Wednesday, August 7, 2019

కపిల దేవహూతి సంవాదం - 83


(భక్తి యోగం)

3-986-సీ.
అనుపమ క్షుత్తృష్ణ లంతర్వ్యధలఁ జేయ; 
ఝంఝానిలజ్వలజ్జ్వలన చండ
భానుప్రదీప్తి తప్తం బైన వాలుకా; 
మార్గానుగత తప్యమాన గాత్రుఁ
డై వీఁపుఁ గశలచే నడువంగ వికలాంగుఁ; 
డగుచు మార్గము నందు నచట నచటఁ
జాల మూర్ఛిల్లి యాశ్రయశూన్య మగు నీళ్ళ; 
మునుఁగుచు లేచుచు మొనసి పాప
3-986.1-తే.
రూపమయిన తమముచే నిరూఢుఁ డగుచు
వెలయఁ దొంబదితొమ్మిదివేల యోజ
నముల దూరంబు గల యమనగరమునకుఁ
బూని యమభటుల్ కొంపోవఁ బోవు నంత.

భావము:
ఎడతెగని ఆకలి దప్పులతో లోలోపల వ్యాకులపడుతూ, సుడిగాలుల మధ్య సోలిపోతూ, భగభగమండే సూర్యకిరణాలకు వేడెక్కి మాడిపోతున్న ఇసుక ఎడారుల్లో కాళ్ళు కాలుతూ నడవలేక నడుస్తూ, కొరడా దెబ్బలకు బొబ్బలెక్కిన వీపుతో శిథిలమైన అవయవాలతో మార్గమధ్యంలో అచ్చటచ్చట మూర్ఛిల్లుతూ, దిక్కుమాలిన నీళ్ళలో మునిగితేలుతూ, పాపంలా క్రమ్ముకొన్న చిమ్మచీకటిలోనుంచి తొంబది తొమ్మిది వేల యోజనాల దూరంలో ఉన్న యమపట్టణానికి యమభటులచేత తీసుకొని పోబడతాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=983

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Monday, August 5, 2019

కపిల దేవహూతి సంవాదం - 82


(భక్తి యోగం)

3-984-వ.
అంత మరణావస్థం బొందు సమయంబున నతి భయంకరాకారులు సరభసేక్షణులు నగు యమదూత లిద్దఱు దన ముందఱ నిలిచినం జూచి; త్రస్తహృదయుండై శకృన్మూత్రంబులు విడుచుచు; యమపాశంబులచే గళంబున బద్ధుండై శరీరంబువలన నిర్గమించి; యాతనా శరీరంబు నవలంబించి బలాత్కారంబున దీర్ఘంబై దుర్గమం బగు మార్గంబును బొంది; రాజభటులచే నీయమానుం డగుచు; దండనంబున కభిముఖుండై చను నపరాధి చందంబునఁ జనుచుండి.
3-985-చ.
అనయము మూర్ఛ నొందు శునకావళిచేతను భక్ష్యమాణుఁడై
యనుపమ కాలకింకర భయంకర తర్జనగర్జనంబులన్
మనము గలంగ దేహము సమస్తముఁ గంపము వొందగాఁ బురా
తనభవ పాపకర్మసముదాయముఁ జిత్తములోఁ దలంచుచున్.

భావము:
అంతలో మృత్యువు ముంచుకురాగా మిక్కిలి భయంకరమైన రూపాలతో తీక్షణమైన చూపులతో ఇద్దరు యమదూతలు తనముందు వచ్చి నిలబడగా, వాళ్ళను చూచి గుండెలు పగిలి మలమూత్రాలను విడుస్తూ, యమపాశాలు కంఠాన్ని బంధించగా, ఈ శరీరాన్ని విడిచిపెట్టి యాతనాశరీరంలో ప్రవేశించి, పొడవుగా ఉండి నడవడానికి వీలులేని మార్గంలో యమభటులు బలవంతంగా ఈడ్చుకొని వెళ్ళుతుంటే, రాజభటులవెంట అపరాధిలా శిక్షలు అనుభవించడానికి సంసిద్ధుడై వెళ్తూ అక్కడ కుక్కలు పీక్కుతింటుంటే మూర్ఛపోతాడు. యమభటులు భయంకరంగా అరుస్తూ చేసే అదలింపులకు, బెదరింపులకు మనస్సు కలత చెందగా, శరీరమంతా కంపించిపోగా, పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని పరితపిస్తూ...

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=983

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 81


(భక్తి యోగం)

3-983-సీ.
అతిరోగ పీడితుండై మంద మగు జఠ; 
రాగ్నిచే మిగుల నల్పాశి యగుచు
మెఱసి వాయువుచేత మీఁదికి నెగసిన; 
కన్నులు కఫమునఁ గప్పబడిన
నాళంబులను గంఠనాళంబునను ఘుర; 
ఘుర మను శబ్దము దొరయ బంధు
జనుల మధ్యంబున శయనించి బహువిధ; 
ములఁ దన్ను బిలువంగ బలుకలేక
3-983.1-తే.
చటులతర కాలపాశవశంగతాత్ముఁ
డగుచు బిడ్డలఁ బెండ్లాము నరసి ప్రోచు
చింత వికలములైన హృషీకములును
గలిగి విజ్ఞానమును బాసి కష్టుఁ డగుచు.

భావము:
నానావిధాలైన వ్యాధులు బాధించగా, జఠరాగ్ని మందగించగా, తిండి పడిపోయి, ఆయాసం అతిశయించి, మిడిగ్రుడ్లు పడి, కంఠనాళం మూసుకుపోయి, గొంతులో గురక పుట్టి, బంధువుల అందరిమధ్య పండుకొని, వారు తనను పలుకరిస్తూంటే బదులు పలకడానికి నోరు పెకలక, భయంకరాలైన యమపాశాలు శరీరానికి చుట్టుకోగా, భార్యను పిల్లలను ఎవరు పోషిస్తారా అనే దిగులుతో శిథిలమై పోయిన ఇంద్రియాలతో తెలివి కోల్పోయినవాడై గిలగిలలాడుతూ...

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=983

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 80


(భక్తి యోగం)

3-982-క.
వెడరూపు దాల్చి బాంధవు
లడలఁగ నిర్యాణమునకు నభిముఖుఁడై యి
ల్వెడలఁగజాలక శునకము
వడువునఁ గుడుచుచును మేను వడవడ వడఁకన్

భావము:
రూపం మారిపోగా, బంధువులందరూ ఏవగిస్తుండగా, అంత్యకాలం సమీపించగా, గడప దాటి వెళ్ళలేక కుక్కలా తింటూ, శరీరంలో వణుకు పుట్టుకురాగా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=982

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 79


(భక్తి యోగం)

3-981-సీ.
బలిమి సాలక మందభాగ్యుఁడై కుమతి యై; 
పూని యపుడు క్రియాహీనుఁ డగుచు
దవిలి వృథాప్రయత్నంబులు సేయుచు; 
మూఢుఁడై కార్పణ్యమునఁ జరించు
నట్టి యకించనుఁ డగువానిఁ జూచి త; 
ద్దారసుతాదు లాత్మలను వీఁడు
గడు నశక్తుఁడు ప్రోవఁగాఁజాలఁ డితఁ డని; 
సెగ్గింతు రర్థిఁ గృషీవలుండు
3-981.1-తే.
బడుగు ముసలెద్దు రోసిన పగిది నంత
నతఁడు నేవెంటలను సుఖం బందలేక
తాను బోషించు జనులు దన్ తనరఁ బ్రోవ 
బ్రతుకు ముదిమియు మిక్కిలి బాధపఱుప.

భావము:
శక్తి చాలక, అదృష్టం సన్నగిల్లి, కుటిల బుద్ధితో ఏ విధమైన పనులూ చేయలేని సోమరిపోతై పనికిరాని ప్రయత్నాలు చేస్తూ, పరమ మూర్ఖుడై దీనంగా తిరుగుతూ ఉంటాడు. రైతు బక్కచిక్కిన ముసలి ఎద్దును అసహ్యించుకొన్నట్లు ఆ దరిద్రుణ్ణి చూచి అతని ఆలుబిడ్డలు ‘ఇతడు అశక్తుడు, ఈ పనికిమాలినవాడు మనలను పోషింపలేడు’ అని ఏవగించుకొంటారు. ఈవిధంగా అతడు ఎక్కడా ఏ విధంగానూ సుఖంలేక ఇన్నాళ్ళూ తాను ఎవరినైతే తిండిపెట్టి పోషించాడో వారు పెట్టే తిండి తింటూ, ముసలితనంతో మూలుగుతూ బాధగా బరువుగా బ్రతుకును ఈడుస్తూ (ఉంటాడు).

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=981

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం :

Sunday, August 4, 2019

కపిల దేవహూతి సంవాదం - 78


(భక్తి యోగం)

3-978-క.
విను, మింద్రియ పరవశుఁడై
మునుకొని తత్కూటధర్మములు గల దుఃఖం
బనయము సుఖరూపంబుగ
మనమునఁ దలపోసి తదభిమానుం డగుచున్.
3-979-క.
సతతముఁ దమతమ సంపా
దిత మగు నర్థములచేత ధృతిఁ బరులకుఁ గు
త్సితమతి హింసలు చేయుచు
నతి మూఢమనస్కు లగుచు నాత్మజనములన్.
3-980-తే.
పూని రక్షించుచును వారిభుక్తశేష 
మనుభవించుచు నంత జీవనమువోకఁ
గడఁగి మఱిమఱి యపరార్థకాముఁ డగుచు
సత్త్వమెడలి కుటుంబపోషణము నందు.

భావము:
విను. ఇంద్రియాలకు లొంగి వాటి కుటిల గుణాలవల్ల కలిగే దుఃఖాన్నే పరమసుఖంగా భావించి, ఆ ఇంద్రియాలపై మరింత అభిమానాన్ని పెంచుకుంటూ ఎప్పుడూ తాము సంపాదించుకొన్న ధనాన్ని చూచుకొని పొంగిపోతూ, కుటిలబుద్ధి కలవాడై ఇంతరులను హింసిస్తూ చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ, తనవాళ్ళను పోషించుకుంటూ, వారు తినగా మిగిలినది తాను తింటూ, అప్పటికీ సంసారాన్ని ఈదలేక, బ్రతుకు బరువు భరించలేక స్వార్థపరుడై జవసత్త్వాలు కోల్పోయి, కుటుంబాన్ని పోషించడానికి...

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=980

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 77


(భక్తి యోగం)

3-976-క.
ఘనముగఁ బుత్ర వధూపశు
ధన గృహరక్షణము నందు దత్తత్క్రియలన్
మనమునఁ దలపోయుచు దిన
దినమున్ దందహ్యమాన దేహుం డగుచున్.
3-977-క.
అతి మూఢహృదయుఁ డగుచు దు
రితకర్మారంభమునఁ జరించుచుఁ దరుణీ 
కృతగోప్యభాషణములను
సుతలాలనభాషణములఁ జొక్కుచు మఱియున్.

భావము:
కుమారులు, భార్య, పశువులు, ధనం, ఇల్లు మొదలైన వానిని రక్షించుకొనే ఆలోచనలతో దినదినమూ వేగిపోతూ క్రాగిపోయిన దేహంతో క్రుంగి కృశిస్తూ తెలివిలేనివాడై పాపకార్యాలను ఆచరిస్తూ ఇల్లాలి సరస సల్లాపాలతోనూ, పిల్లల ముద్దుమాటలతోనూ మురిసిపోతూ ఉంటాడు. ఇంకా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=977

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :