10.2-1097-చ.
లలితపదాబ్జ నూపురకలధ్వనితో దరహాస చంద్రికా
కలిత కపోలపాలికలఁ గప్పు సువర్ణవినూత్న రత్నకుం
డల రుచులొప్పఁ గంకణఝణంకృతు లింపెసలార రంగ భూ
తలమున కేగుదెంచి ముఖతామరసం బపు డెత్తి చూచుచున్.
10.2-1098-చ.
నరపతులం గనుంగొని మనంబున వారిఁ దృణీకరించి మ
త్కరజలజాత దివ్యమణి కాంచనమాలిక నమ్మురారి కం
ధరమున లీలమై నిడి పదంపడి నవ్య మధూకదామ మా
హరికబరిం దగిల్చితి నయంబునఁ గన్నుల లజ్జ దేఱఁగన్.
భావము:
అలా కదులుతుంటే కాలిఅందెలు ఘల్లు ఘల్లు మన్నాయి. పెదవులపై మందహాసం చిందులాడుతోంది. చెక్కుటద్దాలపై బంగారుకర్ణకుండలాల దీప్తులు మెరుస్తున్నాయి. మణికంకణాలు మధురంగా ధ్వనిస్తున్నాయి. అలా ఒయ్యారంగా రంగస్థలం మీదికి వెళ్ళి ముఖమెత్తి అటూ ఇటూ పరికించాను. రాజకుమారులను అందరినీ మనసులోనే తృణీకరించాను. నా చేతులలో ఉన్న దివ్యమైన మణులు పొదిగిన బంగారు హారాన్ని శ్రీకృష్ణుని మెడలో వేశాను. అలాగే నవ్య ఇప్పపూలదండతో ఆయన వక్షాన్ని అలంకరించాను. ఆ సమయాన నా కళ్ళల్లో సిగ్గు తొణికిసలాడింది.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=77&Padyam=1098
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment