Monday, August 5, 2019

కపిల దేవహూతి సంవాదం - 82


(భక్తి యోగం)

3-984-వ.
అంత మరణావస్థం బొందు సమయంబున నతి భయంకరాకారులు సరభసేక్షణులు నగు యమదూత లిద్దఱు దన ముందఱ నిలిచినం జూచి; త్రస్తహృదయుండై శకృన్మూత్రంబులు విడుచుచు; యమపాశంబులచే గళంబున బద్ధుండై శరీరంబువలన నిర్గమించి; యాతనా శరీరంబు నవలంబించి బలాత్కారంబున దీర్ఘంబై దుర్గమం బగు మార్గంబును బొంది; రాజభటులచే నీయమానుం డగుచు; దండనంబున కభిముఖుండై చను నపరాధి చందంబునఁ జనుచుండి.
3-985-చ.
అనయము మూర్ఛ నొందు శునకావళిచేతను భక్ష్యమాణుఁడై
యనుపమ కాలకింకర భయంకర తర్జనగర్జనంబులన్
మనము గలంగ దేహము సమస్తముఁ గంపము వొందగాఁ బురా
తనభవ పాపకర్మసముదాయముఁ జిత్తములోఁ దలంచుచున్.

భావము:
అంతలో మృత్యువు ముంచుకురాగా మిక్కిలి భయంకరమైన రూపాలతో తీక్షణమైన చూపులతో ఇద్దరు యమదూతలు తనముందు వచ్చి నిలబడగా, వాళ్ళను చూచి గుండెలు పగిలి మలమూత్రాలను విడుస్తూ, యమపాశాలు కంఠాన్ని బంధించగా, ఈ శరీరాన్ని విడిచిపెట్టి యాతనాశరీరంలో ప్రవేశించి, పొడవుగా ఉండి నడవడానికి వీలులేని మార్గంలో యమభటులు బలవంతంగా ఈడ్చుకొని వెళ్ళుతుంటే, రాజభటులవెంట అపరాధిలా శిక్షలు అనుభవించడానికి సంసిద్ధుడై వెళ్తూ అక్కడ కుక్కలు పీక్కుతింటుంటే మూర్ఛపోతాడు. యమభటులు భయంకరంగా అరుస్తూ చేసే అదలింపులకు, బెదరింపులకు మనస్సు కలత చెందగా, శరీరమంతా కంపించిపోగా, పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని పరితపిస్తూ...

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=983

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: