4-76-వ.
టీకా:
భావము:
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=76
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
అదియునుం గాక, నీ వతనికిం బ్రత్యుత్థానాభివందనంబులు గావింపకుండుటం జేసి యతండు తిరస్కృతుండయ్యె నంటివేని లోకంబున జను లన్యోన్యంబును బ్రత్యుత్థానాభివందనంబులు గావింతు; రదియ ప్రాజ్ఞ లయినవారు సర్వభూతాంతర్యామి యైన పరమపురుషుండు నిత్యపరిపూర్ణుండు గావునఁ గాయికవ్యాపారం బయుక్తం బని తదుద్దేశంబుగా మనంబునంద నమస్కారాదికంబులు గావింతురు; గాని దేహాభిమానంబులు గలుగు పురుషులందుఁ గావింపరు; కాన యేనును వాసుదేవ శబ్దవాచ్యుండు శుద్ధసత్త్వమయుండు నంతఃకరణంబు నందు నావరణ విరహింతుడు నయి ప్రకాశించు వాసుదేవునకు నా హృదయంబున నెల్లప్పుడు నమస్కరించుచుండుదు; ఇట్ల నపరాధినైన నన్నుఁ బూర్వంబున బ్రహ్మలు చేయు సత్రంబు నందు దురుక్తులం జేసి పరాభవించి మద్ద్వేషి యైన దక్షుండు భవజ్జనకుం డైన నతఁడును దదనువర్తు లయిన వారలును జూడఁ దగరు; కావున మద్వచనాతిక్రమంబునం జేసి యరిగితివేని నచట నీకుఁ బరాభవంబు సంప్రాప్తం బగు; లోకంబున బంధుజనంబులవలనఁ బూజ బడయక తిరస్కారంబు వొందుట చచ్చుటయ కాదే;” యని పలికి మఱియు నభవుండు, పొమ్మని యనుజ్ఞ యిచ్చిన నచ్చట నవమానంబునం జేసి యశుభం బగు ననియు; నిచ్చటఁ బొమ్మనక నివారించిన మనోవేదన యగు ననియు మనంబునం దలపోయుచు నూరకుండె; అంత.
టీకా:
అదియున్ = అంతే; కాక = కాకుండగ; నీవు = నీవు; అతనికిన్ = అతనికి; ప్రత్యుత్థాన = లేచి ఎదుర్కనుట; అభివందనంబులున్ = నమస్కారములు; కావింపకుండుటన్ = చేయకపోవుట; చేసి = వలన; అతండు = అతడు; తిరస్కృతుండు = వ్యతిరేకభావమందినవాడు; అయ్యెన్ = ఆయెను; అంటివేని = అన్నట్లయితే; లోకంబునన్ = లోకములో; జనులు = ప్రజలు; అన్యోన్యంబును = ఒకరికొకరు; ప్రత్యుత్థాన = లేచి ఎదుర్కనుట; అభివందనంబులున్ = నమస్కారములు; కావింతురు = చేయుదురు; అదియ = అదే; ప్రాజ్ఞలు = ప్రజ్ఞకలవారు; అయినవారు = అయినవారు; సర్వ = అన్ని; భూత = భూతముల; అంతర్యామి = లోపలనుండువాడు; ఐన = అయిన; పరమపురుషుండు = పరమపురుషుడు; నిత్య = శాశ్వతుడు; పరిపూర్ణుండున్ = పరిపూర్ణుడును; కావునన్ = అగుటచేత; కాయిక = శారీరిక; వ్యాపారంబు = కృత్యము; అయుక్తంబు = తగినదికాదు; అని = అని; తత్ = ఆ; ఉద్దేశంబుగా = భావముతో; మనంబున్ = మనసు; అంద = లోనే; నమస్కార = నమస్కారము; ఆదికంబున్ = మొదలైనవి; కావింతురు = చేసెదరు; కాని = కాని; దేహా = దేహములయందు; అభిమానములు = మమకారములు; కలుగు = కలిగుండు; పురుషుల = పురుషుల; అందున్ = ఎడల; కావింపరు = చేయరు; కాన = కావున; ఏనును = నేనుకూడ; వాసుదేవ = వాసుదేవుడు అనెడి; శబ్ద = మాటచే; వాచ్యుండు = చెప్పదగినవాడు; శుద్ధ = అమలిన; సత్త్వ = సత్త్వగుణములతో; మయుండు = కూడినవాడు; అంతఃకరణంబు = మనసుల; అందున్ = లో; ఆవరణ = పొరలు; విరహితుండు = పూర్తిగ లేనివాడు; అయి = అయ్యి; ప్రకాశించు = విలసిల్లు; వాసుదేవున్ = వాసుదేవుని; కున్ = కి; నా = నా; హృదయంబునన్ = మనసులో; ఎల్లప్పుడున్ = ఎప్పుడును; నమస్కరించుచున్ = నమస్కరిస్తూ; ఉండుదు = ఉంటాను; ఇట్లు = ఈవిధముగ; అనపరాధిని = అపరాధములేనివాడను; ఐన = అయిన; నన్నున్ = నన్ను; పూర్వంబునన్ = ఇంతకుముందు; బ్రహ్మలు = బ్రాహ్మనిష్టులు; చేయు = చేసెడి; సత్రంబున్ = యాగము; అందున్ = లో; దురుక్తులున్ = చెడుమాటలు, తిట్లు; చేసి = వలన; పరాభవించి = అవమానించి; మత్ = నన్ను; ద్వేషి = ద్వేషించువాడు; ఐన = అయిన; దక్షుండు = దక్షుడు; భవత్ = నీ యొక్క; జనకుండు = తండ్రి; ఐనన్ = అయినప్పటికిని; అతడు = అతడు; తత్ = అతని; అనువర్తులు = అనుసరించి వర్తించువారు; అయిన = అయిన; వారలును = వారుకూడ; చూడన్ = దర్శించుటకు; తగరు = తగినవారుకాదు; కావునన్ = అందుచేత; మత్ = నా యొక్క; వచన = మాటలను; అతిక్రమంబునన్ = ఉల్లంఘించుట; చేసి = చేసి; అరిగితివేని = వెళితే; అచటన్ = అక్కడ; నీకున్ = నీకు; పరాభవంబున్ = అవమానములు; సంప్రాప్తంబు = కలుగుట; అగు = జరుగును; లోకంబునన్ = లోకములో; బంధుజనంబుల = బంధువులు అయిన జనముల; వలనన్ = వలన; పూజన్ = గౌరవములు; పడయక = పొందక; తిరస్కారంబున్ = వ్యతిరిక్తతను; ఒందుట = పొందుట; చచ్చుటయ = చనిపోవుటయే; కాదే = కాదా; అని = అని; పలికి = చెప్పి; మఱియున్ = మరి; అభవుండు = శివుడు; పొమ్మని = వెళ్లుటకు; అనుజ్ఞ = అనుమతి; ఇచ్చిన = ఇస్తే; అచ్చటన్ = అక్కడ; అవమానంబునన్ = అవమానములు; చేసి = వలన; అశుభంబున్ = అశుభాలు; అగున్ = అవును; అనియున్ = అని మరి; ఇచ్చటన్ = ఇక్కడ; పొమ్మనక = పోవద్దని; నివారించిన = ఆపిన; మనోవేదన = మానసికవ్యధ; అగును = అవుతుంది; అనియున్ = అని; మనంబునన్ = మనసు; అందల = లోపల; తలపోయుచు = అనుకొనుచు; ఊరకుండె = ఊరుకున్నాడు; అంత = అంతట.
అంతే కాక ‘నీవు ఆయనను చూచి లేచి ఎదురు వెళ్ళలేదు. అందువల్ల అవమానం భరించలేక పగ పెంచుకున్నాడు’ అని నీవు అనవచ్చు. లోకంలో సామాన్యజనులు ఒకరికొకరు ఎదురు వెళ్ళి నమస్కరిస్తారు. ప్రాజ్ఞులైనవారు భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి శరీర నమస్కారం తగదని ఆయనను ఉద్దేశించి మనస్సులోనే నమస్కారం మొదలైనవి చేస్తారు. అంతేకాని, దేహాభిమానం కల పురుషులకు శరీర నమస్కారం చేయరు. అందువల్ల నేను భగవంతుడు, కేవల సత్త్వగుణ సంపన్నుడు, అంతరంగంలో నిరంతరం ఉండేవాడు అయిన వాసుదేవునకు నా హృదయంలోనే నమస్కరిస్తూ ఉంటాను. ఏ పాపమూ ఎరుగని నన్ను పూర్వం ప్రజాపతులు చేసే యజ్ఞంలో నీ తండ్రి నిందించి పరాభవించాడు. అందువల్ల దక్షుడు నాతో విరోధం కొనితెచ్చుకున్నాడు. నన్ను ద్వేషించే దక్షుడు, అతని అనుచరులు నీకు చూడదగనివారు. నా మాట కాదని వెళ్ళినట్లయితే అక్కడ నీకు అవమానం జరిగి తీరుతుంది. లోకంలో బంధువులచేత గౌరవం పొందకుండా అవమానం పొందడం మరణంతో సమానం కదా!” అని చెప్పి శంకరుడు సతీదేవిని పొమ్మని అనుజ్ఞ ఇస్తే అక్కడ అవమానం జరిగి హాని కలుగుతుందని, పోవద్దని అడ్డుపడితే సతీదేవి మనస్సుకు కష్టం కలుగుతుందని తన మనస్సులో భావించి, ఎటూ చెప్పకుండా మౌనం వహించాడు. అప్పుడు...
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=76
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment