10.1-358-క.
కవ్వముఁ బట్టిన ప్రియసుతు
న వ్వనరుహనేత్ర దిగిచి యంకతలమునన్
నవ్వుచు నిడుకొని కూఁకటి
దువ్వుచుఁ జన్నిచ్చె; నతఁడు దూఁటుఁచుఁ గుడిచెన్.
10.1-359-మ.
కడుపారం జనుబాలు ద్రావని సుతుం గంజాక్షి పీఠంబుపై
నిడి పొంగారెడు పాలు డించుటకుఁనై యేగంగఁ దద్బాలుఁ డె
క్కుడు కోపంబున వాఁడిఱాత దధిమత్కుంభంబుఁ బోఁగొట్టి తెం
పడరం గుంభములోని వెన్నఁ దినె మిథ్యాసంకులద్భాష్పుఁడై.
భావము:
యశోదాదేవి కవ్వం పట్టుకున్న తన కొడుకు కృష్ణుడిని నవ్వుతూ దగ్గరకు తీసుకుంది. ఒళ్లో కూర్చుండ బెట్టుకుంది. ప్రేమగా జుట్టు దువ్వుతూ అతనికి పాలు ఇవ్వసాగింది. నల్లనయ్య చక్కగా తల్లిరొమ్ములో తలదూర్చి తాగుతున్నాడు. కవ్వం పట్టుకున్న చిన్నారి కృష్ణునికి యశోదాదేవి పాలు ఇస్తూ, పొయ్యిమీది పాలు పొంగిపోతున్నాయి అని చూసింది. అతను పాలు తాగటం పూర్తికాకుండానే పీటమీదకి దింపేసింది. పాలకుండ దింపడానికి గబగబా లోపలికి వెళ్ళింది. తన కడుపు నిండకుండా మధ్యలో వెళ్ళిందని కోపంతో వాడిరాతితో నిండుగా ఉన్న పెరుగుకుండను పగులగొట్టాడు. పగిలిన కుండలోని వెన్నను తినసాగాడు. పైపెచ్చు దొంగకన్నీళ్లు కారుస్తూ ఏడవటం మొదలెట్టాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=51&padyam=359
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment