Sunday, May 14, 2017

దక్ష యాగము - 32:

4-87-సీ.
"అనయంబు శివ యను నక్షరద్వయ మర్థి;
వాక్కునఁ బలుక భావమునఁ దలఁప
సర్వజీవుల పాపసంఘముల్ చెడు; నట్టి;
మహితాత్మునందు నమంగళుండ
వగు నీవు విద్వేషి వగుట కాశ్చర్యంబు;
నందెద; వినుము; నీ వదియుఁ గాక
చర్చింప నెవ్వని చరణపద్మంబుల;
నరసి బ్రహ్మానంద మను మరంద
4-87.1-తే.
మతుల భక్తిని దమ హృదయంబు లనెడి
తుమ్మెదలచేతఁ గ్రోలి సంతుష్టచిత్తు
లగుదు రత్యంత విజ్ఞాను; లట్టి దేవు
నందు ద్రోహంబు చేసి; తే మందు నిన్ను?

టీకా:
అనయంబున్ = అవశ్యమును; శివ = శివ; అను = అనెడి; అక్షర = అక్షరముల; ద్వయము = రెంటిని; అర్థిన్ = కోరి; వాక్కునన్ = నోటితొ; పలుకన్ = పలుకుతే; భావమునన్ = భావములో; తలపన్ = తలచుకొన్న; సర్వ = సమస్తమైన; జీవుల్ = ప్రాణుల; పాప = పాపముల; సంఘముల్ = సమూహములు; చెడును = నాశనమగును; అట్టి = అటువంటి; మహితాత్ము = మహిమాన్వితమైనఆత్మ కలవాడు; అందున్ = ఎడల; అమంగళుండవు = అశుభకరమైనవాడవు; అగు = అయిన; నీవున్ = నీవు; విద్వేషివి = శత్రుత్వము కలవాడవు; అగుటన్ = అవుటకు; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యమును; అందెదన్ = పోయెదను; వినుము = వినుము; నీవున్ = నీవు; అదియున్ = అంతే; కాక = కాకుండగ; చర్చింపన్ = చర్చించి చూసినచో; ఎవ్వని = ఎవని; చరణ = పాదములు అనెడి; పద్మంబులన్ = పద్మములను; అరసి = ఎరిగి; బ్రహ్మానందము = బ్రహ్మానందము; అను = అనెడి; మరందము = మధువుని; అతుల = మిక్కలి. భక్తిన్ = భక్తితో; తమ = తమయొక్క; హృదయంబులు = మనసులు; అనెడి = అనెడి; తుమ్మెదలన్ = తుమ్మెదల; చేతన్ = వలన; గ్రోలి = త్రాగి; సంతుష్ట = సంతోషించిన; చిత్తులు = చిత్తములు కలవారు; అగుదురు = అవుతారో; అత్యంత = అత్యధికమైన; విజ్ఞానులు = చక్కటి జ్ఞానము కలవారు; అట్టి = అటువంటి; దేవుని = దేవుని; అందున్ = ఎడల; ద్రోహంబు = ద్రోహము; చేసితి = చేసావు; ఏమి = ఏమని; అందున్ = అంటాను; నిన్ను = నిన్ను.

భావము:
“ఎల్లప్పుడూ శివ అనే రెండక్షరాలను ఆసక్తితో నోటితో పలికినా, మనస్సులో తలచినా సమస్త ప్రాణుల పాపలన్నీ నశిస్తాయి. అటువంటి మహాత్ముని అమంగళుడవైన నీవు ద్వేషించడం చూచి ఆశ్చర్యాన్ని పొందుతున్నాను. తండ్రీ! విను. గొప్ప విజ్ఞానులు అయినవారు ఏ దేవుని పాదారవిందాలను ధ్యానిస్తూ బ్రహ్మానందమనే మకరందాన్ని తమ మనస్సులనే తుమ్మెదల ద్వారా భక్తిపారవశ్యంతో గ్రోలి తృప్తిపొందుతారో అటువంటి దేవునికి ద్రోహం చేశావు. నిన్నేమనాలి?

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=87

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday, May 13, 2017

దక్ష యాగము - 31:

4-85-క.
జనకుం డవమానించుట
యును సోదరు లర్థిఁ దనకు నుచితక్రియఁ జే
సిన పూజల నందక శో
భన మరసిన మాఱుమాట పలుకక యుండెన్.
4-86-వ.
ఇట్లు తండ్రిచే నాదరింపబడనిదై విభుండైన యీశ్వరు నందు నాహ్వాన క్రియాశూన్యత్వరూపంబైన తిరస్కారంబును, నరుద్ర భాగంబైన య జ్ఞంబునుం గనుంగొని నిజరోషానలంబున లోకంబులు భస్మంబు చేయంబూనిన తెఱంగున నుద్రేకించి 'రుద్రద్వేషియుఁ గ్రతుకర్మాభ్యాస గర్విష్ఠుండు నగు దక్షుని వధియింతు' మనుచు లేచిన భూతగణంబుల నివారించి రోషవ్యక్తభాషణంబుల నిట్లనియె; "లోకంబున శరీరధారులైన జీవులకుఁ బ్రియాత్మకుండైన యీశ్వరునకుఁ బ్రియాప్రియలును నధికులును లేరు; అట్టి సకల కారణుండును నిర్మత్సరుండును నైన రుద్రు నందు నీవు దక్క నెవ్వండు ప్రతికూలం బాచరించు? నదియునుం గాక మిముబోఁటి వారలు పరులవలని గుణంబు లందు దుర్గుణంబులన యాపాదింతురు; మఱియుం గొందఱు మధ్యస్థులైన వారలు పరుల దుర్గుణంబుల యందు దోషంబుల నాపాదింపరు; కొందఱు సాధువర్తనంబు గలవారలు పరుల దోషంబుల నైన గుణంబులుగా ననుగ్రహింతురు; మఱియుం గొందఱుత్తమోత్తములు పరుల యందు దోషంబుల నాపాదింపక తుచ్ఛగుణంబులు గలిగినను సద్గుణంబులుగాఁ గైకొందురు; అట్టిమహాత్ముల యందు నీవు పాపబుద్ధి గల్పించితి” వని; వెండియు నిట్లను “మహాత్ములగు వారల పాదధూళిచే నిరస్తప్రభావులై జడ స్వభావంబుగల దేహంబునాత్మ యని పల్కు కుజను లగువారు మహాత్ముల నిందించుట కార్యంబు గాదు: అదియు వారి కనుచితం బగు” నని వెండియు నిట్లనియె.

టీకా:
జనకుండు = తండ్రి; అవమానించుటయునున్ = అవమానము చేయుటచేత; సోదరులు = తోబుట్టువులు; తన్ = తన; కున్ = కు; ఉచిత = తగిన; క్రియన్ = విధముగ; చేసిన = చేసినట్టి; పూజలన్ = గౌరవమర్యాదలను; అందక = చెందక; శోభనము = కుశలము; అరసిన = విచారించగ; మాఱుమాట = సమాధానము; పలుకక = పలక్కుండ; ఉండెన్ = ఉండెను. ఇట్లు = ఇలా; తండ్రి = తండ్రి; చేన్ = చేత; ఆదరిపంబడనిది = మన్ననలు పొందనిది; ఐ = అయ్యి; విభుండు = భర్త; ఐన = అయన; ఈశ్వరున్ = శివుని; ఆహ్వాన = పిలిచుటనే; క్రియా = ఆచారించుటలు; శూన్యత్వ = లేకపోవుట యొక్క; రూపంబు = విధము; ఐన = అయినట్టి; తిరస్కారంబునున్ = అనాదరముచేయుటను; అరుద్ర = రుద్రుడులేని; భాగంబు = భాగము; ఐన = అయినట్టి; యజ్ఞంబున్ = యాగమును; కనుంగొని = చూసి; నిజ = తమ; రోషా = రోషము అనెడి; అనలంబునన్ = అగ్నిలో; లోకంబులున్ = లోకములను; భస్మంబున్ = బూడిద; చేయన్ = చేయుటకు; పూనినన్ = పూనుకొను; తెఱంగునను = విధముగ; ఉద్రేకించి = ఉద్రేకిస్తూ; రుద్ర = శివుని యెడల; ద్వేషియున్ = శత్రుత్వము కలవాడును; కర్మ = వేదవిధికర్మలు; అభ్యాస = చేయుట యందు; గర్విష్టుండున్ = గర్వముకలవాడును; అగు = అయినట్టి; దక్షుని = దక్షుని; వధియింతుము = సంహరించెదము; అనుచున్ = అంటూ; లేచిన = లేచినట్టి; భూతగణంబులన్ = భూతగణములను; నివారించి = ఆపి; రోష = రోషము; వ్యక్త = వ్యక్తమౌతున్న; భాషణంబులన్ = మాటలతో; ఇట్లు = ఇలా; అనియెన్ = పలికెను; లోకంబున = లోకములో; శరీర = దేహమును; ధారులు = ధరించినవారు; ఐన = అయినట్టి; జీవుల్ = ప్రాణుల; కున్ = కి; ప్రియ = ప్రియమైన; ఆత్మకుండు = స్వరూపముకలవాడు; ఐన = అయినట్టి; ఈశ్వరున్ = శివుని; కున్ = కి; ప్రియా = ఇష్టులును; అప్రియలును = అయిష్టులును; అధికులున్ = గొప్పవారును; లేరు = లేరు; అట్టి = అటువంటి; సకల = సమస్తమునకును; కారణుండును = కారణమైనవాడును; నిర్మత్సరుండును = మాత్సర్యములేనివాడును; ఐన = అయినట్టి; రుద్రున్ = శివుని; అందున్ = యెడల; నీవున్ = నీవే; తక్క = తప్పించి; ఎవ్వండున్ = ఎవరును; ప్రతికూలంబున్ = వ్యతిరేకమును; ఆచరించు = చేయును; అదియునన్ = అంతే; కాక = కాకుండగ; మిమున్ = మీ; పోటి = లాంటి; వారలు = వారు; పరుల = ఇతరుల; వలని = అందలి; గుణంబులు = గుణములు; అందున్ = లో; దుర్గుణంబులన = దుర్గుణములనే; ఆపాదింతురు = ఆరోపించెదరు; మఱియున్ = ఇంకను; కొందఱు = కొంతమంది; మధ్యస్థులు = మధ్యమగుణములుకలిగిన; వారలు = వారు; పరుల = ఇతరుల; దుర్గుణంబులన్ = దుర్గుణములు; అందున్ = లో; దోషంబులన్ = దోషములను; ఆపాదింపరు = ఆరోపించరు; కొందఱు = కొంతమంది; సాధు = మంచి; వర్తనంబులు = ప్రవర్తనలు; కల = కలిగిన; వారలు = వారు; పరుల = ఇతరుల; దోషంబులన్ = దోషములను; ఐనన్ = అయినట్టి; గుణంబులు = గుణములు; కాన్ = అగునట్లు; అనుగ్రహింతురు = పరిగ్రహించెదరు; మఱియున్ = ఇంకను; కొందఱు = కొందరు; ఉత్తమ = ఉత్తములలో; ఉత్తములు = ఉత్తములు; పరుల = ఇతరుల; అందున్ = యెడల; దోషంబులన్ = దోషములను; ఆపాదింపక = ఆరోపించక; తుచ్చ = నీచమైన; గుణంబులు = గుణములు; కలిగినను = ఉన్నను; సత్ = మంచి; గుణంబులు = గుణములు; కాన్ = అగునట్లు; కైకొందురు = స్వీకరింతురు; అట్టి = అటువంటి; మహాత్ములన్ = గొప్పవారి; అందున్ = యెడల; నీవున్ = నీవు; పాప = పాపపు; బుద్ధిన్ = బుద్ధిని; కల్పించితివి = లేనివి ఆరోపించితివి; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను; మహాత్ములు = గొప్పవారు; అగు = అయిన; వారల = వారి; పాదఘూళి = పాదధూళి; చేన్ = వలన; నిరస్త = తొలగింపబడిన; ప్రభావులు = ప్రభావము కలవారు; ఐ = అయ్యి; జడ = జడత్వపు; స్వభావంబు = స్వభావము; కల = కలిగినట్టి; దేహంబున్ = శరీరమును; ఆత్మ = తాము; అని = అని; పల్కు = పలికెడి; కుజనులు = చెడ్డమానవులు; అగు = అయిన; వారు = వారు; మహాత్ములన్ = గొప్పవారిని; నిందించుట = నిందించుట; కార్యంబు = తగినపని; కాదు = కాదు; అదియున్ = అది; వారి = వారి; కిన్ = కి; అనుచితంబు = ఉచితముకానిది; అగును = అవుతుంది; అని = అని; వెండియున్ = మరల; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.


భావము:
తండ్రి అవమానించడంతో తోబుట్టువులు చేసిన గౌరవాన్ని సతీదేవి అందుకొనక, వారికి బదులు చెప్పలేక పోయింది. ఈ విధంగా సతీదేవి తన తండ్రి ఆదరాన్ని పొందనిదై, తన భర్తను యజ్ఞానికి ఆహ్వానించకుండా తిరస్కరించడాన్ని, శివునికి భాగం కల్పించకుండా జరుపుతున్న యజ్ఞాన్ని చూసి, తన కోపాగ్ని జ్వాలలతో లోకాలను బూడిద చేయాలన్నంత ఉద్రేకాన్ని పొంది, శివుని ద్వేషించి క్రతువు చేస్తున్నానని గర్వపడుతున్న దక్షుణ్ణి హతమారుస్తామని లేచిన ప్రమథగణాలను నివారించి, రోషావేశంతో ఇలా అన్నది. “లోకంలోని ప్రాణులందరికీ ఇష్టమైన శివునకు ఇష్టమైనవారు అనీ, ఇష్టం లేనివారు అనీ ఎవరూ లేరు. అతనికంటె అధికులు లేరు. సకల విశ్వానికి కారణమైన ఈశ్వరునకు ఎవరియందూ ద్వేషము లేదు. అలాంటి రుద్రుని నీవు తప్ప లోకంలో ఇంకెవరు ద్వేషిస్తారు? అంతేకాక నీవంటివాళ్ళు ఇతరుల గుణాలలో దోషాలను ఆపాదిస్తారు. కొందరు మధ్యస్థులు ఇతరుల గుణాలలో దోషాలను ఆపాదించరు. కొందరు సత్పురుషులు ఇతరుల దోషాలనైనా గుణాలుగా గ్రహిస్తారు. ఇంకా కొందరు ఉత్తమోత్తములు ఇతరులలో దోషాలను ఆరోపించక వారి నీచగుణాలను సైతం సద్గుణాలుగా స్వీకరిస్తారు. అటువంటి మహాత్ములలో నీవు పాపబుద్ధిని కలిగించావు.” అని చెప్పి ఇంకా ఇలా అన్నది. “మహాత్ముల పాదధూళిముందు వెలవెలబోయిన తేజస్సు కలిగి, జడపదార్థమైన దేహాన్నే ఆత్మ అని వాదించే దుర్జనులు సజ్జనులను నిందించడంలో ఆశ్చర్యం లేదు. అది వారి తగినదే” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=86

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday, May 12, 2017

దక్ష యాగము - 30

4-83-క.
చనుదెంచిన యమ్మగువను
జననియు సోదరులుఁ దక్క సభఁ గల జను లె
ల్లను దక్షువలని భయమున
ననయము నపు డాదరింపరైరి మహాత్మా!
4-84-క.
నెఱిఁ దల్లియుఁ బినతల్లులుఁ
బరిరంభణ మాచరింపఁ బరితోషాశ్రుల్
దొరఁగఁగ డగ్గత్తికతో
సరసిజముఖి సేమ మరయ సతి దా నంతన్.

టీకా:
చనుదెంచిన = వచ్చిన; ఆ = ఆ; మగువను = స్త్రీని; జననియు = తల్లి; సోదరులున్ = తోడబుట్టనవారు; తక్క = తప్పించి; సభన్ = సదస్సున; కల = ఉన్న; జనులు = ప్రజలు; ఎల్లను = అందరును; దక్షు = దక్షుని; వలని = అందలి; భయమునన్ = భయముతో; అనయమున్ = మృదుత్వములేక; అపుడు = అప్పుడు; ఆదరింపరు = అదరింపనివారు; ఐరి = అయ్యారు; మహాత్మా = గొప్పవాడ. నెఱిన్ = నిండుగ; తల్లియున్ = తల్లి; పినతల్లులన్ = పినతల్లులు; పరిరంభణము = కౌగలింతలు; ఆచరింపన్ = చేయగ; పరితోష = ఆనంద; అశ్రుల్ = భాష్పములు; = తొరగగ = కారగా; డగ్గుతిక = గద్గదస్వరము; తోన్ = తో; సరసిజముఖి = సతీదేవి {సరసిజముఖి - సరసిజము (సరసున పుట్టు పద్మము) వంటి ముఖము కలామె, స్త్రీ}; సేమము = క్షేమము; అరయన్ = విచారించగ; సతిన్ = సతీదేవి; తాన్ = తను; అంతన్ = అంతట.

భావము:
విదురా! వచ్చిన సతీదేవిని చూడగానే తల్లి, తోబుట్టువులు అనురాగంతో ఆదరించారు. సభలో ఉన్న తక్కినవారు దక్షునికి భయపడి ఆమెను గౌరవించకుండా ఊరకున్నారు. తల్లి, పినతల్లులు సతీదేవిని కౌగలించుకొని ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గదస్వరంతో కుశలప్రశ్నలు వేయగా, సతీదేవి అప్పుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=84

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday, May 11, 2017

దక్ష యాగము - 29:


4-80-వ.
ముందట.
4-81-చ.
మనమున మోదమందుచు నుమాతరుణీమణి గాంచెఁ జారు మృ
త్కనక కుశాజినాయస నికాయ వినిర్మిత పాత్ర సీమము
న్ననుపమ వేదఘోష సుమహత్పశు బంధన కర్మ భూమమున్
మునివిబుధాభిరామము సముజ్జ్వల హోమము యాగధామమున్.
4-82-వ.
ఇట్లు గనుంగొని యజ్ఞశాలం బ్రవేశించిన.

టీకా:
ముందటన్ = ఎదుట. మనమునన్ = మనసులో; మోదమున్ = సంతోషమును; అందుచున్ = చెందుతూ; ఉమా = ఉమ అనెడి; తరుణీ = స్త్రీ లలో {తరుణి - తరుణ వయసునున్నామె, స్త్రీ}; మణి = రత్నములాంటామె; కాంచెన్ = చూసెను; చారు = అందమైన; మృత్ = మట్టితోను; కనక = బంగారముతోను; కుశ = దర్భలు; అజిన = లేడిచర్మము; అయస = ఇనుము; నికాయ = సమూహముచే; వినిర్మిత = చక్కగ నిర్మింపబడ్డ; పాత్ర = పాత్రలుగల; సీమమున్ = భూమిని; అనుపమ = గొప్ప {అనుపమ - ఉపమానమునకు అందనిది, గొప్ప}; వేద = వేదముల; ఘోష = శబ్దములు; సు = మంచి; మహత్ = గొప్ప; పశు = యజ్ఞపశువుని; బంధన = బంధించిన; భూమమున్ = స్థలమును; ముని = మునులతోను; విబుధ = దేవతలతోను; అభిరామము = చక్కనైనదానిని; సమ = చక్కగా; ఉజ్జ్వల = జ్వలిస్తున్న; హోమము = హోమము కలదానిని; యాగ = యజ్ఞ; ధామమున్ = భూమిని. ఇట్లు = ఈవిధముగ; కనుంగొని = చూసి; యజ్ఞశాలన్ = యజ్ఞశాలను; ప్రవేశించినన్ = ప్రవేశించగా.

భావము:
ఎదురుగా... సతీదేవి మనస్సులో సంతోషిస్తూ యజ్ఞశాలను చూసింది. ఆ యజ్ఞశాలలో కొయ్యతో, మట్టితో, బంగారంతో, లోహంతో చేసిన పాత్రలున్నాయి. దర్భలతో, జింకతోళ్ళతో చేసిన వస్తువులు ఉన్నాయి. వేదఘోషలు మిన్ను ముట్టుతున్నాయి. ఒకచోట యజ్ఞ పశువును బంధించారు. మునులు, దేవతలు తమతమ స్థానాలలో కూర్చుని ఉన్నారు. హోమాలు చేస్తున్నారు. యజ్ఞం వైభవోపేతంగా జరుగుతున్నది. ఇదంతా చూస్తూ యజ్ఞశాలలోకి ప్రవేశించగా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=81

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday, May 10, 2017

దక్ష యాగము - 28:


4-78-వ.
ఇ ట్లతి శీఘ్రగమనంబున.
4-79-సీ.
మానిని చనుచుండ మణిమన్మదాది స;
హస్ర సంఖ్యాత రుద్రానుచరులు
యక్షులు నిర్భయులై వృషభేంద్రుని;
మున్నిడు కొనుచు నమ్ముదిత దాల్చు
కందుకాంబుజ శారికా తాళవృంత ద;
ర్పణ ధవళాతపత్రప్రసూన
మాలికా సౌవర్ణమణివిభూషణ ఘన;
సార కస్తూరికా చందనాది
4-79.1-తే.
వస్తువులు గొంచు నేగి శర్వాణిఁ గదిసి
శంఖ దుందుభి వేణు నిస్వనము లొప్ప
మానితంబైన వృషభేంద్రయానఁ జేసి
యజ్ఞభూమార్గులై యర్థి నరిగియరిగి.

టీకా:
ఇట్లు = ఈవిధముగ; అతి = మిక్కిలి; శ్రీఘ్ర = వేగమైన; గమనంబున = గమనముతో, పోకతో. మానిని = స్త్రీ {మానిని - మానముగలామె, స్త్రీ}; చనుచుండన్ = వెళ్ళుతుండగ; మణిమత్ = మణిమంతుడు; మద = మదుడు; ఆది = మొదలగువారు; సహస్ర = వేల; సంఖ్యాక = కొలది; రుద్ర = శివుని; అనుచరులు = అనుయాయులు; యక్షులు = యక్షులు; నిర్భయులు = భయములేనివారు; ఐ = అయ్యి; వృషభేంద్రుని = నందీశ్వరుని; ముందు = ముందట; ఇడుకొనుచు = ఉండుకొని; ఆ = ఆ; ముదిత = స్త్రీ {ముదిత - ముదము (సంతోషమును) ఇచ్చునది, స్త్రీ}; తాల్చు = ధరించు; కందుక = చెండ్లు; అంబుజ = పద్మములు; శారికా = చిలుకలు; తాళవృంత = తాటాకు విసనకర్రలు; దర్పణ = అద్దము; ధవళ = తెల్లని; అతపత్ర = గొడుగు; ప్రసూన = పూల; మాలిక = మాలలు; సౌవర్ణ = బంగారు; మణి = రత్న; విభూషణ = ఆభరణములు; ఘనసార = పచ్చకర్పూరము; కస్తూరిక = కస్తూరి; చందన = గంధము; ఆది = మొదలైన.  వస్తువులు = సామాను; కొంచున్ = తీసుకొని; ఏగి = వెళ్ళి; శర్వాణిన్ = సతీదేవిని {శర్వాణి - శర్వుని భార్య, సతి}; కదిసి = చేరి; శంఖ = శంఖము; దుందుభి = దుందుభి; వేణు = వేణువుల; నిస్వనములు = శబ్దములు; ఒప్పన్ = ఒప్పునట్లు; మానితంబు = గౌరవింపదగినది; ఐన = అయిన; వృషభేంద్రుని = శ్రేష్టమైన ఎద్దువాహనము; యానన్ = ఎక్కినదానిని; చేసి = చేసి; యజ్ఞ = యజ్ఞము జరుగు; భూ = ప్రదేశమునకు వెళ్ళు; మార్గులు = మార్గమున పోవువారు; ఐ = అయ్యి; అర్థిన్ = కోరి; అరిగియరిగి = వెళ్ళి.

భావము:
ఈ విధంగా మిక్కిలి వేగంతో ప్రయాణం చేసి... సతీదేవి వెళ్తుండగా మణిమంతుడు మొదలైన వేలకొలది ప్రమథులు, యక్షులు నందీశ్వరుని ముందు పెట్టుకొని బయలుదేరారు. ఆమెకు కావలసిన పూబంతులు, పద్మాలు, గోరువంకలు, విసనకర్రలు, అద్దాలు, వెల్లగొడుగు, పూలదండలు, మణులు కూర్చిన బంగారు నగలు, పచ్చకర్పూరం, కస్తూరి, మంచిగంధం మొదలైన వస్తువులను వెంట తీసుకొని వెళ్ళి ఆమెను కలుసుకున్నారు. సతీదేవిని వృషభవాహనంపై కూర్చుండబెట్టి శంఖాలు, నగారాలు, పిల్లనగ్రోవులు మ్రోగిస్తూ యజ్ఞం జరిగే ప్రదేశంవైపు ప్రయాణం చేసి చేసి...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=79

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday, May 9, 2017

దక్ష యాగము - 27:

4-77-సీ.
సతి సుహృద్దర్శనేచ్ఛా ప్రతికూల దుః;
ఖస్వాంత యగుచు నంగములు వడఁక
నందంద తొరఁగెడు నశ్రుపూరంబులు;
గండభాగంబులఁ గడలుకొనఁగ
నున్నత స్తనమండలోపరిహారముల్;
వేఁడి నిట్టూర్పుల వెచ్చఁ గంద
నతిశోకరో షాకులాత్యంత దోదూయ;
మానమై హృదయంబు మలఁగుచుండ


4-77.1-తే.
మఱియుఁ గుపితాత్మయై స్వసమానరహితు
నాత్మదేహంబు సగ మిచ్చి నట్టి భవుని
విడిచి మూఢాత్మ యగుచు న వ్వెలఁది జనియె
జనకుఁ జూచెడు వేడుక సందడింప.

టీకా:
సతి = సతీదేవి; సుహృత్ = బంధువులను; దర్శన = చూసే; ఇచ్చా = కోరికకు; ప్రతికూల = వ్యతిరేకమువలని; దుఃఖ = దుఃఖముకల; స్వంత = మనసుకలిగినది; అగుచున్ = అవుతూ; అంగములు = అవయవములు; వడకన్ = వణుకుతుండగ; అందంద = అక్కడక్కడ; తొరగెడు = జారెడు; అశ్రుపూరంబులు = కన్నీటిజాళ్ళు; గండభాగంబులన్ = చెక్కిళ్ళపై; కడలుకొనగ = వ్యాపిస్తుండగ; ఉన్నత = ఎత్తైన; స్తన = కుచ; మండల = ప్రాంతము; ఉపరి = పైనున్న; హారముల్ = హారములు; వేడి = వెచ్చటి; నిడు = దీర్ఘమైన; ఊర్పులన్ = ఊపిరులవలన; వెచ్చన్ = వేడిని; అందన్ = చెందగ; అతి = మిక్కిలి; శోక = శోకము; రోషా = రోషములతో; ఆకుల = చీకాకుచేత; అత్యంత = అతిమిక్కిలి; దోదూయమానము = చలించిపోయినది; ఐ = అయ్యి; హృదయంబున్ = మనసు; మలగుచున్ = బాధపడుతుండగ. మఱియున్ = ఇంకను; కుపిత = కోపముచెందిన; ఆత్మ = మనలుకలది; ఐ = అయ్యి; స్వ = తనకు; సమాన = సమానమైనవారు; రహితున్ = లేనివాని; ఆత్మ = తన; దేహంబున్ = దేహమును; సగము = అర్థము; ఇచ్చిన = ఇచ్చిన; అట్టి = అటువంటి; భవుని = శివుని; విడిచి = వదలి; మూఢాత్మ = తెలివిహీన; అగుచున్ = అవుతూ; ఆ = ఆ; వెలది = స్తీ; చనియెన్ = వెళ్ళెను; జనకున్ = తండ్రి; చూచెడు = చూసే; వేడుక = కుతూహలము; సందడింపన్ = తొందరపెట్టగ.

భావము:
తన బంధువులను చూడాలనే కుతూహలం సఫలం కాకపోవడం వల్ల సతీదేవి మనస్సులో దుఃఖం పొంగి పొరలింది. అవయవాలు కంపించాయి. కన్నీళ్ళు చెక్కిళ్ళపై జాలువారాయి. వక్షస్థలం మీది హారాలు నిట్టూర్పుల వేడికి కందిపోయాయి. శోకంతో కోపాతిరేకంతో సతీదేవి మనస్సు చలించి కలత చెందింది. ఆ కోపంలో ఆమె వివేకం కోల్పోయింది. తనతో సరిసమానుడు లేని స్వామిని, తన శరీరంలో సగమిచ్చిన తన స్వామిని, పరమేశ్వరుణ్ణి విడిచిపెట్టి తండ్రిని చూడాలనే కుతూహలం అతిశయించగా ఒంటరిగా పుట్టింటికి బయలుదేరింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=77

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday, May 8, 2017

దక్ష యాగము - 26:

4-76-వ.
అదియునుం గాక, నీ వతనికిం బ్రత్యుత్థానాభివందనంబులు గావింపకుండుటం జేసి యతండు తిరస్కృతుండయ్యె నంటివేని లోకంబున జను లన్యోన్యంబును బ్రత్యుత్థానాభివందనంబులు గావింతు; రదియ ప్రాజ్ఞ లయినవారు సర్వభూతాంతర్యామి యైన పరమపురుషుండు నిత్యపరిపూర్ణుండు గావునఁ గాయికవ్యాపారం బయుక్తం బని తదుద్దేశంబుగా మనంబునంద నమస్కారాదికంబులు గావింతురు; గాని దేహాభిమానంబులు గలుగు పురుషులందుఁ గావింపరు; కాన యేనును వాసుదేవ శబ్దవాచ్యుండు శుద్ధసత్త్వమయుండు నంతఃకరణంబు నందు నావరణ విరహింతుడు నయి ప్రకాశించు వాసుదేవునకు నా హృదయంబున నెల్లప్పుడు నమస్కరించుచుండుదు; ఇట్ల నపరాధినైన నన్నుఁ బూర్వంబున బ్రహ్మలు చేయు సత్రంబు నందు దురుక్తులం జేసి పరాభవించి మద్ద్వేషి యైన దక్షుండు భవజ్జనకుం డైన నతఁడును దదనువర్తు లయిన వారలును జూడఁ దగరు; కావున మద్వచనాతిక్రమంబునం జేసి యరిగితివేని నచట నీకుఁ బరాభవంబు సంప్రాప్తం బగు; లోకంబున బంధుజనంబులవలనఁ బూజ బడయక తిరస్కారంబు వొందుట చచ్చుటయ కాదే;” యని పలికి మఱియు నభవుండు, పొమ్మని యనుజ్ఞ యిచ్చిన నచ్చట నవమానంబునం జేసి యశుభం బగు ననియు; నిచ్చటఁ బొమ్మనక నివారించిన మనోవేదన యగు ననియు మనంబునం దలపోయుచు నూరకుండె; అంత.

టీకా:
అదియున్ = అంతే; కాక = కాకుండగ; నీవు = నీవు; అతనికిన్ = అతనికి; ప్రత్యుత్థాన = లేచి ఎదుర్కనుట; అభివందనంబులున్ = నమస్కారములు; కావింపకుండుటన్ = చేయకపోవుట; చేసి = వలన; అతండు = అతడు; తిరస్కృతుండు = వ్యతిరేకభావమందినవాడు; అయ్యెన్ = ఆయెను; అంటివేని = అన్నట్లయితే; లోకంబునన్ = లోకములో; జనులు = ప్రజలు; అన్యోన్యంబును = ఒకరికొకరు; ప్రత్యుత్థాన = లేచి ఎదుర్కనుట; అభివందనంబులున్ = నమస్కారములు; కావింతురు = చేయుదురు; అదియ = అదే; ప్రాజ్ఞలు = ప్రజ్ఞకలవారు; అయినవారు = అయినవారు; సర్వ = అన్ని; భూత = భూతముల; అంతర్యామి = లోపలనుండువాడు; ఐన = అయిన; పరమపురుషుండు = పరమపురుషుడు; నిత్య = శాశ్వతుడు; పరిపూర్ణుండున్ = పరిపూర్ణుడును; కావునన్ = అగుటచేత; కాయిక = శారీరిక; వ్యాపారంబు = కృత్యము; అయుక్తంబు = తగినదికాదు; అని = అని; తత్ = ఆ; ఉద్దేశంబుగా = భావముతో; మనంబున్ = మనసు; అంద = లోనే; నమస్కార = నమస్కారము; ఆదికంబున్ = మొదలైనవి; కావింతురు = చేసెదరు; కాని = కాని; దేహా = దేహములయందు; అభిమానములు = మమకారములు; కలుగు = కలిగుండు; పురుషుల = పురుషుల; అందున్ = ఎడల; కావింపరు = చేయరు; కాన = కావున; ఏనును = నేనుకూడ; వాసుదేవ = వాసుదేవుడు అనెడి; శబ్ద = మాటచే; వాచ్యుండు = చెప్పదగినవాడు; శుద్ధ = అమలిన; సత్త్వ = సత్త్వగుణములతో; మయుండు = కూడినవాడు; అంతఃకరణంబు = మనసుల; అందున్ = లో; ఆవరణ = పొరలు; విరహితుండు = పూర్తిగ లేనివాడు; అయి = అయ్యి; ప్రకాశించు = విలసిల్లు; వాసుదేవున్ = వాసుదేవుని; కున్ = కి; నా = నా; హృదయంబునన్ = మనసులో; ఎల్లప్పుడున్ = ఎప్పుడును; నమస్కరించుచున్ = నమస్కరిస్తూ; ఉండుదు = ఉంటాను; ఇట్లు = ఈవిధముగ; అనపరాధిని = అపరాధములేనివాడను; ఐన = అయిన; నన్నున్ = నన్ను; పూర్వంబునన్ = ఇంతకుముందు; బ్రహ్మలు = బ్రాహ్మనిష్టులు; చేయు = చేసెడి; సత్రంబున్ = యాగము; అందున్ = లో; దురుక్తులున్ = చెడుమాటలు, తిట్లు; చేసి = వలన; పరాభవించి = అవమానించి; మత్ = నన్ను; ద్వేషి = ద్వేషించువాడు; ఐన = అయిన; దక్షుండు = దక్షుడు; భవత్ = నీ యొక్క; జనకుండు = తండ్రి; ఐనన్ = అయినప్పటికిని; అతడు = అతడు; తత్ = అతని; అనువర్తులు = అనుసరించి వర్తించువారు; అయిన = అయిన; వారలును = వారుకూడ; చూడన్ = దర్శించుటకు; తగరు = తగినవారుకాదు; కావునన్ = అందుచేత; మత్ = నా యొక్క; వచన = మాటలను; అతిక్రమంబునన్ = ఉల్లంఘించుట; చేసి = చేసి; అరిగితివేని = వెళితే; అచటన్ = అక్కడ; నీకున్ = నీకు; పరాభవంబున్ = అవమానములు; సంప్రాప్తంబు = కలుగుట; అగు = జరుగును; లోకంబునన్ = లోకములో; బంధుజనంబుల = బంధువులు అయిన జనముల; వలనన్ = వలన; పూజన్ = గౌరవములు; పడయక = పొందక; తిరస్కారంబున్ = వ్యతిరిక్తతను; ఒందుట = పొందుట; చచ్చుటయ = చనిపోవుటయే; కాదే = కాదా; అని = అని; పలికి = చెప్పి; మఱియున్ = మరి; అభవుండు = శివుడు; పొమ్మని = వెళ్లుటకు; అనుజ్ఞ = అనుమతి; ఇచ్చిన = ఇస్తే; అచ్చటన్ = అక్కడ; అవమానంబునన్ = అవమానములు; చేసి = వలన; అశుభంబున్ = అశుభాలు; అగున్ = అవును; అనియున్ = అని మరి; ఇచ్చటన్ = ఇక్కడ; పొమ్మనక = పోవద్దని; నివారించిన = ఆపిన; మనోవేదన = మానసికవ్యధ; అగును = అవుతుంది; అనియున్ = అని; మనంబునన్ = మనసు; అందల = లోపల; తలపోయుచు = అనుకొనుచు; ఊరకుండె = ఊరుకున్నాడు; అంత = అంతట.

భావము:
అంతే కాక ‘నీవు ఆయనను చూచి లేచి ఎదురు వెళ్ళలేదు. అందువల్ల అవమానం భరించలేక పగ పెంచుకున్నాడు’ అని నీవు అనవచ్చు. లోకంలో సామాన్యజనులు ఒకరికొకరు ఎదురు వెళ్ళి నమస్కరిస్తారు. ప్రాజ్ఞులైనవారు భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి శరీర నమస్కారం తగదని ఆయనను ఉద్దేశించి మనస్సులోనే నమస్కారం మొదలైనవి చేస్తారు. అంతేకాని, దేహాభిమానం కల పురుషులకు శరీర నమస్కారం చేయరు. అందువల్ల నేను భగవంతుడు, కేవల సత్త్వగుణ సంపన్నుడు, అంతరంగంలో నిరంతరం ఉండేవాడు అయిన వాసుదేవునకు నా హృదయంలోనే నమస్కరిస్తూ ఉంటాను. ఏ పాపమూ ఎరుగని నన్ను పూర్వం ప్రజాపతులు చేసే యజ్ఞంలో నీ తండ్రి నిందించి పరాభవించాడు. అందువల్ల దక్షుడు నాతో విరోధం కొనితెచ్చుకున్నాడు. నన్ను ద్వేషించే దక్షుడు, అతని అనుచరులు నీకు చూడదగనివారు. నా మాట కాదని వెళ్ళినట్లయితే అక్కడ నీకు అవమానం జరిగి తీరుతుంది. లోకంలో బంధువులచేత గౌరవం పొందకుండా అవమానం పొందడం మరణంతో సమానం కదా!” అని చెప్పి శంకరుడు సతీదేవిని పొమ్మని అనుజ్ఞ ఇస్తే అక్కడ అవమానం జరిగి హాని కలుగుతుందని, పోవద్దని అడ్డుపడితే సతీదేవి మనస్సుకు కష్టం కలుగుతుందని తన మనస్సులో భావించి, ఎటూ చెప్పకుండా మౌనం వహించాడు. అప్పుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=76

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :