Friday, August 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౦(600)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1246-క.
అని వేఁడిన నమ్మాటలు
విని మదనారాతి నవ్వి విబుధాహితు కో
రిన వరముఁ దడయ కిచ్చిన
దనుజుఁడు తద్వర పరీక్షఁ దాఁ జేయుటకున్.
10.2-1247-వ.
ఆ క్షణంబు వరదాన గర్వంబున నుద్వృత్తుండై కడంగి.
10.2-1248-క.
ఆ హరుమస్తకమునఁ గడు
సాహసమునఁ జేయి వెట్ట జడియక కదియ
"న్నోహో! తన మెచ్చులు దన
కాహా! పై వచ్చె" ననుచు నభవుఁడు భీతిన్.

భావము:
అలా అని ఆ రాక్షసుడు ప్రార్ధించాడు. అది విని శివుడు చిరునవ్వు నవ్వుతూ అతడు కోరిన వరము వెంటనే ఇచ్చాడు. ఆ రాక్షసుడు పార్వతీపతి తనకు అనుగ్రహించిన వరాన్ని పరీక్షించాలనుకున్నాడు. తక్షణమే వరగర్వంతోవాడు అహంకరించాడు. ఆ వరం పరీక్షించడానికి సిద్ధపడి ముందుకు వచ్చి. తన చేతిని పరమశివుడి తలమీద పెట్టడానికి ఆ రాక్షుసుడు తెగించాడు. “అయ్యయ్యో నేనిచ్చిన వరం నామీదకే అపాయం తెచ్చిపెట్టిందే” అని శివుడు భయపడి పరుగెత్తాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1248

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౫౯౯(599)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1243-క.
అరుదుగ వెలువడి రుద్రుఁడు
గరుణ దలిర్పంగ వానికర మాత్మకరాం
బురుహమునఁ బట్టి "తెగువకుఁ
జొర వలవదు; మెచ్చు వచ్చె సుమహిత చరితా!
10.2-1244-క.
నీమదిఁ బొడమిన కోరిక
లేమైనను వేఁడు మిపుడ యిచ్చెద" ననినం
దా మనమున సంతసపడి
యా మనుజాశనుఁడు హరుపదాంబుజములకున్.

భావము:
పరమశివుడు ఆ అగ్ని గుండంలో నుండి వెలువడి దయతో ప్రత్యక్షము అయ్యాడు. వృకాసురుని చేతిని పట్టుకుని, “సాహసించకు. నీ తపస్సుకు మెచ్చుకున్నాను. నీ మనసులో ఎట్టి కోరికలున్నా కోరుకో. వెంటనే నెరవేరుస్తాను.” అని శివుడు అనగా, వృకాసురుడు ఎంతో సంతోషపడి, శంకరుని పాదాలపై పడ్డాడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1244

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, August 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౮(598)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1242-సీ.
దీపించు కేదార తీర్థంబునకు నేగి-
  యతిసాహసాత్మకుం డగుచు నియతి
లోకముల్‌ వెఱఁగంద నా కాలకంధరు-
  వరదుని నంబికావరునిఁ గూర్చి
తన మేనికండ లుద్దండుఁడై ఖండించి-
  యగ్ని కాహుతులుగా నలర వేల్చి
దర్పకారాతి ప్రత్యక్షంబుగాకున్న;-
  జడియక సప్తవాసరము నందుఁ
10.2-1242.1-తే.
బూని తత్తీర్థమునఁ గృతస్నానుఁ డగుచు
వెడలి మృత్యువు కోఱనా వెలయునట్టి
గండ్రగొడ్డంటఁ దన మస్తకంబు దునుము
కొనఁగఁ బూనిన నయ్యగ్నికుండమునను.

భావము:
వృకాసురుడు బయలుదేరి కేదారతీర్థానికి వెళ్ళాడు. అక్కడ సాహసోపేతమైన నియమాలతో నీలకంఠుని, వరదుడిని, మహేశ్వరుడిని గురించి ఘోరతపస్సు చేసాడు. ఆ తీవ్రతపస్సు చూసి లోకాలన్నీ అచ్చెరువొందాయి. తన శరీరం లోని మాంసాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించి అగ్నికి ఆహుతి కావించాడు. అప్పటికి కూడ మదనాంతకుడు పరమశివుడు ప్రత్యక్షం కాలేదు. వృకాసురుడు పట్టువదలక కేదారతీర్ధంలో స్నానం చేసి మృత్యుకోరవంటి భయంకరమైన గండ్రగొడ్డలితో తన తలని నఱికుకొనుటకు సిద్ధమయ్యాడు. అంతట ఆ అగ్నికుండంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1242

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, July 28, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౭(597)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1240-ఆ.
కడఁగి కొలువ శీఘ్రకాలంబులోనన
యిష్టమైన వరము లిచ్చునట్టి
దైవ మెవ్వఁ డనిన దానవుఁ గనుఁగొని
మునివరుండు పలికె ముదముతోడ.
10.2-1241-వ.
“వినుము; దుర్గుణసుగుణంబులలో నొక్కటి యెచ్చటం గలుగు నచ్చట నాక్షణంబ కోపప్రసాదఫలంబులు సూపువాఁ డమ్మువ్వుర యందు ఫాలలోచనుఁ డివ్విధంబుఁ దెలిసినవారై బాణాసుర దశకంధరులు సమగ్ర భక్తియుక్తులై సేవించి యసమానసామ్రాజ్య వైభవంబుల నొంది ప్రసిద్ధులై; రట్లుగాన నీవు నమ్మహాత్ముని సేవింపు; మతనివలన నభిమతఫలంబులు వేగంబ ప్రాప్తం బయ్యెడి” నని చెప్పిన నతం డా క్షణంబ.

భావము:
తమను సేవించే భక్తులకు ఆ త్రిమూర్తులలో ఎవరు శీఘ్రంగా కోరిన వరాలిస్తారు.” అలా అడిగిన వృకాసురుని ప్రశ్నకు నారదుడు సంతోషంగా ఇలా సమాధానం చెప్పాడు. “అయితే శ్రద్ధగా విను. దుర్గుణాలు కలవారిమీద ఆగ్రహము చూపాలన్నా, సుగుణవంతులమీద అనుగ్రహము చూపాలన్నా, వెనువెంటనే చూపే దైవం త్రిమూర్తులలో ఒక్క పరమశివుడే. ఈ సంగతి తెలుసుకున్న బాణసురుడు, రావణాసురుడు మున్నగు దానవులు పరమశివుడిని భక్తితో సేవించి మహా సామ్రాజ్య వైభవాలను పొందారు. కనుక, నీవు కూడ శివుడిని భక్తితో పూజించు. నీ అభిమతం వేగంగా ఈడేరుతుంది.” అని చెప్పాడు. వెంటనే....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1241

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౫౯౬(596)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1238-క.
శకుని యను దైత్యు తనయుఁడు
వృకుఁ డనువాఁ డొకఁడు దుర్వివేకుఁడు సుజన
ప్రకరముల నలఁపఁ దెరువున
నొకనాఁ డొదిగుండి దివ్యయోగిం గడఁకన్.
10.2-1238-వ.
కనుంగొని.
10.2-1239-క.
కరములు ముకుళించి "మునీ
శ్వర! నారద! లలితధీవిశారద! నన్నుం
గరుణించి యాన తీ శుభ
కరు లగు హరి హర హిరణ్యగర్భులలోనన్

భావము:
శకుని అనే రాక్షసుని కొడుకు వృకాసురుడు. వాడు దుర్మార్గుడు. సుజనులను దారికాచి బాధించేవాడు. అలా ఒకనాడు రాక్షసుడు ఒక దారిలో దాగి ఉండి అటు వెళ్తున్న నారద మహర్షిని చూసాడు. అలా ఆ మార్గమున వస్తున్న నారదుడిని చూసి వృకాసురుడు నారదమహర్షికి చేతులు జోడించి నమస్కారం చేసి ఇలా అడిగాడు “ఓ నారద మహర్షి! నీవు అన్నీ తెలిసిన మహా ఙ్ఞానివి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందున ....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1239

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, July 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౫(595)

( విష్ణుసేవా ప్రాశస్త్యంబు ) 

10.2-1235-క.
సేవింప వారు దమకుం
గావించిన శోభనములు గని నిజములుగా
భావించి వారి మఱతురు
భావములఁ గృతఘ్నవృత్తిపని తమ పనిగన్.
10.2-1236-క.
మెలఁగుచు నుందురు దీనికిఁ
గలదొక యితిహాస మిపుడు గైకొని నీకుం
దెలియఁగఁ జెప్పెద దానన
యలవడు నీ వడుగు ప్రశ్న కగు నుత్తరమున్.

భావము:
అలా ఆరాధించి ఆ దేవతలు అనుగ్రహించిన ఐశ్వర్యాలను సత్యమైనవని అనుకుంటారు. పిమ్మట కృతఘ్నులై వారు తమకు శుభాలను అనుగ్రహించిన ఆ దేవతలనే మరచిపోతారు. దీనికి తార్కాణంగా ఒక కథ ఉంది. అది నీకు చెప్తాను. నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం దానితో తెలుస్తుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=84&Padyam=1236

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, July 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౪(594)

( విష్ణుసేవా ప్రాశస్త్యంబు ) 

10.2-1233-ఉ.
నారదసంయమీంద్రు వలనన్ వినుచుండి యనంతరంబ పం
కేరుహనాభుఁ జూచి యడిగెం దగ నిప్పుడు నీవు నన్ను నిం
డారిన భక్తిమై నడిగి నట్ల యతండును మందహాస వి
స్ఫార కపోలుఁడై పలికెఁ బాండుతనూభవుతోడఁ జెచ్చెరన్.
10.2-1234-సీ.
"వసుమతీనాథ! యెవ్వనిమీఁద నా కను-
  గ్రహ బుద్ధి వొడము నా ఘనుని విత్త
మంతయుఁ గ్రమమున నపహరించిన వాఁడు-
  ధనహీనుఁ డగుచు సంతాప మంద
విడుతురు బంధు ల వ్విధమున నొందిలి-
  యై చేయునదిలేక యఖిలకార్య
భారంబు లుడిగి మద్భక్తులతో మైత్రి-
  నెఱపుచు విజ్ఞాననిరతుఁ డగుచు
10.2-1234.1-తే.
బిదప వాఁ డవ్యయానందపదము నాత్మ
నెఱిఁగి సారూప్యసంప్రాప్తి నెలమి నొందుఁ
గాన మత్సేవ మిగుల దుష్కర మటంచు
వదలి భజియింతు రితరదేవతల నెపుడు.

భావము:
అలా నారదుని వలన పుణ్యకథా శ్రవణానంతరం, నన్ను ఎంతో ఆసక్తితో నీవడిగిన ఇదే ప్రశ్నను, పాండురాజ పుత్రుడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగాడు. అంతట మందహాస సుందర వదనారవిందుడై కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. “మహారాజా! ధర్మరాజా! ఎవరిపై నాకు అనుగ్రహం కలుగుతుందో ఆ ఉత్తముడి సంపదలు సమస్తము నేను హరిస్తాను. అతడు ధనహీనుడై దుఃఖిస్తాడు. బంధువులు అతడిని వదలివేస్తారు. అతడు నిస్సహాయుడై అన్నింటినీ త్యజించి నా భక్తులతో స్నేహం చేస్తాడు. క్రమంగా విజ్ఞానాన్ని పొంది, తుదకు అవ్యయానందచిత్తుడై, సారూప్యాన్ని పొందుతాడు. అందుచేత కొందరు నన్ను సేవించటం చాలా కష్టమని అనుకుని ఇతర దేవతలను ఆరాధిస్తారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1234

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :