Wednesday, August 7, 2019

కపిల దేవహూతి సంవాదం - 83


(భక్తి యోగం)

3-986-సీ.
అనుపమ క్షుత్తృష్ణ లంతర్వ్యధలఁ జేయ; 
ఝంఝానిలజ్వలజ్జ్వలన చండ
భానుప్రదీప్తి తప్తం బైన వాలుకా; 
మార్గానుగత తప్యమాన గాత్రుఁ
డై వీఁపుఁ గశలచే నడువంగ వికలాంగుఁ; 
డగుచు మార్గము నందు నచట నచటఁ
జాల మూర్ఛిల్లి యాశ్రయశూన్య మగు నీళ్ళ; 
మునుఁగుచు లేచుచు మొనసి పాప
3-986.1-తే.
రూపమయిన తమముచే నిరూఢుఁ డగుచు
వెలయఁ దొంబదితొమ్మిదివేల యోజ
నముల దూరంబు గల యమనగరమునకుఁ
బూని యమభటుల్ కొంపోవఁ బోవు నంత.

భావము:
ఎడతెగని ఆకలి దప్పులతో లోలోపల వ్యాకులపడుతూ, సుడిగాలుల మధ్య సోలిపోతూ, భగభగమండే సూర్యకిరణాలకు వేడెక్కి మాడిపోతున్న ఇసుక ఎడారుల్లో కాళ్ళు కాలుతూ నడవలేక నడుస్తూ, కొరడా దెబ్బలకు బొబ్బలెక్కిన వీపుతో శిథిలమైన అవయవాలతో మార్గమధ్యంలో అచ్చటచ్చట మూర్ఛిల్లుతూ, దిక్కుమాలిన నీళ్ళలో మునిగితేలుతూ, పాపంలా క్రమ్ముకొన్న చిమ్మచీకటిలోనుంచి తొంబది తొమ్మిది వేల యోజనాల దూరంలో ఉన్న యమపట్టణానికి యమభటులచేత తీసుకొని పోబడతాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=983

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: