్రు-
  నే బ్రతికించెద నిపుడ పూని
యటు సేయనైతి నే ననలంబు సొచ్చెద"-
  నని భూసురుఁడు వెఱఁగందఁ బలుక
10.2-1285.1-తే.
నతఁడు విని "యీ వెడఁగుమాట లాడఁ దగునె?
భూరివిక్రమశాలి రాముండు మేటి
బలుఁడు హరియును శౌర్యసంపన్ను లనఁగఁ
దనరు ప్రద్యుమ్నుఁ డతని నందనుఁడు మఱియు.

భావము:
“అయ్యా! ఇలా నీవు దుఃఖిస్తుంటే చూసి ఈ అన్యాయాన్ని వారించే సమర్ధత గల విలుకాడు ఒక్కడు అయినా ఈ నగరంలో లేడా? ఇది పాపము. ఈలోకంలో అధికంగా ఎవరి రాజ్యంలో కన్నబిడ్డల్ని పోగొట్టుకుని దుర్భరశోకంతో పరితపించే బ్రాహ్మణులు ఉంటారో, ఆ రాజు రాజు కాడు కేవలం వేషగాడు మాత్రమే. నీ కుమారుడిని నేను బ్రతికిస్తాను అలా చేయకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను.” ఈ పలుకులు వినిన బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి ఇలాగా అన్నాడు. “అయ్యా! ఇలాంటి అవివేకపు మాటలు పలుక తగదు. మహా వీరులు, మహా బలశాలురు అయిన బలరామకృష్ణులు, కృష్ణకుమారుడు ప్రద్యుమ్నాదులు ఉండగా, ఇంకా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1285

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: