Monday, June 7, 2021

శ్రీకృష్ణ విజయము - 250

( రుక్మిణీదేవి విప్రలంభంబు )

10.2-238-చ.
అలికుల వేణి తన్నుఁ బ్రియుఁ డాడిన యప్రియభాష లిమ్మెయిన్
సొలవక కర్ణరంధ్రముల సూదులు సొన్పిన రీతిఁగాఁగ బె
బ్బులి రొద విన్న లేడి క్రియఁ బొల్పఱి చేష్టలు దక్కి నేలపై
వలనఱి వ్రాలెఁ గీ లెడలి వ్రాలిన పుత్తడిబొమ్మ కైవడిన్.
10.2-239-వ.
ఇట్లు వ్రాలిన.
10.2-240-మ.
ప్రణతామ్నాయుఁడు కృష్ణుఁ డంతఁ గదిసెన్ బాష్పావరుద్ధారుణే
క్షణ విస్రస్త వినూత్నభూషణ దురుక్తక్రూర నారాచ శో
షణ నాలింగితధారుణిన్ నిజకులాచారైక సద్ధర్మ చా
రిణి విశ్లేషిణి వీతతోషిణిఁ బురంధ్రీగ్రామణిన్ రుక్మిణిన్.

భావము:
ఆ సుకుమారిని తన ప్రియుడు తనతో పలికిన ఆ అప్రియమైన పలుకులు చెవులలో సూదులు పెట్టి పొడిచినట్లు బాధ పెట్టాయి. పెద్దపులి గాండ్రింపు విన్న లేడి లాగ కీలుతప్పి క్రింద పడిపోయిన బంగారు బొమ్మ లాగా, నిశ్చేష్టురాలై నేలపైకి వాలిపోయింది. అలా పట్టపురాణి రుక్మిణీదేవి నేలపైకి వాలిపోగా వేదవేద్యుడైన శ్రీకృష్ణుడు కన్నీటితో నిండి ఎఱ్ఱపడ్డ నేత్రాలతో చెదరిన భూషణాలతో ఆ కఠోరపు పలుకుల ములుకుల వలన కలిగిన అలజడితో నేలపై పడి పోయిన ఆ సద్వంశ సంభూతురాలూ, శోకసంతప్తురాలూ, సహధర్మచారిణి, సాధ్వీశిరోమణీ అయిన రుక్మిణీదేవి దగ్గరకు వెళ్ళాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=25&Padyam=240

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, June 5, 2021

శ్రీకృష్ణ విజయము - 249

( రుక్మిణీదేవి విప్రలంభంబు )

10.2-236-వ.
అని యిట్లు భగవంతుడైన హరి దన్నుఁ బాయక సేవించుటం బ్రియురాలను, పట్టంపుదేవి ననియెడి రుక్మిణి దర్పంబు నేర్పున నుపసంహరించి యూరకుండిన నమ్మానవతి యప్రియంబులు నపూర్వంబులు నైన మనోవల్లభు మాటలు విని దురంతంబైన చింతాభరంబున సంతాపంబు నొందుచు.
10.2-237-సీ.
కాటుక నెఱయంగఁ గన్నీరు వరదలై-
  కుచకుంభయుగళ కుంకుమము దడియ
విడువక వెడలెడు వేఁడినిట్టూర్పుల-
  లాలితాధర కిసలయము గందఁ
జెలువంబు నెఱిదప్పి చిన్నఁవోవుచు నున్న-
  వదనారవిందంబు వాడు దోఁప
మారుతాహతిఁ దూలు మహిత కల్పకవల్లి-
  వడువున మేన్ వడవడ వడంకఁ
10.2-237.1-తే.
జిత్త మెఱియంగఁ జెక్కిటఁ జేయ్యి సేర్చి
కౌతుకం బేది పదతలాగ్రమున నేల
వ్రాసి పెంపుచు మో మరవాంచి వగలఁ
బొందె మవ్వంబు గందిన పువ్వుఁబోలె.

భావము:
అని భగవంతుడైన శ్రీకృష్ణుడు పలికాడు. ప్రతినిత్యం తనను సేవిస్తూ, పట్టపురాణిని అనే గర్వంతో ఉన్న రుక్మిణి ఆత్మాభిమానం అంతా అలా నేర్పుగా పలికి తొలగించాడు. తన ప్రాణప్రియుని నోట ఆ మానవతి ఇంతకు ముందు ఎన్నడూ వినని అప్రియమైన మాటలు విని, అంతులేని ఆవేదనతో బాధపడింది.
కాటుకతో నిండిన కన్నీ టిధారలు కుచ కుంభముల మీది కుంకుమను తడిపివేశాయి. ఆగకుండా వస్తున్న వేడినిట్టూర్పుల వలన, చిగురుటాకు వంటి అందమైన పెదవి కందిపోయింది. ముఖపద్మం కళ కోల్పోయి వాడిపోయింది. గాలితాకిడికి తూలిపోతున్న కల్పవల్లి వలె నెమ్మేను వడ వడ కంపించింది, ఈవిధంగా రుక్మిణి మనస్సు బాధపడుతుండగా, చెక్కిలిపై చేయిచేర్చి దీనంగా కాలితో నేలను రాస్తూ, ముఖం వంచుకుని, సౌకుమార్యం కోల్పోయిన పూవులాగా వ్యాకులపాటు చెందింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=25&Padyam=237

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 248

( రుక్మిణీదేవి విప్రలంభంబు )

10.2-234-క.
తగదని యెఱుఁగవు మమ్ముం
దగిలితివి మృగాక్షి! దీనఁ దప్పగు; నీకుం
దగిన మనుజేంద్రు నొక్కనిఁ
దగులుము; గుణహీనజనులఁ దగునే తగులన్?
10.2-235-సీ.
సాల్వ జరాసంధ చై ద్యాది రాజులు-
  చెలఁగి నన్ వీక్షించి మలయుచుండ
నది గాక రుక్మి నీ యన్నయు గర్వించి-
  వీర్యమదాంధుఁ డై వెలయుచున్న
వారి గర్వంబులు వారింపఁగాఁ గోరి-
  చెలువ! నిన్నొడిచి తెచ్చితిమి; గాని
కాంతా తనూజార్థ కాముకులము గాము-
  కామమోహాదులఁ గ్రందుకొనము;
10.2-235.1-తే.
విను; ముదాసీనులము; క్రియావిరహితులము
పూర్ణులము మేము; నిత్యాత్మబుద్ధితోడ
వెలుఁగుచుందుము గృహదీపవిధము మెఱసి;
నవలతాతన్వి! మాతోడ నవయ వలదు."

భావము:
ఓ హరిణాక్షీ! గుణహీనులతో సంబంధం తగదు కదా. నా సంబంధం తగినది కాదని గ్రహించలేకపోయావు; తెలియక నన్ను వివాహమాడావు; పొరపాటు చేశావు. పోనీలే ఇప్పుడు, నీకు తగిన రాజేంద్రుడిని మరెవరినైనా వివాహమాడు. ఓ లతాంగీ! సాల్వభూపతి జరాసంధుడు, చేది రాజు శిశుపాలుడు మున్నగు రాజులు చెలరేగి ద్వేషంతో నా వెనుక పడుతున్నారు. నీ సోదరుడైన రుక్మి బలగర్వంతో మిడిసిపడుతున్నాడు. వారి అహంకారాన్ని అణచటానికి మాత్రమే, ఆనాడు నిన్ను బలవంతంగా తీసుకుని వచ్చాను. అంతేకాని, కాంతల పట్ల, సంతానం పట్ల, ఐశ్వర్యంపట్ల ఆసక్తి కలిగి కాదు. కామ మోహములకు మేము లోనుకాము. ఉదాసీనులము. క్రియారహితులము. పరిపూర్ణులము. నాలుగు గోడల మధ్య వున్న దీపం లాగ నిత్యాత్మ బుద్ధితో వెలుగుతుంటాము. అటువంటి మమ్మల్ని కట్టుకొని ఎందుకు బాధపడతావు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=25&Padyam=235

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, June 3, 2021

శ్రీకృష్ణ విజయము - 247

( రుక్మిణీదేవి విప్రలంభంబు )

10.2-232-సీ.
లోకుల నడవడిలోని వారము గాము-
  పరులకు మా జాడ బయలు పడదు;
బలమదోపేతులు పగగొండ్రు మా తోడ-
  రాజపీఠములకు రాము తఱచు;
శరణంబు మాకు నీ జలరాశి సతతంబు-
  నిష్కించనుల మేము; నిధులు లేవు;
కలవారు చుట్టాలు గారు; నిష్కించన-
  జనబంధులము; ముక్తసంగ్రహులము;
10.2-232.1-ఆ.
గూఢవర్తనులము; గుణహీనులము; భిక్షు
లైన వారిఁ గాని నాశ్రయింప;
మిందుముఖులు దగుల; రిటువంటి మముబోఁటి
వారి నేల దగుల వారిజాక్షి!
10.2-233-క.
సిరియును వంశము రూపును
సరియైన వివాహసఖ్య సంబంధంబుల్‌
జరుగును; సరి గాకున్నను
జరగవు; లోలాక్షి! యెట్టి సంసారులకున్.

భావము:
అందంగా కదలాడే కన్నులు గల లోలాక్షీ! మా నడవడి లోకులకు భిన్నమైనది. మా జాడ ఇతరులకు అంతుపట్టదు. బలవంతులతో శత్రుత్వం పెట్టుకుంటాము. రాజసింహాసనాల కోసం ఆశపడము. సముద్రమే ఎప్పడూ మాకు ఆశ్రయస్థానం. ఏమీ లేని వాళ్ళము. ధన హీనులము. గుణ హీనులము. పేదలతో తప్ప ధనవంతులతో స్నేహం చేయము. రహస్య వర్తనులము. భిక్షకులను ఆశ్రయిస్తాము. ఇటువంటివారిని స్త్రీలు వరిస్తారా? ఈలాంటి గుణాలున్న నన్ను నీవెందుకు వలచావు. అందమైన కన్నులున్న చిన్నదానా! లోకంలో ఎటువంటి వారికైనా వియ్యమైనా నెయ్యమైనా సంపద, సౌందర్యం, వంశం సమానంగా ఉన్నప్పుడే శోభిస్తుంది. లేకపోతే సంబంధాలు సరిగా జరుగవు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=25&Padyam=232

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 246

( రుక్మిణీదేవి విప్రలంభంబు )

10.2-230-మ.
పతి యే రూపము దాల్చినం దదనురూపంబైన రూపంబుతో
సతి దా నుండెడు నట్టి రూపవతి నా చంద్రాస్య నా లక్ష్మి నా
సుతనున్ రుక్మిణి నా యనన్యమతి నా శుద్ధాంతరంగం గళా
చతురత్వంబున శౌరి యిట్లనియెఁ జంచన్మందహాసంబుతోన్.
10.2-231-మ.
"బలశౌర్యంబుల భోగమూర్తి కులరూపత్యాగ సంపద్గుణం
బుల దిక్పాలురకంటెఁ జైద్యముఖరుల్‌ పూర్ణుల్‌ ఘనుల్‌; వారికిన్
నెలఁతా! తల్లియుఁదండ్రియుం సహజుఁడున్ నిన్నిచ్చినంబోక యీ
బలవద్భీరుల వార్ధిలీనుల మముం బాటింప నీ కేటికిన్?

భావము:
రూపవతి, తన పతికి అనురూపమైన రూపంతో ప్రవర్తించే లక్ష్మీదేవి అవతారమూ, వివేకవతీ, సౌందర్యవతీ, సౌభాగ్యవతీ, పద్మముఖీ, సద్గుణవతీ, తన ప్రియసతీ అయిన ఆ రుక్మిణీదేవితో శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చమత్కారంగా ఇలా అన్నాడు. “బాలా! బలంలో, శౌర్యంలో, రూపంలో, భోగంలో, కులంలో, త్యాగంలో, సంపదలో, సద్గుణాలలో దిక్పాలుర కంటే చైద్యుడు మొదలైనవారు చాలా గొప్పవారు, పరిపూర్ణులు. అటువంటి శిశుపాలుడితో నీ తల్లీ, తండ్రీ, సోదరుడూ నీకు వివాహము చేద్దాము అనుకుంటే ఒప్పుకోక, నీవు సముద్రగర్భంలో తలదాచుకున్నవాడను, పిరికివాడను అయిన నన్ను ఎందుకు వివాహమాడావు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=25&Padyam=231

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, June 1, 2021

శ్రీకృష్ణ విజయము - 245

( పదాఱువేల కన్యల పరిణయం )

10.2-228-సీ.
కుచకుంభములమీఁది కుంకుమతో రాయు-
  హారంబు లరుణంబు లగుచు మెఱయఁ;
గరపల్లవము సాఁచి కదలింప నంగుళీ-
  యక కంకణప్రభ లావరింపఁ;
గదలిన బహురత్న కలిత నూపురముల-
  గంభీర నినదంబు గడలుకొనఁగఁ;
గాంచన మణికర్ణికా మయూఖంబులు-
  గండపాలికలపై గంతు లిడఁగఁ;
10.2-228.1-తే.
గురులు నర్తింపఁ బయ్యెద కొంగు దూఁగ;
బోటిచే నున్న చామరఁ బుచ్చుకొనుచు
జీవితేశ్వరు రుక్మిణి సేర నరిగి
వేడ్క లిగురొత్త మెల్లన వీవఁ దొడఁగె.

భావము:
ఆ సమయంలో వక్షస్థలంమీది కుంకుమ అంటుకుని హారాలు ఎఱ్ఱని కాంతితో మెరుస్తుండగా; చిగురుటాకువంటి చేతిని కదలించి నప్పుడు కదలిన కంకణాలు, ఉంగరాల కాంతులు ప్రసరిస్తుండగా; చెవులకు ధరించిన బంగారు చెవిదుద్దుల ధగధగలు గండస్థలాలపై వ్యాపిస్తుండగా; కదిలినప్పుడు రత్నాల అందెలు గంభీరమైన ధ్వని చేస్తుండగా; ముఖం మీద ముంగురులు కదలాడుతుండగా; పైటకొంగు తూగాడుతూ ఉండగా; చెలికత్తె చేతిలోని వింజామరను తీసుకుని రుక్మిణీదేవి తన జీవితేశ్వరు డైన శ్రీకృష్ణునకు మెల్లిగా విసరసాగింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=24&Padyam=228

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - 244

( పదాఱువేల కన్యల పరిణయం )

10.2-227-వ.
అంత నొక్కనాఁడు రుక్మిణీదేవి లోఁగిట మహేంద్రనీల మరకతాది మణిస్తంభ వలభి విటంకపటల దేహళీకవాట విరాజమానంబును, శాతకుంభ కుడ్య గవాక్ష వేదికా సోపానంబును, విలంబమాన ముక్తాఫలదామ విచిత్ర కౌశేయవితానంబును, వివిధ మణిదీపికా విసర విభ్రాజమానంబును, మధుకరకులకలిత మల్లికాకుసుమ మాలికాభిరామంబును, జాలకరంధ్ర వినిర్గత కర్పూరాగరుధూప ధూమంబును, వాతాయన విప్రకీర్ణ శిశిరకర కిరణస్తోమంబును, బారిజాతప్రసవామోద పరిమిళితపవనసుందరంబు నయిన లోపలిమందిరంబున శరచ్చంద్రచంద్రికా ధవళపర్యంక మధ్యంబున, జగదీశ్వరుం డయిన హరి సుఖాసీనుండై యుండ, సఖీజనంబులుం దానును డగ్గఱి కొలిచి యుండి.

భావము:
ఒకనాడు రుక్మిణీదేవి అంతఃపురంలో శరత్కాలపు వెన్నెలవంటి తెల్లనైన పానుపుమీద జగదీశ్వరు డైన శ్రీకృష్ణుడు సుఖాసీనుడై ఉన్నాడు. ఆ అంతఃపురం నవరత్నాలు పొదిగిన స్తంభాలతో ఇంద్రనీల మణులు పొదిగిన చంద్రశిలలతో నిండినట్టిది. ఆ చంద్రశాలలలోని ద్వారబంధాలు గడపలు మండపాలు తలుపులు గోడలు కిటికీలు అరుగులు మెట్లు అన్నీ సువర్ణకాంతులు విరజిమ్ముతున్నాయి. ఆ అంతఃపురం వేల్లాడుతున్న ముత్యాలసరాలతో నిండిన చిత్రవిచిత్రమైన పట్టువస్త్రాల చాందినీలతో వెలుగుతున్నది అనేక మణిదీపాలతో ప్రకాశిస్తున్నది. అక్కడ ఉన్న మల్లెపూలదండలపై తుమ్మెదలు మూగి ఉన్నాయి. కర్పూరం అగరు మొదలైన సుగంధ ద్రవ్యాల పొగలు ఆ అంతఃపురపు కిటికీలగుండా బయటకు వ్యాపిస్తున్నాయి. గవాక్షాల గుండా చల్లని తెల్లని కిరణాలు ప్రసరిస్తున్నాయి. ఉద్యానవనం నుంచి పారిజాత సుగంధ పవనాలు వీస్తున్నాయి. అటువంటి అంతఃపురంలో సుఖాసీనుడై ఉన్న శ్రీహరిని రుక్మిణీదేవి ఆమె సఖులూ సేవిస్తున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=24&Padyam=227

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :