Sunday, July 8, 2018

అంతర్జాల బాలల బొమ్మలు, కథలు పోటీలు - 2018





భాగవత జయంత్యుత్సవాలలో భాగంగా బాలల బొమ్మల మరియు కధల పోటీలకు వెంటనే నమోదు చేసుకొని మీ పిల్లలను ప్రోత్సహించండి.
6 నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలు ప్రపంచంలో ఎక్కడినుండైనా పాల్గొన వచ్చు.
నమోదు, పోటీ నిర్వహణ, విజేతల ప్రకటన, జయపత్ర ప్రదానం అన్నీ అంతర్జాలం ద్వారానే. శ్రీ శ్రీ శ్రీ అమృతానంద సంయమీంద్ర మహాస్వాముల వారిచే అనుగ్రహించబడిన జయపత్రాలు.
ఈ కార్యక్రమాలలో వేటికీ ఫీజు లేదు. ఆసక్తి ఉంటే చాలు.
నమోదుల కొరకు : https://goo.gl/forms/wFPd2JcwrY7XKhPk1
మరిన్ని వివరాలకు : https://sites.google.com/view/bhagavata-jayanthi-2018

శ్రీకృష్ణ లీలలు - ౪౨

10.1-362-మ.
కని చేతన్ సెలగోలఁ బట్టికొనుచుం "గానిమ్ము గానిమ్ము రా
తనయా! యెవ్వరి యందుఁ జిక్కుపడ నేదండంబునుం గాన నే
వినివారంబును బొంద నే వెఱపు నే విభ్రాంతియుం జెంద ము"
న్ననియో నీవిటు నన్నుఁ గైకొనమి నేఁడారీతి సిద్ధించునే.
10.1-363-వ.
అని యదలించుచు కొడుకు నడవడిం దలంచి తనుమధ్య దన మనంబున.

భావము:
కృష్ణుడు కోతికి వెన్న పెడుతూ అల్లరిచేస్తుండటం చూసిన యశోద బెత్తం చేతిలో పట్టుకొని “కన్నయ్యా! నువ్వు ఇప్పటివరకూ ఎవరి చేతికీ చిక్కలేదనీ, నిన్ను ఎవరూ శిక్షించలేరని, ఎవరూ అడ్డుకోలేరని, నిన్ను భయపెట్టరనీ, నీకు అదురూ బెదురూ లేకుండా పోయింది. అందుకే గదా నా మాట బొత్తిగా వినటంలేదు! సరే కానియ్యి! ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను”. అంటూ యశోద కృష్ణున్ని అదలిస్తూ, తన కొడుకు దుడుకుతనం తలచుకుంటూ ఇలా అనుకుంటోంది..

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=53&padyam=362

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం :

Friday, July 6, 2018

శ్రీకృష్ణ లీలలు - ౪౧

10.1-360-వ.
అంత నా లోలలోచన పాలు డించి వచ్చి వికలంబు లయిన దధికుంభ శకలంబులఁ బొడఁగని తుంటకొడుకు వెన్నదింట యెఱింగి నగుచు నా కలభగామిని యతనిం గానక చని చని.
10.1-361-ఆ.
వికచకమలనయన వే ఱొక యింటిలో
వెలయ ఱోలు దిరుగవేసి యెక్కి
యుట్టిమీఁది వెన్న నులుకుచు నొక కోఁతి
పాలు జేయుచున్న బాలుఁ గనియె. 


భావము:
యశోదాదేవి పొయ్యిమీది పాలు దించి వచ్చింది. పగిలిపోయిన పెరుగుకుండ ముక్కలను చూసింది. తుంటరి కొడుకు వెన్న మీగడలు తిన్నాడని గ్రహించి నవ్వుకుంటూ చూస్తే, కొంటె కృష్ణుడు కనిపించలేదు. అతణ్ణి వెతుక్కుంటూ బయలుదేరింది యశోద. ఇంట్లో పెరుగుకుండ పగలగొట్టిన కృష్ణుడు, అక్కడ మరొక ఇంటిలో ఒక రోలుని తిరగేసి, చక్కగా దానిమీద ఎక్కాడు. ఉట్టిమీద ఉన్న వెన్నతీసి బెదురుతూనే ఒక కోతికి పెడుతున్నాడు. యశోదమ్మ వచ్చి అతడు చేస్తున్న ఆ అల్లరి పని చూసింది.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Tuesday, July 3, 2018

శ్రీకృష్ణ లీలలు -౪౦

10.1-358-క.
కవ్వముఁ బట్టిన ప్రియసుతు
న వ్వనరుహనేత్ర దిగిచి యంకతలమునన్
నవ్వుచు నిడుకొని కూఁకటి
దువ్వుచుఁ జన్నిచ్చె; నతఁడు దూఁటుఁచుఁ గుడిచెన్.
10.1-359-మ.
కడుపారం జనుబాలు ద్రావని సుతుం గంజాక్షి పీఠంబుపై
నిడి పొంగారెడు పాలు డించుటకుఁనై యేగంగఁ దద్బాలుఁ డె
క్కుడు కోపంబున వాఁడిఱాత దధిమత్కుంభంబుఁ బోఁగొట్టి తెం
పడరం గుంభములోని వెన్నఁ దినె మిథ్యాసంకులద్భాష్పుఁడై.

భావము:
యశోదాదేవి కవ్వం పట్టుకున్న తన కొడుకు కృష్ణుడిని నవ్వుతూ దగ్గరకు తీసుకుంది. ఒళ్లో కూర్చుండ బెట్టుకుంది. ప్రేమగా జుట్టు దువ్వుతూ అతనికి పాలు ఇవ్వసాగింది. నల్లనయ్య చక్కగా తల్లిరొమ్ములో తలదూర్చి తాగుతున్నాడు. కవ్వం పట్టుకున్న చిన్నారి కృష్ణునికి యశోదాదేవి పాలు ఇస్తూ, పొయ్యిమీది పాలు పొంగిపోతున్నాయి అని చూసింది. అతను పాలు తాగటం పూర్తికాకుండానే పీటమీదకి దింపేసింది. పాలకుండ దింపడానికి గబగబా లోపలికి వెళ్ళింది. తన కడుపు నిండకుండా మధ్యలో వెళ్ళిందని కోపంతో వాడిరాతితో నిండుగా ఉన్న పెరుగుకుండను పగులగొట్టాడు. పగిలిన కుండలోని వెన్నను తినసాగాడు. పైపెచ్చు దొంగకన్నీళ్లు కారుస్తూ ఏడవటం మొదలెట్టాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=51&padyam=359

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలలు - ౩౯

10.1-356-వ.
ఆ సమయంబున.
10.1-357-క.
సుడియుచు వ్రాలుచుఁ గిదుకుచు
సడి గొట్టుచు "నమ్మ! రమ్ము; చన్ని" మ్మనుచున్
వెడవెడ గంతులు వైచుచుఁ
గడవఁ గదిసి బాలకుండు గవ్వముఁ బట్టెన్.


భావము:
యశోద పెరుగు చిలుకుతూ ఉండగా.
కృష్ణబాలకుడు ఆమె చుట్టూ తిరుగుతూ, మీద పడుతూ, పైటలాగతూ అల్లరి చేయసాగాడు. “అమ్మా! రావే! నాకు పాలియ్యవే!” అంటూ గంతులు వేస్తూ దగ్గరకొచ్చి, చిన్నారి కన్నయ్య కవ్వాన్ని కదలకుండా పట్టుకున్నాడు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




శ్రీకృష్ణ లీలలు -౩౮

10.1-355-సీ.
కరకమలారుణ కాంతిఁ గవ్వుపు ద్రాడు; 
పవడంపు నునుఁదీఁవ పగిది మెఱయఁ; 
గ్రమముతో రజ్జు వాకర్షింపఁ బాలిండ్లు; 
వీడ్వడి యొండొంటి వీఁక నొత్తఁ; 
గుచకుంభములమీఁది కొంగు జాఱఁగ జిక్కు; 
పడుచు హారావళుల్ బయలుపడగఁ; 
బొడమిన చెమటతోఁ బొల్పారు నెమ్మోము; 
మంచు పైఁబడిన పద్మంబుఁ దెగడఁ;
10.1-355.1-తే.
గౌను నులియంగఁ; గంకణక్వణన మెసఁగఁ; 
దుఱుము బిగివీడఁ; గర్ణికాద్యుతులు మెఱయ; 
బాలు నంకించి పాడెడి పాట వలనఁ
దరువు లిగురొత్త బెరు గింతి దరువఁ జొచ్చె.

భావము:
అలా యశోదాదేవి పెరుగు చిలుకుతుండగా, ఆమె చేతుల అరుణకాంతులు కవ్వం తాటిపై పడి అది పగడపుతీగలాగ మెరుస్తోంది. తాడును క్రమపద్దతిలో ఒకదాని తరువాత ఒకటి లాగుతుంటే, ఆమె పాలిండ్లు ఒకదానితో ఒకటి ఒరుసుకుంటున్నాయి. వక్షోజాలపై ఉన్న కొంగు జారుతోంది. మెడలోని హారాలు చిక్కు పడుతూ కనబడుతూ ఉన్నాయి. పట్టిన చెమట బిందువులతో అందంగా ఉన్న ముఖం మంచుబిందువులు చెందిన తామరపూవు కన్నా మనోహరంగా ఉంది. సన్నని నడుము జవజవలాడుతూ ఉంది. చేతుల గాజులు గలగలలాడుతూ ఉన్నాయి. కొప్పుముడి బిగింపు సడలుతూ ఉంది. చెవుల కమ్మల కాంతులు తళుక్కుమంటూ ఉన్నాయి. ముద్దు కృష్ణుని ఉద్దేశించి ఆమె పాడేపాటకు చెట్లు చిగురుస్తూ ఉన్నాయి. ఇలా యశోదాదేవి పెరుగు చిలుకుతూ ఉంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=51&padyam=355

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Monday, July 2, 2018

శ్రీకృష్ణ లీలలు - ౩౭

10.1-354-వ.
అంత నొక్కనాఁడు తన యింటికడ పాప లందఱు నయ్యై పనులందుఁ బంపుపడిపోయిన నందసుందరి సంరంభంబునం దరికంబంబు కడఁ గుదురున నొక్క దధికుంభంబు పెట్టి మిసిమిగల మీఁగడపెరుగు గూడంబోసి వీఁక నాఁక త్రాడు కవ్వంబున నలంవరించి.


భావము:
ఒక రోజు యశేదాదేవి ఇంటివద్ద ఉన్న యువతులు అందరూ వారి పనులమీద వెళ్ళిపోయారు. యశోదాదేవి పెరుగు చిలకడానికి చిలుకు స్తంభం వద్ద కుదురు పెట్టి, దానిమీద పెరుగు కుండను పెట్టింది. తరిత్రాటిని కవ్వానికి తగిలించి పెరుగు చిలకడం మొదలు పెట్టింది.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :