Tuesday, July 3, 2018

శ్రీకృష్ణ లీలలు -౩౮

10.1-355-సీ.
కరకమలారుణ కాంతిఁ గవ్వుపు ద్రాడు; 
పవడంపు నునుఁదీఁవ పగిది మెఱయఁ; 
గ్రమముతో రజ్జు వాకర్షింపఁ బాలిండ్లు; 
వీడ్వడి యొండొంటి వీఁక నొత్తఁ; 
గుచకుంభములమీఁది కొంగు జాఱఁగ జిక్కు; 
పడుచు హారావళుల్ బయలుపడగఁ; 
బొడమిన చెమటతోఁ బొల్పారు నెమ్మోము; 
మంచు పైఁబడిన పద్మంబుఁ దెగడఁ;
10.1-355.1-తే.
గౌను నులియంగఁ; గంకణక్వణన మెసఁగఁ; 
దుఱుము బిగివీడఁ; గర్ణికాద్యుతులు మెఱయ; 
బాలు నంకించి పాడెడి పాట వలనఁ
దరువు లిగురొత్త బెరు గింతి దరువఁ జొచ్చె.

భావము:
అలా యశోదాదేవి పెరుగు చిలుకుతుండగా, ఆమె చేతుల అరుణకాంతులు కవ్వం తాటిపై పడి అది పగడపుతీగలాగ మెరుస్తోంది. తాడును క్రమపద్దతిలో ఒకదాని తరువాత ఒకటి లాగుతుంటే, ఆమె పాలిండ్లు ఒకదానితో ఒకటి ఒరుసుకుంటున్నాయి. వక్షోజాలపై ఉన్న కొంగు జారుతోంది. మెడలోని హారాలు చిక్కు పడుతూ కనబడుతూ ఉన్నాయి. పట్టిన చెమట బిందువులతో అందంగా ఉన్న ముఖం మంచుబిందువులు చెందిన తామరపూవు కన్నా మనోహరంగా ఉంది. సన్నని నడుము జవజవలాడుతూ ఉంది. చేతుల గాజులు గలగలలాడుతూ ఉన్నాయి. కొప్పుముడి బిగింపు సడలుతూ ఉంది. చెవుల కమ్మల కాంతులు తళుక్కుమంటూ ఉన్నాయి. ముద్దు కృష్ణుని ఉద్దేశించి ఆమె పాడేపాటకు చెట్లు చిగురుస్తూ ఉన్నాయి. ఇలా యశోదాదేవి పెరుగు చిలుకుతూ ఉంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=51&padyam=355

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: