Wednesday, July 9, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 346

తడవాడిరి

10.1-290-క.
తడ వాడిరి బలకృష్ణులు
దడ వాడిరి వారిఁ జూచి తగ రంభాదుల్
దడవాడి రరులు భయమునఁ
దడ వాడిరి మంతనములఁ దపసులు వేడ్కన్.
          బలరాముడు, కృష్ణుడు బాల్యావస్తలో ఎంతో తడవు క్రీడించారు. రంభా మొదలగు అప్సరసలు చూసి ఆనందంతో ఎంతో సమయం నాట్యాలు చేసారు. అసురారి కదా, శత్రువులైన దుర్మార్గులు, రాక్షసులు భయంతో తడబడసాగారు. తపస్సులు చేసుకొనే ఋషులు గోష్ఠులలో లోకం సుఖపడబోతోందనే సంతోషంతో ఎంతోసేపు సంభాషించుకున్నారు.
ప్రతి పాదంలోను మొదటి నాలుగు స్థానాలు అచ్చు హల్లు భేదాలు లేకుండా వాడి, యమకం ప్రయోగించిన యీ పద్యం బహుళ ప్రజాదరణ పొందినది. రెండు అంతకన్న ఎక్కువ అక్షరాలు అర్థం భేదం కలిగి మరల మరల ప్రయోగిస్తే యమకాలంకారం.
10.1-290-ka.
taDa vaaDiri balakRshNulu
daDa vaaDiri vaari@M joochi taga raMbhaadul
daDavaaDi rarulu bhayamuna@M
daDa vaaDiri maMtanamula@M dapasulu vaeDkan.
          తడవు = చిరకాలం; ఆడిరి = క్రీడించిరి; బల = బలరాముడు; కృష్ణులున్ = కృష్ణుడు; తడవు = కొంతసేపు; ఆడిరి = నాట్యము లాడిరి; వారిన్ = వారిని; చూచి = చూసి; తగన్ = తగినట్లుగ; రంభ = రంభ; ఆదుల్ = మున్నగువారు; తడవాడిరి = తడబడిరి; అరులు = శత్రువులు; భయమునన్ = భీతిచేత; తడవు = చాలాసేపు; ఆడిరి = మాట్లాడుకొనిరి; మంతనములన్ = రహస్యముగా; తపసులు = ఋషులు; వేడ్కన్ = కుతూహలముతో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Tuesday, July 8, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 345

ఱోలనుకట్టుబడియు

10.1-380-క.
ఱోలను కట్టుపడియు న
బ్బాలుఁడు విలసిల్లె భక్త పరతంత్రుండై
యాలాన సన్నిబద్ద వి
శాలమదేభేంద్రకలభ సమరుచి నధిపా!
          ఓ పరీక్షిన్మహారాజా! ఆ గోపాలబాలకుడు సదా భక్తుల వశంలో ఉండేవాడు కదా. అలా తల్లి యశోదచే రోలుకి కట్టబడినా బిక్కమొహం యేం వెయ్యలేదు. కట్టుకొయ్యకు కట్టబడిన మదించిన గొప్ప ఏనుగు గున్నలా ఎంతో హుందాగా వెలిగిపోతున్నాడు.
10.1-380-ka.
ROlanu kaTTupaDiyu na
bbaalu@MDu vilasille bhakta parataMtruMDai
yaalaana sannibadda vi
SaalamadaebhaeMdrakalabha samaruchi nadhipaa!
          ఱోలను = రోటికి; కట్టుపడియున్ = కట్టివేయబడి; ఆ = ఆ; బాలుడు = బాలకృష్ణుడు; విలసిల్లెన్ = ఒప్పెను; భక్త = భక్తులకు; పరతంత్రుండు = లోబడు నట్టివాడు; ఐ = అయ్యి; ఆలాన = ఏనుగు కట్టు కొయ్యకు; సత్ = మిక్కిలి; నిబద్ధ = కట్టివేయబడినట్టి; విశాల = అధిక మైన; మద = మదించిన; ఇభ = ఏనుగు; ఇంద్ర = శ్రేష్ఠము; కలభ = గున్నతో; సమ = సమాన మైన; రుచిన్ = ప్రకాశముతో; అధిపా = రాజా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Monday, July 7, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 344

కటిచేలంబు

https://9glfvg.dm1.livefilestore.com/y2pzTvxzeob63W9ZBFWL_Kt6sxSwf4it03-nXWdl_cX01SZhZstRMhmij7fgjBERSFaD9LtYpWKbuvjl1mwWlzkkYykB5UKiJWjs-ioh6ZEz0Q/10.1-673-krishna-kaliyamardana%20%281%29.jpg?psid=1

10.1-638-మ.
కటిచేలంబు బిగించి పింఛమునఁ జక్కం గొప్పు బంధించి దో
స్తట సంస్ఫాలన మాచరించి చరణద్వంద్వంబుఁ గీలించి త
త్కుటశాఖాగ్రము మీఁదనుండి యుఱికెన్ గోపాలసింహంబు ది
క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభధ్వానం బనూనంబుగన్.
          నడుముకున్న దట్టీని గచ్చిగా బిగించి కట్టుకున్నాడు. తలవెంట్రుకల కొప్పు నెమలి పింఛంతో బిగించి కట్టుకున్నాడు. రెండు చేతులతో భుజాలు చరచాడు. రెండుకాళ్ళు కీళ్ళు బిగించి మహా పరాక్రమశాలి గోపాలబాలుడు ఆ చెట్టు కొమ్మ మీదనుంచి కాళింది మడుగులోకి కుప్పించి దూకాడు. దూకిన వేగానికి గుభీలు మని పెద్ద శబ్దం వచ్చింది. దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి.
10.1-638-ma.
kaTichaelaMbu bigiMchi piMChamuna@M jakkaM goppu baMdhiMchi dO
staTa saMsphaalana maachariMchi charaNadvaMdvaMbu@M geeliMchi ta
tkuTaSaakhaagramu mee@MdanuMDi yuRiken gOpaalasiMhaMbu di
ktaTamul mrOya hradaMbulO gubhagubhadhvaanaM banoonaMbugan.
          కటి = మొల నున్న; చేలంబున్ = వస్త్రమును; బిగించి = గట్టిగా కట్టి; పింఛమునన్ = నెమలి పింఛముతో; చక్కన్ = చక్కగా; కొప్పున్ = జుట్టు ముడిని; బంధించి = కట్టి; దోస్తట = అరచేతులు రెంటిని; సంస్ఫాలనము = చఱచుట; ఆచరించి = చేసి; చరణ = కాళ్ళు; ద్వంద్వంబున్ = రెంటిని; కీలించి = కీళ్ళువంచి బిగించి; తత్ = ఆ యొక్క; కుట = చెట్టు; శాఖా = కొమ్మ; అగ్రము = కొన; మీద = పై; నుండి = నుండి; ఉఱికెన్ = దుమికెను; గోపాల = గొల్లవా డైన; సింహంబు = అతి పరాక్రమవంతుడు; దిక్తటముల్ = దిగ్భాగములు; మ్రోయన్ = మారుమోగిపోవునట్లు; హ్రదంబు = మడుగు; లోన్ = లోనికి; గుబగుబ = గుబగుబ అనెడి; ధ్వానంబు = శబ్దములు; అనూనంబు = అధికముగ; కన్ = కలుగునట్లు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Sunday, July 6, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 343

అడిచితివో


1-357-క.
అడిచితివో భూసురులను;
గుడిచితివో బాల వృద్ధ గురువులు వెలిగా;
విడిచితివో యాశ్రితులను;
ముడిచితివో పరుల విత్తములు లోభమునన్.
          ఆరాధ్యులైన భూసురులను అణచివేసావా, లేకపోతే బాలురకు వృద్ధులకు గురువులకు పెట్టకుండా కుడిచినావా, శరణని చేరిన వారిని కాపాడకుండా వదలిపెట్టావా, పోనీ పరుల ధనాలను లోభం కొద్దీ ముడిచేసావా; తప్పు చేసినవాడికి కాని నీ కెందుకయ్యా యీ విచారం.
ద్వారక నుండి విచార వదనంతో వచ్చిన అర్జునుడుని విషయ మేమిటి అని ధర్మరాజు అడుగుతున్నాడు.
1-357-ka.
aDichitivO bhoosurulanu;
guDichitivO baala vRddha guruvulu veligaa;
viDichitivO yaaSritulanu;
muDichitivO parula vittamulu lObhamunan.
అడిచితివో = అణగ్గొట్టితివా ఏమిటి; భూసురులను = బ్రాహ్మణులను {భూసురులు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; కుడిచితివో = తింటివా ఏమిటి; బాల = పిల్లలను కాని; వృద్ధ = ముసలివారిని కాని; గురువులు = గురువులను కాని; వెలిగా = విడిచి పెట్టి; విడిచితివో = విడిచిపెట్టావా ఏమిటి; ఆశ్రితులను = ఆశ్రయించినవారిని; ముడిచితివో = మూటగట్టితివా ఏమిటి; పరుల = ఇతరుల; విత్తములు = ధనములను; లోభమునన్ = పిసినారితనముతో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~