Sunday, July 13, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 350

ఒక సూర్యుండు

1-227-మ.
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్ఠింతు శుద్ధుండనై.
          ఉన్న సూర్యుడు ఒక్కడు, సకల జీవరాసులకు ఒక్కొక్కడుగా కానవచ్చే విధంగా తాను సృష్టించిన నానావిధ ప్రాణుల సమూహాల హృదయ కమలాలలో నానా విధములైన రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే నారాయణుని పవిత్రహృదయంతో ప్రార్థిస్తున్నాను.
అంపశయ్యమీద నున్న భీష్మాచార్యులు కృష్ణుని స్తుతిస్తున్నారు.
1-227-ma.
oka sooryuMDu samastajeevulaku@M daa nokkokka@MDai tO@Mchu pO
lika nae daevuMDu sarvakaalamu mahaaleelan nijOtpanna ja
nya kadaMbaMbula hRtsarOruhamulan naanaavidhaanoona roo
paku@MDai yoppuchunuMDu naTTi hari nae@M braarThiMtu SuddhuMDanai.
          ఒక = ఒకే; సూర్యుండు = సూర్యుడు; సమస్త = సమస్తమైన; జీవులు = జీవులు; కున్ = కును; తాన్ = తను; ఒక్కొక్కఁడు = ఒక్కొక్కడుగా; ఐ = అయ్యి; తోఁచు = కనిపించు; పోలికన్ = విధముగ; ఏ = ఏ; దేవుండు = దేవుడు; సర్వ = సమస్తమైన; కాలము = కాలమునందు; మహా = గొప్ప; లీలన్ = లీలతో; నిజ = తననుండి; ఉత్పన్న = జనించిన; జన్య = జీవుల; కదంబంబుల = సమూహముల; హృత్ = హృదయ; సరోరుహములన్ = పద్మములలోను {సరోరుహము - సరసున పుట్టునది, పద్మము}; నానావిధ = అనేక రకములైన; ఆనూన = గొప్పవియైన; రూపకుఁడు = రూపముకలవాడు; ఐ = అయ్యి; ఒప్పుచు = ఒప్పుతు; ఉండున్ = ఉండును; అట్టి = అటువంటి; హరిన్ = హరిని {హరి - సంగవ్రాతములను హరించువాడు, విష్ణువు}; నేన్ = నేను; ప్రార్ఠింతు = పూజింతు; శుద్ధుండను = పరిశుద్ధుడను; ఐ = అయ్యి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Saturday, July 12, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 349


విషకుచ యగు

10.1-655-క.
విషకుచయుగ యగు రక్కసి
విషకుచదుగ్దంబుఁ ద్రావి విషవిజయుఁడ వై
విషరుహలోచన! యద్భుత
విషయుండగు నీకు సర్ప విష మెక్కెఁ గదా!
          ఓ కన్నయ్యా! విషపూరితమైన స్తనాలతో వచ్చిన ఆ రాక్షసి పూతన విషపు స్తన్యం తాగి ఆ విషాన్ని జయించిన వాడవు నువ్వు. విషము (నీటి) యందు పుట్టు పద్మాలలాంటి కన్నులు కలవాడవు, అద్భుతమైన మూర్తిమంతుడవు. కమలాక్ష! అట్టి నీకు పాము విషం ఎక్కింది అంటే అంతకన్న ఆశ్చర్యం ఏముంటుంది.
10.1-655-ka.
vishakuchayuga yagu rakkasi
vishakuchadugdaMbu@M draavi vishavijayu@MDa vai
visharuhalOchana! yadbhuta
vishayuMDagu neeku sarpa visha mekke@M gadaa!
          విష = విషము గల; కుచ = చన్నుల; యుగ = జంట గలామె; అగు = ఐనట్టి; రక్కసి = రాక్షసి; విష = విష పూరిత; కుచ = చను; దుగ్దంబున్ = పాలను; త్రావి = తాగి; విష = విష ప్రభావముపై; విజయుడవు = జయించిన వాడవు; ఐ = అయ్యి; విషరుహలోచన = కృష్ణా {విషరుహలోచనుడు - విషరుహ (నీటపుట్టు పద్మము)ల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; అద్భుత = ఆశ్చర్యకర మైన; విషయుండు = వృత్తాంతము కలవాడవు; అగు = ఐన; నీ = నీ; కున్ = కు; సర్ప = పాము యొక్క; విషము = విషము; ఎక్కెను = వంటికి పట్టినది; కదా = కదా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Friday, July 11, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 348

తరిగాండ్రలోన

8-205-క.
తరిగాండ్రలోన నొకఁ డట
తరి గడవకుఁ గుదురు నాఁక త్రాడఁట చేరుల్;
దరి గవ్వంబును దా నఁట
హరిహరి! హరిచిత్రలీల హరియే యెఱుఁగున్.
                అలా సముద్రమథనం చేస్తున్న వారిలో ఒకడుగా ఉన్నాడు. సముద్ర మనే కుండ కుదురు అయ్యాడు. చిలికే కవ్వం ఆ కవ్వానికి కట్టిన త్రాడు తానే చేరిన వాళ్ళందరు తానే అయ్యాడు. ఆహా! ఏమి విచిత్రమైన విష్ణులీలలు వాటిని విష్ణువే తెలుసుకో గలడు.
పాలసముద్రం చిలుకుతున్న వారిలో ఒకడుగా ఉండి, చిలకడానికి అయిన కడవగా ఉన్న పాలసముద్రం, కుదురుగా ఉన్న కూర్మం, చిలుకుతున్న కవ్వంగా ఉన్న మంధర పర్వతం, దానికి తాడుగా కట్టిన వాసుకి సర్పరాజు, చేరి చిలుకుతున్న వారు సర్వం తానేనట. ఇది విష్ణు తత్వం ఇంత విచిత్రం ఉంటుంది. గ్రహించగల శక్తి కూడ ఆయనకే ఉంది.
8-205-ka.
tarigaaMDralOna noka@M DaTa
tari gaDavaku@M guduru naa@Mka traaDa@MTa chaerul;
dari gavvaMbunu daa na@MTa
harihari! harichitraleela hariyae yeRu@Mgun.
          తరిగాండ్ర = చిలికెడివారి; లోనన్ = లోపల; ఒకడు = ఒకడు; అటన్ = అక్కడ; తరిగడవ = మజ్జిగ కుండైన సముద్రము; కున్ = అందలి; కుదురున్ = కుదురు; నాక = సర్పపు; త్రాడు = తాడు; అటన్ = అక్కడ; చేరుల్ = చేరినవారు; తరి = చిలికెడి; కవ్వంబున్ = కవ్వము; తాన్ = తనే; అటన్ = అట; హరిహరి = ఆహా; హరి = విష్ణుని; చిత్ర = విచిత్రమైన; లీలన్ = లీలలను; హరియే = విష్ణువునకే; యెఱుగున్ = తెలియును.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Thursday, July 10, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 347

శ్రీవిలసిత

4-1-క.
శ్రీ విలసితధరణీతన
యావదన సరోజ వాసరాధిప! సిత రా
జీవదళనయన! నిఖిల ధ
రావర నుత సుగుణధామ! రాఘవరామా!
          శ్రీమహాలక్ష్మీతేజోరూప, ఓర్పుకు మారుపేరైన భూదేవి పుత్రిక యైన సీతదేవి మోము అనే పద్మాన్ని ప్రకాశింపజేసే దినకరుని వంటి వాడు; తెల్ల తామర పూరేకుల వంటి కన్నులు గలవాడు; సమస్తమైన రాజులు అందరిచేత స్తుతింపబడే సుగుణాలతో అలరారేవాడు; అయినట్టి ఓ రఘువంశపు శ్రీరామ! నీకు వందనములు.
చతుర్థ స్కంధారంభ శ్రీరామ ప్రార్థన.
4-1-ka.
Sree vilasitadharaNeetana
yaavadana sarOja vaasaraadhipa! sita raa
jeevadaLanayana! nikhila dha
raavara nuta suguNadhaama! raaghavaraamaa!
          శ్రీవిలసిత ధరణీతనయా వదనసరోజ వాస రాధిప = శ్రీరామ {శ్రీవిలసిత ధరణీతనయా వదనసరోజ వాస రాధిప - శ్రీ (లక్ష్మీదేవి వలె, శుభకర మైన) విలసిత (ప్రకాశము గల) ధరణీ (భూదేవి యొక్క) తనయా (పుత్రిక, సీతాదేవి) వదన (మోము అనెడి) సరోజ (పద్మమునకు) వాసరాధిప (వారములకు అధిపతి, సూర్యుడా), శ్రీరామ}; సిత రాజీవ దళ నయన = శ్రీరామ {సిత రాజీవ దళ నయన - సిత (తెల్లని) రాజీవ (పద్మము) దళ (రేకుల) వంటి నయన (కన్నులుగల వాడు), శ్రీరామ}; నిఖిల ధరావర నుత సుగుణధామ = శ్రీరామ {నిఖిల ధరావర నుత సుగుణ ధామ - నిఖిల (సమస్త మైన) ధరావర (రాజుల) చేత నుత (స్తోత్రము చేయబడిన) గుణములకు ధామ (నిలయ మైనవాడ), శ్రీరామ}; రాఘవరామా = శ్రీరామ {రాఘవరామ - రాఘవ (రఘు వంశమునకు చెందిన) రామ, శ్రీరామ}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~