Saturday, November 14, 2020

శ్రీ కృష్ణ విజయము - 77

( చాణూరునితో సంభాషణ )

10.1-1345-సీ.
మహిమతో నుండగ మథురాపురము గాని-
  పొలుపార వైకుంఠపురము గాదు
గర్వంబుతో నుండఁ గంసుని సభ గాని-
  సంసార రహితుల సభయుఁ గాదు
ప్రకటించి వినఁగ నా బాహునాదము గాని-
  నారదు వీణాస్వనంబు గాదు
చదురు లాడఁగ మల్లజన నిగ్రహము గాని-
  రమతోడి ప్రణయ విగ్రహము గాదు
10.1-1345.1-తే.
వెలసి తిరుగంగ వేదాంతవీధి గాదు
మొఱఁగిపో ముని మనముల మూల గాదు
సాఁగి నడువంగ భక్తుల జాడ గాదు
శౌరి! నా మ్రోల నీ వెందు జనియె దింక."
10.1-1346-వ.
అని పలికి.

భావము:
వైభవోపేతంగా ఉందామనుకుంటున్నావేమో ఇది విలసిల్లే వైకుంఠం కాదు మధురానగరం; దర్పంతో తిరగడానికి ఇది సన్నాసుల సభ కాదు కంసమహారాజు కొలువుకూటమి; చక్కగావిందాం అనుకోకు. ఇది నారదుడి వీణా నాదము కాదు నా భుజాస్ఫాలన శబ్దం; పరిహాసాలు ఆడటానికి ఇది లక్ష్మీదేవి తోటి ప్రణయకలహము కాదు మల్ల యోధులతో రణరంగం; యధేచ్ఛగా సంచరించడానికి ఇది వేదాంతుల వీధి కాదు; దాగి ఉండటానికి ఇది మునుల మనఃకుహరం కాదు; అతిశయించి వెళ్ళడానికి ఇది భక్తులసంగతి కాదు; గుర్తుంచుకో కృష్ణా! నా ముందు నుంచీ ఇక నీవెక్కడకీ వెళ్ళలేవు.” చాణూరుడు ఇలా కృష్ణుడితో పలికి. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1345

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 76

( చాణూరునితో సంభాషణ )

10.1-1343-సీ.
చలమున నను డాసి జలరాశిఁ జొరరాదు-
  నిగిడి గోత్రముదండ నిలువరాదు;
కేడించి కుంభిని క్రిందికిఁ బోరాదు-
  మనుజసింహుఁడ నని మలయరాదు;
చేరినఁ బడవైతుఁ జెయి చాపఁగారాదు-
  బెరసి నా ముందటఁ బెరుఁగరాదు;
భూనాథ హింసకుఁ బోరాదు నను మీఱి-
  శోధింతుఁ గానలఁ జొరఁగరాదు;
10.1-1343.1-ఆ.
ప్రబలమూర్తి ననుచు భాసిల్లఁగారాదు;
ధరఁ బ్రబుద్ధుఁడ నని దఱుమరాదు;
కలికితనము చూపి గర్వింపఁగారాదు;
తరముగాదు; కృష్ణ! తలఁగు తలఁగు.
10.1-1344-వ.
అదిగాక నీవు శ్రీహరి నంటేని.

భావము:
ఓ కృష్ణా! పౌరుషానికి పోయి నా దగ్గరకి వచ్చేక ఇక వేషాలేసి నాటకాలాడి తప్పించుకు పోడానికి అవకాశం ఉండదు జాగ్రత్త. తర్వాత (మత్స్యావతారంలో లా చేపలా వేషం కట్టి) సముద్రంలోకి పోడానికీ కుదరదు. (కూర్మావతారంలో మంథర పర్వతానికి కింద నిలబడి ఆధారంగా ఉన్నా నని తాబేలు వేషం కట్టి) కొండల దన్ను తీసుకోడానికీ అవ్వదు. (వరహావతారంలో భూమిని ధరించి దాని కిందున్నా కదా అని పంది వేషం కట్టి) తప్పించుకుపోయి భూమి కిందకి దూరడానికీ వీలవదు. (నరసింహావతారం ఎత్తిన వాడిని కదా అని) సింహంలాంటి మగాణ్ణి అన్ని విఱ్ఱవీగడానికీ కుదరదు. (వామనావతారంలో చెయ్యి చాచడం అలవాటే అనుకోకు) దగ్గరకు వస్తే పడదోసేస్తా. ఇక చెయ్యి చాచడానికి కూడ సందుదొరకదు. (త్రివిక్రమావతారం ఎత్తి పెరిగా కదా అని) నా ఎదురుగా పెచ్చుమీరడమూ అలవికాదు. (పరశురామావాతారంలో రాజులను చంపేసా అనుకోకు) నన్ను దాటి రాజుని హింసించడ మన్నది సాధ్యం కాదు. (రామావతారంలో అడవులకు పోయా కదా అని) అవసరమైతే అరణ్యంల్లో దాక్కుంటా అనుకోకు, గాలించి మరీ పట్టుకుంటా. (బలరామావతారం ఎత్తిన) ప్రబలమైన ఆకారం కలవాడను నేనే అని విఱ్ఱవీగడానికీ వీలుండదు. (బుద్ధావతారం ఎత్తిన వాడిని) పుడమిలో నేనే ప్రబుద్ధుణ్ణి అని బెదిరించి తరిమేద్దాం అనీ (కల్కి అవతారం ఎత్తుతా కదా అని) కపటంతో జయించేస్తా అని గర్వించటమూ వీలుకాదు సుమా. నాతో యుద్ధం చేయడం నీ తరంగాదులే, పో కృష్ణా! పారిపో. అలాకాదని, నీవు ఆదినారాయణుడను అంటావేమో; అలా అయితే విను. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1343

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, November 12, 2020

శ్రీ కృష్ణ విజయము - 75

( చాణూరునితో సంభాషణ )

10.1-1341-శా.
స్థాణున్ మెచ్చఁడు; బ్రహ్మఁ గైకొనఁడు; విష్వక్సేను నవ్వున్; జగ
త్ప్రాణున్ రమ్మనఁ డీడుగాఁ డని; మహా బాహాబలప్రౌఢి న
క్షీణుం; డాజికి నెల్లి నేఁ డనఁడు; వైచిత్రిన్ వినోదించు న
చ్చాణూరుం డొక గోపబాలు పనికిన్ శక్తుండు గాకుండునే?
10.1-1342-క.
ప్రల్లద మేటికి గోపక!
బల్లిదుఁడను; లోకమందుఁ బ్రఖ్యాతుఁడ; నా
చల్లడము క్రింద దూఱని
మల్లురు లే రెందు ధరణిమండలమందున్.

భావము:
ఈ చాణూరుడు ఈశ్వరుడినే మెచ్చుకోడు; బ్రహ్మదేవుడిని కూడ లెక్కచేయడు; విష్వక్సేనుడినైనా గేలిచేస్తాడు; తనకు సాటిరాడని వాయుదేవుడిని సైతం రణరంగానికి రమ్మని పిలవడు; అధికతరమైన భుజబలాతిరేకం తరగనివాడు; యుద్ధానికి రేపుమాపు అనని వాడు; చిత్రవిచిత్రంగా అలవోకగా కుస్తీలు పట్టేవాడు; ఇలాంటి జగజెట్టి అయిన చాణూరుడు ఒక గొల్ల కుఱ్ఱాడి పనిపట్టడానికి చాలడా? గోవులను మేపుకునే కుఱ్ఱాడా! ప్రగల్భాలెందుకు? నేను మహా బలవంతుడిని. లోకంలో బాగా ప్రసిద్ధి గాంచిన వాడిని. ఓడిపోయి నా లంగోటా క్రింద దూరని జట్టీలు ఈ భూమండలంలో ఎక్కడా లేరు సుమా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1342

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 74

( చాణూరునితో సంభాషణ )

10.1-1338-క.
నీ తోడుత నేఁ బెనఁగెదఁ
బ్రీతిన్ ముష్టికునితోడఁ బెనగెడి బలుఁ డు
గ్రాతత మల్లాహవమున
భూతలనాథునికి మెచ్చు పుట్టింతు సభన్."
10.1-1339-వ.
అనిన విని రోషించి చాణూరుం డిట్లనియె.
10.1-1340-శా.
"నాతోఁ బోరఁగ నెంతవాఁడ? విసిరో! నాపాటియే నీవు? వి
ఖ్యాతుండం; గులజుండ; సద్గుణుఁడ; సత్కర్మస్వభావుండ; నీ
కేతాదృగ్విభవంబు లెల్లఁ గలవే; యీ వీటఁ బోరాడుటల్
వ్రేతల్ చూడఁగఁ గుప్పిగంతు లిడుటే? వీక్షింపు గోపార్భకా!

భావము:
నీతో నేనూ, ముష్టికుడితో మా అన్న బలరాముడూ ఉత్సాహంగా కుస్తీపడతాము. భయంకర మల్లయుద్ధంతో భూలోకానికి ప్రభువైన కంసుడికి మెప్పు కలిగిస్తాము.” కృష్ణుడి మాటలు వినిన చాణూరుడు ఇలా అన్నాడు. “ఔరా! గొల్లకుఱ్ఱాడా! నాతో కుస్తీకి నీవెంతవాడివి? నీవు నాకు సమానుడవి అవుతావా? నేను ప్రసిద్ధుడిని; సత్కులంలో పుట్టినవాడిని; సత్కర్మలు ఆచరించే స్వభావం కలవాడిని; నీకు ఇలాంటి గొప్పతనముందా? ఈ రాచనగరిలో పోరాడటం అంటే గొల్లల ముందు కుప్పిగంతులు వేయటం కాదు. బాగా ఆలోచించుకో.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1340

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, November 10, 2020

శ్రీ కృష్ణ విజయము - 73

( చాణూరునితో సంభాషణ )

10.1-1335-క.
జనములు నేర్చిన విద్యలు
జననాథునికొఱకుఁ గాదె? జననాథుఁడు నీ
జనములు మెచ్చఁగ యుద్ధం
బున మనముం గొంత ప్రొద్దు పుత్తమె? కృష్ణా!"
10.1-1336-వ.
అనిన విని హరి యిట్లనియె.
10.1-1337-ఉ.
"సాములు లేవు; పిన్నలము; సత్వము గల్దనరాదు; మల్ల సం
గ్రామ విశారదుల్ గులిశ కర్కశదేహులు మీరు; మీకడన్
నేము చరించు టెట్లు? ధరణీశుని వేడ్కలు చేయువారముం
గాము; వినోదముల్ సలుపఁ గాదనవచ్చునె యొక్కమాటికిన్.

భావము:
ఓయీ కృష్ణా! జనులు విద్యలు నేర్చుకోవడం మహారాజు మెప్పు కోసమే కదా! ప్రభువూ, ఈ ప్రజలూ మెచ్చుకొనేలా మనం మల్లయుద్ధంతో కొంత కాలక్షేపం చేద్దామేం?” వాడు అలా అనగా వినిన కృష్ణుడు ఇలా అన్నాడు. “మాకు సాములు తెలియవు. మేము చిన్నవాళ్ళం. సత్తా ఉందని చెప్పలేము. మీరేమో కుస్తీపట్లలో నిష్ణాతులు. వజ్రాయుధం లాంటి కరుకైన శరీరాలు కలవారు. ఇలాంటి మీతో మేము ఎలా తలపడాలి. మీ రాజుగారికి వినోదం కలిగించే వాళ్ళము కాము కానీ, ఆడదామని ఆహ్వానిస్తే ఎప్పుడైనా కాదని అనరాదు కదా!

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1337

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 72

( చాణూరునితో సంభాషణ )

10.1-1332-వ.
అని పలుకుచు సకలజనులును జూచుచుండ రామకృష్ణులకుఁ జాణూరుండు యిట్లనియె.
10.1-1333-మ.
"వనమార్గంబున గోపబాలకులతో వత్సంబులన్ మేపుచుం
బెనఁగన్ మిక్కిలి నేర్చినా రనుచు నీ పృథ్వీజనుల్ చెప్ప మా
మనుజేంద్రుం డిట మిమ్ముఁ జీరఁ బనిచెన్ మల్లాహవక్రీడకుం;
జనదే కొంత పరాక్రమింప మనకున్ సభ్యుల్ విలోకింపఁగన్.
10.1-1334-మ.
జవసత్వంబులు మేలె? సాము గలదే? సత్రాణమే మేను? భూ
ప్రవరుం బోసన మిమ్మనంగ వలెనే? పాళీ లభీష్టంబులే?
పవివో? కాక కృతాంతదండకమవో? ఫాలాక్షు నేత్రాగ్నివో?
నవనీతంబుల ముద్దగాదు; మెసఁగన్ నా ముష్టి గోపార్భకా!

భావము:
పౌరులు అందరూ రామకృష్ణులను చూస్తూ ఇలా అనుకుంటుండగా, చాణూరుడు రామకృష్ణులతో ఇలా అన్నాడు." అడవిదారు లమ్మట గొల్లకుఱ్ఱాళ్ళతో కలసి దూడలు మేపుతూ కుస్తీపోటీలలో చాలా నేర్పుగడించా రని ఈ రాజ్యంలో ప్రజలు చెప్పుకుంటూంటే వినిన మా మహారాజు మల్లయుద్ధ క్రీడకు మిమ్మల్ని ఇక్కడకు పిలిపించాడు. ఇప్పుడు మనం మన మన పరాక్రమాలను సభాసదులు చూస్తూండగా కొంచెం ప్రదర్శించడం సముచితం. ఓ గొల్లపిల్లాడా! నీకు జవసత్త్వాలు బాగా ఉన్నయా? బాగా సాము నేర్చావా? శరీరం గట్టిదేరిందేనా? మహారాజు మిమ్మల్ని మెచ్చుకోవాలా? మల్ల గదాదండం అంటే ఇష్టమేనా? నా పిడికిటిపోటంటే ఏమిటో తెలుసా? ఇది పిడుగు లాంటిది లేదా యముని కాలదండం వంటిది లేదా ముక్కంటి కంటిమంట అనుకో నా పిడికిలిగ్రుద్దు వెన్నముద్ద కాదు తినటానికి. అర్ధమయిందా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=159&padyam=1334

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, November 9, 2020

శ్రీ కృష్ణ విజయము - 71

( మల్లావనీ ప్రవేశము )


10.1-1330-క.
వసుదేవు నివాసంబున
వసుధన్ రక్షింప వీరు వైష్ణవతేజో
ల్లసనమునఁ బుట్టినారఁట
పసిబిడ్డ లనంగఁ జనదు పరదేవతలన్.
10.1-1331-సీ.
చంపె రక్కసిఁ బట్టి; చక్రవాకునిఁగూల్చెఁ-
  బడ ద్రొబ్బె మద్దుల; బకునిఁ జీఱె;
నఘదైత్యుఁ బొరిగొనె; నడరి వత్సకుఁ ద్రుంచె-
  గిరి యెత్తి దేవేంద్రుఁ గ్రిందుపఱిచెఁ;
గాళియు మర్దించె; గహనానలముఁ ద్రావెఁ-
  గేశి నంతకుపురి క్రేవ కనిచె;
మయుపుత్రుఁ బరిమర్చె; మఱియు దానవ భటు-
  ల హరించి గోపకులంబుఁగాచె;
10.1-1331.1-తే.
గోపకాంతల మనముల కోర్కిదీర్చె;
నీ సరోరుహలోచనుండీ శుభాంగుఁ
డీ మహామహుఁడీ దిగ్గజేంద్ర మడఁచె;
మనుజమాత్రుఁడె తలపోయ మాధవుండు."

భావము:
“వీరు విష్ణుదేవుడి తేజోవిలాసంతో భూలోకాన్ని కాపాడుట కోసం, వసుదేవుడి ఇంట్లో పుట్టారట. పరబ్రహ్మ స్వరూపు లయిన వీరిని పసిపాపలు అనడం తగదు” అనుకున్నారు. నళినముల వంటి నయనములు కల వాడూ, మంగళకర మైన అంగసౌష్టవము కలవాడూ, గొప్ప తేజస్సు కలవాడూ. లక్ష్మిదేవికి పతి అయినవాడూ అయిన ఈ శ్రీకష్ణుడు తరచి చూస్తే సామాన్య మానవుడు కాదు. పూతన రక్కసిని పట్టి చంపాడు; సుడిగాలి రూపుడు తృణావర్తుడిని హతమార్చాడు. మద్ది చెట్లను పడగొట్టాడు; బకాసురుడిని సంహరించాడు; అఘుడనే అసురుణ్ణి అంతం చేసాడు; విజృంభించి వత్సాసురుణ్ణి వధించాడు; గోవర్ధనగిరిని ఎత్తి దేవేంద్రుడి గర్వం అణచాడు; నాగరాజు కాళీయుడిని మర్థించాడు; కార్చిచ్చు త్రాగాడు; కేశి అనే దానవుడిని యమపురికి పంపాడు; మయుని కొడుకు వ్యోమాసురుడిని సంహరించాడు; ఇంకా ఎందరో రాక్షస వీరులను నిర్మూలించి, గోపకులను కాపాడాడు; వ్రేతల మనసులలోని కోరికలను తీర్చాడు; దిగ్గజం లాంటి కువలయాపీడ కరీంద్రమును కడతేర్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=158&padyam=1331

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :