Saturday, April 9, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౧౭(517)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1099-వ.
అప్పుడు.
10.2-1100-చ.
కొలఁదికి మీఱఁగా డమరు, గోముఖ, డిండిమ, మడ్డు, శంఖ, కా
హళ, మురళీ, మృదంగ, పణ, వానక, దుందుభి, ఢక్క, కాంస్య, మ
ర్దళ, మురజారజాది వివిధధ్వను లేపున భూనభోంతరం
బులఁ జెలఁగెన్ నటీనటనముల్‌ దనరారె మనోహరాకృతిన్.
10.2-1101-వ.
అంత.

భావము:
అలా నేను శ్రీకృష్ణుని వరించిన శుభసమయంలో డమరు, గోముఖ, డిండిమ, మడ్డు, శంఖ, బాకా, మురళీ, మృదంగ, పణ, ఆనక, భేరీ, ఢక్క, తాళములు, మద్దెల, మురజ, అరజ మున్నగు నానావిధ మంగళ వాద్యాలు దిక్కులు పిక్కటిల్లేలా అతిశయించి మ్రోగాయి. నటీమణుల నృత్యాలు కన్నులపండువు చేశాయి. అప్పుడు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1100

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, April 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౧౬(516)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1097-చ.
లలితపదాబ్జ నూపురకలధ్వనితో దరహాస చంద్రికా
కలిత కపోలపాలికలఁ గప్పు సువర్ణవినూత్న రత్నకుం
డల రుచులొప్పఁ గంకణఝణంకృతు లింపెసలార రంగ భూ
తలమున కేగుదెంచి ముఖతామరసం బపు డెత్తి చూచుచున్.
10.2-1098-చ.
నరపతులం గనుంగొని మనంబున వారిఁ దృణీకరించి మ
త్కరజలజాత దివ్యమణి కాంచనమాలిక నమ్మురారి కం
ధరమున లీలమై నిడి పదంపడి నవ్య మధూకదామ మా
హరికబరిం దగిల్చితి నయంబునఁ గన్నుల లజ్జ దేఱఁగన్.

భావము:
అలా కదులుతుంటే కాలిఅందెలు ఘల్లు ఘల్లు మన్నాయి. పెదవులపై మందహాసం చిందులాడుతోంది. చెక్కుటద్దాలపై బంగారుకర్ణకుండలాల దీప్తులు మెరుస్తున్నాయి. మణికంకణాలు మధురంగా ధ్వనిస్తున్నాయి. అలా ఒయ్యారంగా రంగస్థలం మీదికి వెళ్ళి ముఖమెత్తి అటూ ఇటూ పరికించాను. రాజకుమారులను అందరినీ మనసులోనే తృణీకరించాను. నా చేతులలో ఉన్న దివ్యమైన మణులు పొదిగిన బంగారు హారాన్ని శ్రీకృష్ణుని మెడలో వేశాను. అలాగే నవ్య ఇప్పపూలదండతో ఆయన వక్షాన్ని అలంకరించాను. ఆ సమయాన నా కళ్ళల్లో సిగ్గు తొణికిసలాడింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1098

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, April 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౧౫(515)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1096-వ.
అయ్యవసరంబున నేనుం బరితుష్టాంతరంగనై పరమానందవికచ వదనారవింద నగుచు,నిందిందిర సన్నిభంబులగు చికురబృందంబులు విలసదలిక ఫలకంబునం దళుకులొలుకు ఘర్మజల కణంబులం గరంగు మృగమద తిలకంపు టసలున మసలుకొనినం గరకిసలయంబున నోసరించుచు మిసమిస మను మెఱుంగుగములు గిఱికొన నెఱిగౌను వడవడ వడంక నప్పుడు మందగమనంబున.

భావము:
అప్పుడు నాకు పరమానందం కలిగింది. ఒళ్ళంతా చెమర్చింది. చెమటకి తడిసి కరగిన నా నుదుటి కస్తూరితిలకంలో ముంగురులు అతుక్కున్నాయి. వాటిని నా మృదువైన చేతులతో సరిచేసుకుంటూ, మిసమిలలాడే నా సన్నని నడుము వడ వడ వణకుతుండగ, మందగమనంతో ముందుకు నడిచాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1096

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, April 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౧౪(514)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1095-చ.
సరసిజపత్త్రలోచనుఁడు చాపము సజ్యము సేసి యుల్లస
చ్ఛర మరిఁబోసి కార్ముకవిశారదుఁడై యలవోక వోలె ఖే
చరమగు మీనముం దునిమె సత్వరతన్ సుర సిద్ధ సాధ్య ఖే
చర జయశబ్ద మొప్పఁ బెలుచం గురిసెం దివిఁ బుష్పవర్షముల్‌.

భావము:
పద్మాలవంటి కన్నులు ఉన్న అందగాడు శ్రీకృష్ణుడు ధనువు ఎత్తి నారిని కట్టాడు. ఉల్లాసంగా ఆ శరమును నారికి సంధించాడు. విలువిద్యావిశారదుడై, విల్లెక్కుపెట్టి బాణం ప్రయోగించి అలవోకగా మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు. దేవసిద్దసాధ్యాది ఖేచరుల జయజయ ధ్వానాలు ఎగసాయి. ఆకాశం నుండి పూలవాన కురిసింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1095

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, April 4, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౧౩(513)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1093-క.
అమరేంద్ర తనయుఁ డమ్మ
త్స్యము నేయ నుపాయ మెఱిఁగి తగ నేసియు మీ
నము ద్రుంపలేక సిగ్గున
విముఖుండై చనియె నంత వికలుం డగుచున్.
10.2-1094-వ.
ఇట్లు సకల రాజకుమారులుం దమతమ ప్రయత్నంబులు విఫలంబులైన ముఖారవిందంబులు ముకుళించి దైన్యంబున విన్ననై చూచుచున్న యెడ.

భావము:
ఇంద్ర తనయుడు అర్జునుడు మత్స్యయంత్రాన్ని భేదించే ఉపాయం తెలిసినవాడే అయినా ఆ యంత్రాన్ని కొట్టలేక విఫలుడు అయి, సిగ్గుతో వికలమైన మనసుతో వెనుదిరిగాడు. ఇలా తమ ప్రయత్నాలు ఫలించలేకపోడంతో ముడుచుకున్న ముఖాలతో ఆ రాకుమారులు అందరూ దైన్యంతో చిన్నబోయి చూస్తూ ఉండగా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1094

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, April 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౧౧(511)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1087-క.
సుందరతనులు దదుత్సవ
సందర్శన కుతుకు లమిత సైన్యులు భూభృ
న్నందను లేతెంచిరి జన
నందితయశు లగుచు మద్రనగరంబునకున్.
10.2-1088-క.
చనుదెంచిన వారికి మ
జ్జనకుఁడు వివిధార్చనములు సమ్మతిఁ గావిం
చిన నా బాహుబలాఢ్యులు
ధనువుం జేరంగ నరిగి ధైర్యస్ఫూర్తిన్.
10.2-1089-వ.
ఇట్లు డగ్గఱి యద్ధనువుం గనుంగొని. 

భావము:
సుందరాకారులైన ఆ రాజకుమారులు ఆ స్వయంవర ఉత్సవాన్ని తిలకించే కుతూహలంతో పెద్ద పెద్ద సైన్యాలతో మద్రనగరానికి వచ్చారు. అలా విచ్చేసిన వారందరికి మాతండ్రి సంతోషంతో స్వాగతం పలికి సత్కరించాడు. బాహుబలసంపన్ను లైన ఆ రాజపుత్రులు ధైర్యంతో ధనువును సమీపించారు. అలా ఆ ధనుస్సు దగ్గరకు వెళ్ళి చూసిన మహా వీరులు... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1088 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :



  

Friday, April 1, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౧౦(510)

( లక్షణ ద్రౌపది సంభాషణంబు ) 

10.2-1085-క.
ఈ సాయకంబు నారిం
బోసి వెసన్ మత్స్యయంత్రమున్ ధరఁ గూలన్
వేసిన శౌర్యధురీణుఁడు
నా సుత వరియించు" నని జనంబులు వినఁగన్.
10.2-1086-క.
చాటించిన నవ్వార్తకుఁ
బాటించిన సంభ్రమముల బాణాసన మౌ
ర్వీ టంకార మహారవ
పాటితశాత్రవులు బాహుబల సంపన్నుల్‌. 

భావము:
ఇదిగో ఈ బాణాన్ని వింటికి సంధించి, అదిగో ఆ మత్స్యయంత్రాన్ని పడగొడతాడో ఆ వీరుడినే నా పుత్రిక పరిణయమాడుతుంది.” అని అందరికి తెలిసేలా చాటింపు వేయించాడు. మా తండ్రి వేయించిన చాటింపును విలువిద్యలో ఆరితేరిన వీరులెందరో విన్నారు. వింటినారిని మ్రోగించడంలో మిన్నలు, మహా బాహుబల సంపన్నులు అయిన శాత్రవ వీరురెందరో విన్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1086 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :