Sunday, May 10, 2015

కృష్ణలీలలు

10.1-408-శార్దూల విక్రీడితము
నీ పద్యావళు లాలకించు చెవులన్ నిన్నాడు వాక్యంబులన్
నీ పేరం బనిచేయు హస్తయుగముల్ నీ మూర్తిపైఁ జూపులన్
నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపైఁ జిత్తముల్
నీ పై బుద్దుల మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణా!
          ఓ కమలపత్రాల వంటి కన్నులున్న కన్నయ్యా! నీ స్తుతి చేసే పద్యాలను విడువక వింటూ ఉండే చెవులను, నిన్ను విడువక స్తోత్రం చేస్తు ఉండే వాక్కులను మాకు అనుగ్రహించు. ఏ పని చేస్తున్నా నీ పేరనే నీ పనిగానే చేసే చేతులను, ఎప్పుడు విడువక నిన్నే చూసే చూపులను మాకు అనుగ్రహించు. నీ పాదపద్మాలను విడువక నమస్కరించే శిరస్సులను, నీమీద ఏకాగ్రమైన భక్తి కలిగి ఉండే మనస్సును, నిరంతరం నీ ధ్యానం పైనే నిలిచి ఉండే బుద్ధిని మాకు దయతో ప్రసాదించు, పరమేశ్వరా!
          బాలకృష్ణుడు తన నడుముకు కట్టిన రోలు ఈడ్చుకుంటూ రెండు మద్దిచెట్లను కూల్చాడు. వాటినుండి విముక్తులైన గుహ్యకులు కపటబాలుని స్తుతించి మాకు నీ యందు ప్రపత్తిని అనుగ్రహించమని ఇలా వేడుకున్నారు. ఇది భాగవతుల ధర్మాలని నిర్వచించే ఒక పరమాద్భుతమైన పద్యం. అందుకే ఒక శార్దూలాన్ని వదలి, "నీ" అంటూ ప్రాసాక్షార నియమాన్ని యతి స్థానాలైన మొదటి, పదమూడవ స్థానాలకు కూడా ప్రసరింపజేసి పంచదార పలుకలకు ప్రత్యేక జిలుగులు అద్దారు పోతనామాత్యులు.
10.1-408-shaardoola vikreeDitamu
nee padyaavaLu laalakiMchu chevulan ninnaaDu vaakyaMbulan
nee pEraM banichEyu hastayugamul nee moortipaiM~ joopulan
nee paadaMbula poMta mrokku shiramul nee sEvapaiM~ jittamul
nee pai buddula maaku nimmu karuNan neerEjapatrEkShaNaa!
          నీ = నీ యొక్క; పద్య = పద్యముల; ఆవళుల్ = సమూహములను; ఆలకించు = వినెడి; చెవులన్ = చెవులను; నిన్నున్ = నిన్ను; ఆడు = స్తుతించెడి; వాక్యంబులన్ = మాటలను; నీ = నీకు; పేరన్ = సమర్పణగా; పనిచేయు = పనిచేసెడి; హస్త = చేతుల; యుగముల్ = జంటలు; నీ = నీ యొక్క; మూర్తి = స్వరూపము; పైన్ = మీది; చూపులను = దృష్టిని; నీ = నీ యొక్క; పాదంబులన్ = పాదముల; పొంతన్ = దగ్గర; మ్రొక్కు = వాలినమస్కరించెడి; శిరముల్ = తలలు; నీ = నీ; సేవ = సేవచేయుట; పైన్ = అందే; చిత్తముల్ = మనసులు; నీ = నీ; పైన్ = మీది; బుద్ధులు = బుద్ధులు; మా = మా; కున్ = కు; ఇమ్ము = ఇమ్ము; కరుణన్ = దయతో; నీరేజపత్రేక్షణా = శ్రీకృష్ణా {నీరేజపత్రేక్షణుడు – కమల పత్రాల వంటి కన్నులు కలవాడు, విష్ణువు}.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Saturday, May 9, 2015

కృష్ణలీలలు

10.1-407-ఉపేంద్రవ్రజము
తపస్వివాక్యంబులు దప్ప వయ్యెన్;
నెపంబునం గంటిమి నిన్నుఁ జూడన్
దపంబు లొప్పెన్; మముఁ దావకీయ
ప్రపన్నులం జేయుము భక్తమిత్రా!
          ఓ కృష్ణపరమాత్మా! నారదమునీంద్రుల వారు మహాతపస్వి. వారి మాటలు వట్టిపోకుండా అలాగే జరిగింది. వారి శాపం పుణ్యమా అని నిన్ను చూడగలిగాము. ఇన్నేళ్ళ నుండీ నిన్ను చూడాలనే తపించాము. ఇప్పటికి ఫలించింది. నీవు భక్తులకు పరమ మిత్రుడవు. మమ్ములను నీ శరణాగత భక్తులుగా మన్నించి అనుగ్రహించు.  
10.1-407-upEMdravrajamu
tapasvivaakyaMbulu dappa vayyen;
nepaMbunaM gaMTimi ninnuM~ jooDan
dapaMbu loppen; mamuM~ daavakeeya
prapannulaM jEyumu bhaktamitraa!
          తపస్వి = ఋషి యొక్క; వాక్యంబులు = మాటలు; తప్పవు = వట్టిపోనివి; అయ్యెన్ = అయినవి; నెపంబునన్ = వంకవలన(నారదశాపం); కంటిమి = చూడగలిగితిమి; నిన్నున్ = నిన్ను; చూడన్ = చూచుటతోడనే; తపంబులు = మాతపస్సులు; ఒప్పెన్ = సాఫల్యములాయెను; మమున్ = మమ్ములను; తావకీయ = నీకు; ప్రపన్నులన్ = శరణాగతులనుగా; చేయుము = చేయుము; భక్తమిత్ర = శ్రీకృష్ణ {భక్తమిత్రుడు - భక్తులకు ఆప్తుడు, విష్ణువు}.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Friday, May 8, 2015

కృష్ణలీలలు

10.1-403-వచనము
ఇట్లు నిర్మూలంబు లై పడిన సాలంబులలోనుండి కీలికీలలు వెల్వడు పోలిక నెక్కుడు తేజంబున దిక్కులు పిక్కటిల్లం బ్రసిద్దు లైన సిద్ధు లిద్దఱు వెడలివచ్చి ప్రబుద్ధులై భక్తలోకపాలకుండైన బాలకునకు మ్రొక్కి లేచి కరకమలంబులు మొగిడ్చి యిట్లనిరి.
          అలా మొదలంటా కూలిన ఆ జంట మద్ది చెట్లలోనుండి, అగ్నిజ్వాలలు వెలువడినట్లు ఇద్దరు యక్షులు నిద్రమేల్కొన్నట్లు లేచి, దిక్కులు నిండిన తేజస్సులతో ప్రత్యక్ష మయ్యారు. భక్తులందరినీ రక్షించే కృష్ణబాలకునికి వికసించిన జ్ఞానంతో తలవంచి నమస్కారాలు చేసారు. చేతులు జోడించి అతనితో ఇలా అన్నారు.
10.1-403-vachanamu
iTlu nirmoolaMbu lai paDina saalaMbulalOnuMDi keelikeelalu velvaDu pOlika nekkuDu tEjaMbuna dikkulu pikkaTillaM brasiddu laina siddhu liddaRru veDalivachchi prabuddhulai bhaktalOkapaalakuMDaina baalakunaku mrokki lEchi karakamalaMbulu mogiDchi yiTlaniri.
          ఇట్లు = ఈ విధముగ; నిర్మూలంబులు = వేళ్లతోసహా పెల్లగిలినవి; ఐ = అయ్యి; పడిన = పడిపోయిన; సాలంబులునే = మద్దిచెట్ల; లోన్ = లోపల; నుండి = నుండి; కీలి = అగ్ని; కీలలు = శిఖలు, జ్వాలలు; వెల్వడు = వెలువడెడి; పోలికన్ = వలె; ఎక్కుడు = అధికమైన; తేజంబునన్ = తేజస్సుతో; దిక్కులున్ = అన్నిదిశలు; పిక్కటిల్లన్ = నిండుతుండగా; ప్రసిద్దులు = కనబడినవారు; ఐన = అయినట్టి; సిద్ధులు = సిద్ధపురుషులు; ఇద్దఱున్ = ఇద్దరు (2); వెడలి = బయట; వచ్చి = పడి; ప్రబుద్ధులు = మిక్కిలి బుద్ధిగలవారు; ఐ = అయ్యి; భక్త = భక్తులు; లోక = అందరకు; పాలకుండు = కాపాడువాడు; ఐన = అయినట్టి; బాలకున్ = బాలకృష్ణున; కున్ = కి; మ్రొక్కి = వంగినమస్కరించి; లేచి = లేచినలబడి; కర = చేతులు అనెడి; కమలంబులున్ = పద్మములను; మొగిడ్చి = జోడించి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Thursday, May 7, 2015

కృష్ణలీలలు

10.1-402-కంద పద్యము
బాలుఁడు ఱో లడ్డము దివ
మూలంబులు పెకలి విటపములు విఱిగి మహా
భీలధ్వనిఁ గూలెను శా
పాలస్య వివర్జనములు యమళార్జునముల్
          ఆ కృష్ణబాలుడు అడ్డం పడిన రోలుని లాగాడు. దాంతో ఆ జంట మద్దిచెట్లు రెండూ వేళ్ళతో సహా పెకలించుంకొనిపోయి, కొమ్మలు విరిగిపోతూ మహాభయంకరమైన ధ్వనితో నేలకూలిపోయాయి. చాలా కాలం తరువాత వాటికి శాపాలు తొలగిపోయాయి.
10.1-402-kaMda padyamu
baaluM~Du RrO laDDamu diva
moolaMbulu pekali viTapamulu viRrigi mahaa
bheeladhvaniM~ goolenu shaa
paalasya vivarjanamulu yamaLaarjunamul
          బాలుడు = బాలకృష్ణుడు; ఱోలు = రోలు; అడ్డమున్ = అడ్డముగా; తివన్ = లాగుటచేత; మూలంబులు = వేళ్లతోసహా; పెకలి = పెల్లగిల్లి; విటపములు = చెట్లు; విఱిగి = విరిగిపోయి; మహా = మిక్కిలి; అభీల = భయంకరమైన; ధ్వనిన్ = శబ్దముతో; కూలెను = పడిపోయెను; శాపా = శాపమువలన కలిగిన; అలస్య = అలసత్వమును; వివర్జనములున్ = తొలగినవి; యమళ = జంట; అర్జునములు = మద్దిచెట్లు.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Wednesday, May 6, 2015

కృష్ణలీలలు

10.1-401-వచనము
చని యా యూర్జిత మహాబలుండు నిజోదరదామ సమాకృష్యమాణ తిర్యగ్భవదులూఖలుండై యా రెండు మ్రాకుల నడుమం జొచ్చి ముందరికి నిగుడుచు.
          దృఢమైన బలము కల ఆ కృష్ణబాలకుడు, తన పొట్టకు కట్టిన త్రాటిని బలంగా ఊపాడు, రోలు అడ్డంతిరిగిపోయింది. అతడు చెరచెరా మద్దిచెట్లు రెంటి మధ్యనుండి దూరి రోలును ఈడ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు.
10.1-401-vachanamu
chani yaa yoorjita mahaabaluMDu nijOdaradaama samaakRiShyamaaNa tiryagbhavadulookhaluMDai yaa reMDu mraakula naDumaM jochchi muMdariki niguDuchu.
          చని = వెళ్ళి; ఆ = ఆ; ఊర్జిత = దృఢమైన; మహా = గొప్ప; బలుండు = శక్తిశాలి; నిజ = తన యొక్క; ఉదర = పొట్టకి; దామ = కట్టబడి; సమా = చక్కగా; ఆకృష్యమాణ = లాగబడుచున్నట్టి; తిర్యక్ = తిరుగుచున్నది; భవత్ = అగుచున్న; ఉలూఖలుండు = రోలుకలవాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; రెండు = రెండు (2); మ్రాకుల = చెట్ల; నడుమన్ = మధ్యన; చొచ్చి = దూరి; ముందరి = ముందు; కిన్ = కి; నిగుడుచున్ = నిక్కుచు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Tuesday, May 5, 2015

కృష్ణలీలలు

10.1-400-కంద పద్యము
ముద్దుల తక్కరిబిడ్డఁడు
మద్దులఁ గూల్పంగ దలఁచి మసలక తా నా
మద్దికవ యున్న చోటికిఁ
గ్రద్దన ఱో లీడ్చుకొనుచుఁ గడకం జనియెన్.
         ఆ టక్కులమారి ముద్దుకృష్టుడు ఆ రెండు మద్దిచెట్లను కూల్చాలని సంకల్పించాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మద్దిచెట్ల జంట దగ్గరకు అమాతంగా రోలు ఈడ్చుకుంటూ వెళ్ళాడు.
10.1-400-kaMda padyamu
muddula takkaribiDDaM~Du
maddulaM~ goolpaMga dalaM~chi masalaka taa naa
maddikava yunna chOTikiM~
graddana RrO leeDchukonuchuM~ gaDakaM janiyen.
          ముద్దుల = మనోజ్ఞమైన; తక్కరి = టక్కులమారి; బిడ్డడు = బాలకుడు; మద్దులన్ = మద్దిచెట్లను; కూల్పంగన్ = పడద్రోయవలెనని; తలచి = అనుకొని; మసలక = ఆలస్యము చేయక; తాన్ = అతను; ఆ = ఆ; మద్ది = మద్దిచెట్ల; కవ = జంట; ఉన్న = ఉన్నట్టి; చోటు = స్థలమున; కిన్ = కు; గ్రద్దనన్ = శీఘ్రముగా; ఱోలున్ = రోటిని; ఈడ్చుకొనుచున్ = లాగుకొంటూ; కడకన్ = పూని; చనియెన్ = వెళ్ళెను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :