4-77-సీ.
సతి సుహృద్దర్శనేచ్ఛా ప్రతికూల దుః;
ఖస్వాంత యగుచు నంగములు వడఁక
నందంద తొరఁగెడు నశ్రుపూరంబులు;
గండభాగంబులఁ గడలుకొనఁగ
నున్నత స్తనమండలోపరిహారముల్;
వేఁడి నిట్టూర్పుల వెచ్చఁ గంద
నతిశోకరో షాకులాత్యంత దోదూయ;
మానమై హృదయంబు మలఁగుచుండ
4-77.1-తే.
మఱియుఁ గుపితాత్మయై స్వసమానరహితు
నాత్మదేహంబు సగ మిచ్చి నట్టి భవుని
విడిచి మూఢాత్మ యగుచు న వ్వెలఁది జనియె
జనకుఁ జూచెడు వేడుక సందడింప.
భావము:
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=77
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
సతి సుహృద్దర్శనేచ్ఛా ప్రతికూల దుః;
ఖస్వాంత యగుచు నంగములు వడఁక
నందంద తొరఁగెడు నశ్రుపూరంబులు;
గండభాగంబులఁ గడలుకొనఁగ
నున్నత స్తనమండలోపరిహారముల్;
వేఁడి నిట్టూర్పుల వెచ్చఁ గంద
నతిశోకరో షాకులాత్యంత దోదూయ;
మానమై హృదయంబు మలఁగుచుండ
మఱియుఁ గుపితాత్మయై స్వసమానరహితు
నాత్మదేహంబు సగ మిచ్చి నట్టి భవుని
విడిచి మూఢాత్మ యగుచు న వ్వెలఁది జనియె
జనకుఁ జూచెడు వేడుక సందడింప.
టీకా:
సతి = సతీదేవి; సుహృత్ = బంధువులను; దర్శన = చూసే; ఇచ్చా = కోరికకు; ప్రతికూల = వ్యతిరేకమువలని; దుఃఖ = దుఃఖముకల; స్వంత = మనసుకలిగినది; అగుచున్ = అవుతూ; అంగములు = అవయవములు; వడకన్ = వణుకుతుండగ; అందంద = అక్కడక్కడ; తొరగెడు = జారెడు; అశ్రుపూరంబులు = కన్నీటిజాళ్ళు; గండభాగంబులన్ = చెక్కిళ్ళపై; కడలుకొనగ = వ్యాపిస్తుండగ; ఉన్నత = ఎత్తైన; స్తన = కుచ; మండల = ప్రాంతము; ఉపరి = పైనున్న; హారముల్ = హారములు; వేడి = వెచ్చటి; నిడు = దీర్ఘమైన; ఊర్పులన్ = ఊపిరులవలన; వెచ్చన్ = వేడిని; అందన్ = చెందగ; అతి = మిక్కిలి; శోక = శోకము; రోషా = రోషములతో; ఆకుల = చీకాకుచేత; అత్యంత = అతిమిక్కిలి; దోదూయమానము = చలించిపోయినది; ఐ = అయ్యి; హృదయంబున్ = మనసు; మలగుచున్ = బాధపడుతుండగ. మఱియున్ = ఇంకను; కుపిత = కోపముచెందిన; ఆత్మ = మనలుకలది; ఐ = అయ్యి; స్వ = తనకు; సమాన = సమానమైనవారు; రహితున్ = లేనివాని; ఆత్మ = తన; దేహంబున్ = దేహమును; సగము = అర్థము; ఇచ్చిన = ఇచ్చిన; అట్టి = అటువంటి; భవుని = శివుని; విడిచి = వదలి; మూఢాత్మ = తెలివిహీన; అగుచున్ = అవుతూ; ఆ = ఆ; వెలది = స్తీ; చనియెన్ = వెళ్ళెను; జనకున్ = తండ్రి; చూచెడు = చూసే; వేడుక = కుతూహలము; సందడింపన్ = తొందరపెట్టగ.
భావము:
తన బంధువులను చూడాలనే కుతూహలం సఫలం కాకపోవడం వల్ల సతీదేవి మనస్సులో దుఃఖం పొంగి పొరలింది. అవయవాలు కంపించాయి. కన్నీళ్ళు చెక్కిళ్ళపై జాలువారాయి. వక్షస్థలం మీది హారాలు నిట్టూర్పుల వేడికి కందిపోయాయి. శోకంతో కోపాతిరేకంతో సతీదేవి మనస్సు చలించి కలత చెందింది. ఆ కోపంలో ఆమె వివేకం కోల్పోయింది. తనతో సరిసమానుడు లేని స్వామిని, తన శరీరంలో సగమిచ్చిన తన స్వామిని, పరమేశ్వరుణ్ణి విడిచిపెట్టి తండ్రిని చూడాలనే కుతూహలం అతిశయించగా ఒంటరిగా పుట్టింటికి బయలుదేరింది.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=77
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment