Monday, August 5, 2019

కపిల దేవహూతి సంవాదం - 81


(భక్తి యోగం)

3-983-సీ.
అతిరోగ పీడితుండై మంద మగు జఠ; 
రాగ్నిచే మిగుల నల్పాశి యగుచు
మెఱసి వాయువుచేత మీఁదికి నెగసిన; 
కన్నులు కఫమునఁ గప్పబడిన
నాళంబులను గంఠనాళంబునను ఘుర; 
ఘుర మను శబ్దము దొరయ బంధు
జనుల మధ్యంబున శయనించి బహువిధ; 
ములఁ దన్ను బిలువంగ బలుకలేక
3-983.1-తే.
చటులతర కాలపాశవశంగతాత్ముఁ
డగుచు బిడ్డలఁ బెండ్లాము నరసి ప్రోచు
చింత వికలములైన హృషీకములును
గలిగి విజ్ఞానమును బాసి కష్టుఁ డగుచు.

భావము:
నానావిధాలైన వ్యాధులు బాధించగా, జఠరాగ్ని మందగించగా, తిండి పడిపోయి, ఆయాసం అతిశయించి, మిడిగ్రుడ్లు పడి, కంఠనాళం మూసుకుపోయి, గొంతులో గురక పుట్టి, బంధువుల అందరిమధ్య పండుకొని, వారు తనను పలుకరిస్తూంటే బదులు పలకడానికి నోరు పెకలక, భయంకరాలైన యమపాశాలు శరీరానికి చుట్టుకోగా, భార్యను పిల్లలను ఎవరు పోషిస్తారా అనే దిగులుతో శిథిలమై పోయిన ఇంద్రియాలతో తెలివి కోల్పోయినవాడై గిలగిలలాడుతూ...

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=983

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: