Wednesday, May 11, 2016

శ్రీ గురుభ్యోనమః


నిన్న 10వ తారీఖున శ్రీశ్రీశ్రీ రామానుజాచార్యుల వారి జయంతి.
ఈ రోజు శ్రీశ్రీశ్రీ శంకరాచార్యులవారి జయంతి.
ఈ శుభ సందర్భంలో భగవానుని కృప మన భాగవతప్రియులు అందరికి వారి కుటుంబ పరివారాలకు అపారంగా అందించమని మా నల్లనయ్యను వేడుకుంటున్నాను
ఆచార్య త్రయంలో ప్రథములు శ్రీశ్రీశ్రీ మధ్వాచార్యులు వారు, శైవానికి గురు సంప్రదాయోద్దరణకు ఆద్య గురువు.
తరువాతి కాలం వారు శ్రీశ్రీశ్రీ రామానుజాచార్యులు వారు వైష్ణవానికి ఆధారభూతుడు. అమృతుల్యం వారి ప్రసాదం మధురాష్టకం.
తరువాతి కాలం వారు శ్రీశ్రీశ్రీ శంకరాచార్యులవారు విశిష్టాధ్వైతకర్తలు హైందవంలో ఏది తలచినా వారి ముద్ర తప్పక ఉండే మహానుభావులు నహి నహి రక్షతి అంటూనే తిరుగులేని అపర గురువుగా మార్గం చూపిన పరమ గురువు
ఈ ఆచార్య త్రయం సాక్షాత్తు భగవత్ స్వరూపాలే. వారికి సాష్గాంగ నమస్కారములు
గురువరేణ్యులారా మా భాగవత ప్రియులకు సజ్ఞానం అనుగ్రహించండి.

క్షీరసాగరమథనం - ప్రార్థన

8-1-క.
శ్రీమన్నామ! పయోద
శ్యామ! ధరాభృల్లలామ! జగదభిరామా! 
రామాజనకామ! మహో
ద్ధామ! గుణస్తోమధామ! దశరథరామా!
టీకా:
శ్రీమన్నామ = శ్రీరామ {శ్రీమన్నాముడు - శ్రీమత్ (మంగళవంతమైన) నామ (పేరుగలవాడు), రాముడు}; పయోదశ్యామ = శ్రీరామ {పయోదశ్యాముడు - పయోద (మేఘము వంటి) శ్యామ (నల్లనివాడు), రాముడు}; ధరాభృల్లలామ = శ్రీరామ {ధరాభృల్లలాముడు - ధరాభృత్ (రాజులలో) లలాముడు (శ్రేష్ఠమైనవాడు), రాముడు}; జగదభిరామ = శ్రీరామ {జగదభిరాముడు - జగత్ (లోకములకు) రాముడు (అందమైనవాడు), రాముడు}; రామాజనకామ = శ్రీరామ {రామాజనకాముడు - రామా (రమించునట్టివారైన, స్త్రీ) జన (జనులకు) కాముడు (మన్మథునివంటివాడు), రాముడు}; మహోద్ధామ = శ్రీరామ {మహోద్ధాముడు - మహా (గొప్ప) ఉద్ధాముడు (ఉద్ధరించెడివాడు), రాముడు}; గుణస్తోమధామ = శ్రీరామ {గుణస్తోమధాముడు - గుణస్తోమ (సుగుణములకు) ధాముడు (నెలవైనవాడు), రాముడు}; దశరథరామా = శ్రీరామ {దశరథరాముడు - దశరథుని యొక్క కుమారుడైన రాముడు (ఆనందింపజేయువాడు), రాముడు}.
భావము:
మంగళకర మైన పేరు కలవాడా! మేఘం వంటి కాంతివంత మైన దేహం కలవాడా! రాజులలో బహు గొప్పవాడా! ఆఖిల లోకాలలో అందమైన వాడా! స్త్రీలకు మన్మథుని వంటి వాడా! బహు గంభీరమైన వాడా! సుగుణాలనే సంపదలకు నిలయమైన వాడా! దశరథకుమారు డైన శ్రీరామచంద్రా! అవధరించు!
8-1-ka.
shreemannaama! payoda
shyaama! dharaabhRillalaama! jagadabhiraamaa!
raamaajanakaama! maho
ddhaama! guNastomadhaama! dasharatharaamaa!

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Monday, May 9, 2016

జలజాతప్రభవాదులున్


7-386-మ.

జలజాతప్రభవాదులున్ మనములోఁ జర్చించి భాషావళిం
బలుకన్ లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ యింటిలోఁ
జెలి యై మేనమఱంది యై సచివుఁడై చిత్తప్రియుండై మహా
ఫలసంధాయకుఁడై చరించు టది నీ భాగ్యంబు రాజోత్తమా! 

టీకా:

జలజాతప్రభవ = బ్రహ్మదేవుడు {జలజాతప్రభవుడు - జలజాత (పద్మమున) ప్రభవుడు (ఉద్భవించినవాడు), బ్రహ్మ}; ఆదులున్ = మొదలగువారుకూడ; మనము = మనసుల; లోన్ = లోపల; చర్చించి = తరచిచూసుకొని; భాషావళిన్ = వాక్కులచేత; పలుకన్ = పలుకుటకు; లేని = వశముకాని; జనార్దన = విష్ణుమూర్తి {జనార్ధనుడు - సముద్రమధ్యముననున జనులను రాక్షసులను పీడించినవాడు, విష్ణువు}; ఆహ్వయ = పేరుగల; పరబ్రహ్మంబు = పరమాత్మ; నీ = నీ యొక్క; ఇంటి = నివాసము; లోన్ = అందు; చెలి = మిత్రుడు; ఐ = అయ్యి; మేనమఱంది = మేనత్తకొడుకు; ఐ = అయ్యి; సచివుడు = మంత్రాంగముచెప్పువాడు; ఐ = అయ్యి; చిత్త = మనసునకు; ప్రియుండు = ఇష్టుడు; ఐ = అయ్యి; మహా = గొప్ప; ఫల = ఫలితములను; సంధాయకుండు = కూర్చువాడు; ఐ = అయ్యి; చరించుట = మెలగుట; అది = అది; నీ = నీ యొక్క; భాగ్యంబు = అదృష్టము; రాజోత్తమ = రాజులలో ఉత్తముడ. 

భావము:

రాజోత్తమా! ధర్మరాజా! బ్రహ్మాదులు సైతం ఆలోచించి, పరిశోధించి మాటలలో చెప్పలేనటువంటి పరబ్రహ్మ స్వరూపుడు శ్రీకృష్ణుడు. అంతటివాడు మీకు మిత్రుడుగా, బావమరిదిగా, మంత్రిగా, ఆత్మప్రియుడుగా, మహా ఫల ప్రదాతగా నీ ఇంటిలో విహారం చేయటం నీ మహాభాగ్యం.” అని ధర్మరాజునకు నారద మునీంద్రుడు ప్రహ్లాద చరిత్ర వివరించాడు.

Sunday, May 8, 2016

శ్రీ రమణీయమైన

7-385-ఉ.
శ్రీ రమణీయమైన నరసింహ విహారము నింద్రశత్రు సం
హారముఁ బుణ్య భాగవతుఁడైన నిశాచరనాథపుత్ర సం
చారము నెవ్వఁడైన సువిచారత విన్నఁ బఠించినన్ శుభా
కారముతోడ నే భయముఁ గల్గని లోకముఁ జెందు భూవరా! 

టీకా:

శ్రీ = శోభకరము; రమణీయము = మనోజ్ఞము; ఐన = అయిన; నరసింహ = నరసింహుని; విహారమున్ = క్రీడ; ఇంద్రశత్రు = హిరణ్యాక్షుని; సంహారమున్ = చంపుట; పుణ్య = పావన; భాగవతుడు = భాగవతుడు; ఐన = అయిన; నిశాచరనాథపుత్ర = ప్రహ్లాదుని {నిశాచరనాథపుత్రుడు - నిశాచర రాజు (రాక్షస రాజు యైన హిరణ్యకశిపుని) పుత్రుడు, ప్రహ్లాదుడు}; సంచారమున్ = నడవడికను; ఎవ్వడు = ఎవరు; ఐనన్ = అయినను; సు = చక్కటి; విచారతన్ = విమర్శతో; విన్నన్ = వినినను; పఠించినన్ = చదివినను; శుభ = మంగళ; ఆకారము = విగ్రహము; తోడన్ = తోటి; ఏ = ఎట్టి; భయమున్ = భయము; కల్గని = కలగనట్టి; లోకమున్ = లోకమును; చెందున్ = చేరును; భూవర = రాజా. 

భావము:

“మహారాజా! ధర్మజ! శుభకరమైన శ్రీ నరసింహ అవతారం; విహారం; హిరణ్యకశిపుని సంహారం; పుణ్యమూర్తి ప్రహ్లాదుని సంచారం; మంచి మనస్సుతో వినిన, చదివిన మానవుడు ఏ భయమూ కలుగని పుణ్యలోకానికి చేరుకుంటాడు.

Saturday, May 7, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట

7-384-వ
అని యిట్లానతిచ్చి బ్రహ్మాదిదేవతాసమూహంబుచేఁ బూజితుఁడై భగవంతుండైన శ్రీనృసింహదేవుండు తిరోహితుండయ్యె; ప్రహ్లాదుండును శూలికిఁ బ్రణమిల్లి తమ్మిచూలికి వందనంబులు జేసి బ్రజాపతులకు మ్రొక్కి భగవత్కళలైన దేవతలకు నమస్కరించినం జూచి బ్రహ్మదేవుండు శుక్రాది మునీంద్ర సహితుండై దైత్యదానవరాజ్యంబునకుం బ్రహ్లాదుం బట్టంబు గట్టి యతనిచేతం బూజితుండై దీవించె; నంత నీశానాది నిఖిల దేవతలు వివిధంబులగు నాశీర్వాదంబులచేత నా ప్రహ్లాదునిఁ గృతార్థుం జేసి తమ్మిచూలిని ముందట నిడుకొని నిజస్థానంబునకుఁ జనిరి; ఇట్లు విష్ణుదేవుండు నిజపార్శ్వచరు లిరువురు బ్రాహ్మణశాపంబునం జేసి బ్రథమ జన్మంబున దితిపుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపు లను వరాహ నారసింహ రూపంబుల నవతరించి వధియించె; ద్వితీయ భవంబున రాక్షస జన్మంబు దాల్చిన రావణ కుంభకర్ణులను శ్రీరామ రూపంబున సంహరించె; తృతీయ జన్మంబున శిశుపాల దంతవక్త్రులను పేరులం బ్రసిద్ధి నొందిన వారలను శ్రీకృష్ణ రూపంబున ఖండించె; నివ్విధంబున మూఁడు జన్మంబుల గాఢ వైరానుబంధంబున నిరంత రసంభావిత ధ్యానులై వారలు నిఖిల కల్మష విముక్తు లై హరిం గదిసి" రని చెప్పి నారదుం డిట్లనియె.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; ఆనతిచ్చి = చెప్పి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలైన; దేవ = దేవతల; సమూహంబు = సమూహముల; చేన్ = చేత; పూజితుండు = పూజింపబడినవాడు; ఐ = అయ్యి; భగవంతుండు = షడ్గుణైశ్వర్యసంపన్నుడు {భగవంతునిగుణషట్కములు - 1ఐశ్వర్యము 2వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యములు}; ఐన = అయిన; శ్రీ = శ్రీ; నరసింహ = నరసింహరూప; దేవుండు = దేవుడు; తిరోహితుండు = అదృశ్యుడు, అంతర్ధానుడు; అయ్యెన్ = అయ్యెను; ప్రహ్లాదుండును = ప్రహ్లాదుడుకూడ; శూలి = పరమశివుని {శూలి - శూలాయుధము ధరించువాడు, శివుడు}; కిన్ = కి; ప్రణమిల్లి = నమస్కరించి; తమ్మిచూలి = బ్రహ్మదేవున {తమ్మిచూలి - తమ్మి (పద్మమున) చూలి (పుట్టినవాడు), బ్రహ్మ}; కిన్ = కు; వందనంబులు = నమస్కారములు; చేసి = చేసి; ప్రజాపతుల్ = ప్రజాపతుల; కున్ = కు; మ్రొక్కి = నమస్కరించి; భగవత్ = భగవంతుని; కళలు = అంశజులు; ఐన = అయిన; దేవతల్ = దేవతల; కున్ = కు; నమస్కరించినన్ = నమస్కరించగా; చూచి = చూసి; బ్రహ్మదేవుండు = బ్రహ్మదేవుడు; శుక్ర = శుక్రుడు; ఆది = మొదలైన; ముని = మునులలో; ఇంద్ర = ఉత్తములతో; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; దైత్య = దితివంశజుల; దానవ = దనుజుల; రాజ్యంబున్ = రాజ్యమున; కున్ = కు; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; పట్టంబుగట్టి = పట్టాభిషిక్తునిజేసి; అతని = అతని; చేతన్ = చేత; పూజితుండు = పూజింపబడినవాడు; ఐ = అయ్యి; దీవించెన్ = ఆశీర్వదించెను; అంతన్ = అంతట; ఈశాన = ఈశానుడు; ఆది = మొదలైన; నిఖిల = ఎల్ల; దేవతలున్ = దేవతలును; వివిధంబులు = పలువిధములైన; ఆశీర్వాదంబుల = ఆశీర్వచనముల; చేతన్ = చేత; ఆ = ఆ; ప్రహ్లాదునిన్ = ప్రహ్లాదుని; కృతార్థున్ = సార్థకున్; చేసి = చేసి; తమ్మిచూలిని = బ్రహ్మదేవుని; ముందటన్ = ముందుభాగమున; ఇడుకొని = ఉంచుకొని; నిజస్థానంబున్ = స్వస్థానముల; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; ఇట్లు = ఈ విధముగ; విష్ణుదేవుండు = విష్ణుమూర్తి; నిజ = తన; పార్శ్వచరులు = పక్కనమెలగువారు; ఇరువురు = ఇద్దరు (2); బ్రాహ్మణ = బ్రాహ్మణులైన సనకాదుల; శాపంబునన్ = శాపము; చేసి = వలని; ప్రథమ = మొదటి; జన్మంబునన్ = జన్మలో; దితి = దితియొక్క; పుత్రులు = కుమారులు; ఐన = అయిన; హిరణ్యాక్ష = హిరణ్యాక్షుడు; హిరణ్యకశిపులన్ = హిరణ్యకశిపులను; వరాహ = వరాహ; నారసింహ = నరసింహ; రూపంబులన్ = స్వరూపములలో; అవతరించి = అవతరించి; వధియించెన్ = సంహరించెను; ద్వితీయ = రెండవ (2); భవంబునన్ = జన్మములో; రాక్షస = రాక్షసకులమున; జన్మంబున్ = జన్మము; తాల్చిన = ధరించిన; రావణ = రావణుడు; కుంభకర్ణులను = కుంభకర్ణులను; శ్రీరామ = శ్రీరామ; రూపంబునన్ = స్వరూపముతో; సంహరించెన్ = చంపెను; తృతీయ = మూడవ (3); జన్మంబునన్ = జన్మలో; శిశుపాల = శిశుపాలుడు; దంతవక్త్రులు = దంతవక్త్రులు; అను = అనెడి; పేరులన్ = పేరులతో; ప్రసిద్ది = పేరుపొందిన; వారలను = వారిని; శ్రీకృష్ణ = శ్రీకృష్ణ; రూపంబునన్ = స్వరూపముతో; ఖండించెన్ = చంపెను; ఈ = ఈ; విధంబునన్ = లాగున; మూడు = మూడు (3); జన్మంబులన్ = జన్మలలో; గాఢ = తీవ్రమైన; వైర = విరోధ; అనుబంధంబునన్ = సంబంధమువలన; నిరంతర = ఎడతెగకుండెడి; సంభావిత = అలవడిన; ధ్యానులు = ధ్యానముగలవారు; ఐ = అయ్యి; వారలు = వారు; నిఖిల = సమస్తమైన; కల్మష = పాపములనుండి; విముక్తులు = విడివడినవారు; ఐ = అయ్యి; హరిన్ = విష్ణుమూర్తిని; కదిసిరి = చేరిరి; అని = అని; చెప్పి = చెప్పి; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈలాగున; అనియె = పలికెను. 

భావము:

నృసింహస్వామి బ్రహ్మదేవునికి ఇలా తెలియజెప్పి, బ్రహ్మాది దేవతల పూజలను స్వీకరించి, అంతర్ధానం అయ్యాడు. ప్రహ్లాదుడు పరమేశ్వరునికి ప్రణామాలు ఆచరించాడు. విధాతకు వందనం చేశాడు. ప్రజాపతులకు ప్రణతులు చేశాడు. భగవదంశతో ప్రకాశించే దేవతలకు నమస్కారాలు చేశాడు. అంతట చతుర్ముఖ బ్రహ్మ, శుక్రుడు మొదలైన మునీంద్రులతో కలిసి ప్రహ్లాదుడిని దైత్య, దానవ రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేసి రాజ్యం అప్పజెప్పి, ఆశీర్వదించాడు. ప్రహ్లాదుడు దేవతలను అందరిని అర్హమైన విధంగా పూజించాడు. ఈశానుడు మొదలగు సమస్త దేవతలు ప్రహ్లాదుడిని నానావిధ ఆశీస్సులతో ధన్యుడిని చేశారు. బ్రహ్మదేవుడితో సహా దేవతలు అందరూ తమతమ స్థానాలకు బయలుదేరి వెళ్ళారు.
ఇలా సనకాది విప్రోత్తముల శాపానికి గురైన ద్వారపాలకులు, జయ విజయులు ప్రథమ జన్మలో దితి కడుపున హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా పుట్టారు. విష్ణుమూర్తి వరాహా, నారసింహ అవతారాలు ఎత్తి పరిమార్చాడు. ద్వితీయజన్మలో రావణ, కుంభకర్ణులుగా పుట్టారు. శ్రీరామునిగా అవతరించి అంతం చేశాడు. తృతీయజన్మగా శిశుపాల. దంతవక్త్రులుగా జన్మించారు. శ్రీకృష్ణుడై వారిని పరిమార్చాడు. ఇలా మూడు జన్మలలో గాఢమైన వైరభావంతో నిరంతం హరి స్మరణ చేస్తూ వీళ్ళు శాప విముక్తులు అయ్యారు. చివరకు స్వస్థానం అయిన వైకుంఠ ద్వారపాలకులు చేరారు.” అని నారద మహర్షి, మహారాజైన ధర్మరాజునకు వివరించి ఫలశ్రుతిగా ఇలా పలికాడు.bb
telugubhagavatam.org

Friday, May 6, 2016

ఘన సూక్ష్మ భూ

7-379-సీ.
ఘన సూక్ష్మ భూత సంఘాతంబు లోపల;
నెల్ల వాంఛలు మాని యెవ్వ రయిన
నీ చందమున నన్ను నెఱయ సేవించిన;
మద్భక్తు లగుదురు మత్పరులకు
గుఱిజేయ నీవ యోగ్యుఁడ వైతి విటమీఁద;
వేదచోదిత మైన విధముతోడఁ
జిత్తంబు నా మీఁదఁ జేర్చి మీ తండ్రికిఁ;
బ్రేతకర్మములు సంప్రీతిఁ జేయు
7-379.1-తే.
మతఁడు రణమున నేఁడు నా యంగమర్శ
నమున నిర్మల దేహుఁడై నవ్యమహిమ
నపగతాఖిల కల్మషుఁ డైఁ తనర్చి
పుణ్యలోకంబులకు నేఁగుఁ బుణ్యచరిత!
టీకా:
ఘన = మిక్కలి పెద్దవానినుండి; సూక్ష్మ = మిక్కిలి చిన్నవానివరకు; భూత = జీవుల; సంఘాతంబు = సమూహము; లోపల = లోను; ఎల్ల = సమస్తమైన; వాంఛలున్ = కోరికలను; మాని = వదలివేసి; ఎవ్వరైనన్ = ఎవరైనసరే; నీ = నీ; చందమునన్ = విధముగ; నన్నున్ = నన్ను; నెఱయన్ = నిండుగా; సేవించినన్ = కొలచినచో; మత్ = నా యొక్క; భక్తులు = భక్తులు; అగుదురు = అయ్యెదరు; మత్ = నాకు; పరుల్ = చెందినవారి; కున్ = కి; గుఱి = దృష్టాంతముగ; చేయన్ = చూపుటకు; నీవ = నీవే; యోగ్యుడవు = తగినవాడవు; ఐతివి = అయినావు; ఇటమీద = ఇప్పటినుండి; వేద = వేదములచే; చోదితము = నిర్ణయింపబడినవి; ఐన = అయిన; విధము = పద్ధతి; తోడన్ = తోటి; చిత్తంబున్ = మనసును; నా = నా; మీదన్ = ఎడల; చేర్చి = లగ్నముచేసి; మీ = మీ యొక్క; తండ్రి = తండ్రి; కిన్ = కి; ప్రేత = అపర, (పరలోకయాత్రకైన); కర్మములు = కర్మలు; సంప్రీతిన్ = ఇష్టపూర్తిగా; చేయుము = చేయుము; అతడు = అతడు. >br?> రణంబునన్ = యుద్ధమున; నేడు = ఈ దినమున; నా = నా యొక్క; అంగ = శరీర; మర్శనమునన్ = స్పర్శచేత; నిర్మల = పావనమైన; దేహుడు = దేహముహలవాడు; ఐ = అయ్యి; నవ్య = నూతనమైన; మహిమన్ = వైభవముతో; అపగత = పోగొట్టబడిన; అఖిల = సమస్తమైన; కల్మషుడు = పాపములుగలవాడు; ఐ = అయ్యి; తనర్చి = ఒప్పి; పుణ్యలోకంబుల్ = పుణ్యలోకముల; కున్ = కు; ఏగున్ = వెళ్ళును; పుణ్యచరిత = పావనమైననడవడికగలవాడ.
భావము:
పావన మూర్తీ! ప్రహ్లాదా! నీలాగే ఎవరైనా సరే చిన్నవారైనా, పెద్దవారైనా, ఎల్లవాంఛలూ మాని నన్ను ఉపాసిస్తారో, వాళ్ళు నా భక్తులు, నా భక్తులలో నువ్వు ఉత్తముడవు. ఇంక నీవు నీ మనస్సు నా మీద నిలిపి సంతోషంగా వేదోక్తవిధిగా నీ తండ్రికి ఉత్తర క్రియలు చెయ్యి. అతడు నా శరీరస్పర్శతో నిర్మల దేహం పొందాడు. కల్మషాలు కడిగేసుకుని పుణ్యలోకాలకు పయనిస్తాడు.”I'm 

Thursday, May 5, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట





7-3- వ. అనిన భక్తునికి భక్తవత్సలుం డిట్లనయె.

టీకా:

అనినన్ = అనగా; భక్తుని = భక్తుని; కిన్ = కి; భక్తవత్సలుండు = నరసింహుడు {భక్తవత్సలుడు - భక్తుల యెడ వాత్సల్యముగలవాడు, విష్ణువు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను. 

భావము:

ఇలా భక్తాగ్రేస్వరుడైన ప్రహ్లాదుడు పలుకగా, భక్తుల ఎడ వాత్సల్యము చూపే వాడైన నరసింహావతారుడు.
7-378-మ.
నిజభక్తుండవు నాకు నిన్నుఁ గనుటన్ నీ తండ్రి త్రిస్సప్త పూ
ర్వజులం గూడి పవిత్రుఁడై శుభగతిన్ వర్తించు విజ్ఞాన దీ
ప జితానేక భవాంధకారు లగు మద్భక్తుల్ వినోదించు దే
శ జనుల్ దుర్జనులైన శుద్దులు సుమీ సత్యంబు దైత్యోత్తమా! 

టీకా:

నిజ = నా యొక్త; భక్తుండవు = భక్తుడవు; నా = నా; కున్ = కు; నిన్నున్ = నిన్ను; కనుటన్ = జన్మనిచ్చుటచేత; నీ = నీ యొక్క; తండ్రి = తండ్రి; త్రిస్సప్త = ఇరవైయొక్క (21); పూర్వజులన్ = ముందురతమువారితో; కూడి = కలిసి; పవిత్రుడు = పరిశుద్ధుడు; ఐ = అయ్యి; శుభ = శ్రేయో; గతిన్ = మార్గమున; వర్తించున్ = నడచును; విజ్ఞాన = సుజ్ఞానము యనెడి; దీప = దీపముచే; జిత = తరించిన; భవ = సంసారము యనెడి; అంధకారులు = చీకటి(అజ్ఞానము)గలవారు; అగు = అయిన; మత్ = నా యొక్క; భక్తుల్ = భక్తులు; వినోదించు = క్రీడించెడి; దేశ = ప్రదేశమునందు; జనుల్ = వసించెడివారు; దుర్జనులు = చెడ్డవారు; ఐనన్ = అయినను; శుద్ధులు = పవిత్రులే; సుమీ = సుమా; సత్యంబున్ = నిజముగ; దైత్య = రాక్షసులలో; ఉత్తమ = ఉత్తముడ. 

భావము:

  1. “రాక్షస కులంలో ఉత్తమమైన వాడా! ప్రహ్లాదా! నీవు నాకు పరమ భక్తుడవు. నిన్ను కనడం వలన నీ తండ్రి ముయ్యేడు (27) ముందు తరాలవారితో పాటు శుభస్థితి పొందాడు. విజ్ఞానదీపికలు వెలిగించి సంసారా మాయాంధకారాన్ని పోగొట్టే నా భక్తులు నివసించే ప్రదేశాలలో ఉండి వారి ప్రేమకు పాత్రులైన వాళ్ళు దుర్జను లైనా కూడా పరిశుద్ధులు అవుతారు. ఇది సత్యం.