Saturday, July 5, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 342

జగదవనవిహారీ

9-735-మా.
జగదవనవిహారీ! శత్రులోకప్రహారీ!
సుగుణవనవిహారీ! సుందరీమానహారీ!
విగతకలుషపోషీ! వీరవిద్యాభిలాషీ!
స్వగురుహృదయతోషీ! సర్వదా సత్యభాషీ!
          లోకరక్షణకై విహరించువాడ! శత్రువు లందరిని దండించువాడ! సుగుణములనే వనముల యందు విహరించువాడ! అందగత్తెల అభిమానం చూరగొనెడివాడ! పుణ్యాత్ములను పోషించువాడ! వీరత్వం చూపు టందు ఆసక్తి కలవాడ! స్వయంగా గురువుల హృదయాలకు సంతోషం కలిగించువాడ! ఎల్లప్పుడు సత్యమునే పలుకువాడ! శ్రీరామ! నీకు నమస్కారములు.
నవమస్కంధాంత ప్రార్థన
9-735-maa.
jagadavanavihaaree! SatrulOkaprahaaree!
suguNavanavihaaree! suMdareemaanahaaree!
vigatakalushapOshee! veeravidyaabhilaashee!
svaguruhRdayatOshee! sarvadaa satyabhaashee!
          జగ దవన విహారీ = శ్రీరామా {జగ దవన విహారుడు - లోకముల రక్షణకై సంచరించెడివాడు. రాముడు}; శత్రులోక ప్రహారీ = శ్రీరామా {శత్రులోక ప్రహారుడు - శత్రువులందరిని దండించెడివాడు, రాముడు}; సుగుణ వన విహారీ = శ్రీరామా {సుగుణ వన విహారుడు - సుగుణములనెడి వనమునందు విహరించువాడు, రాముడు}; సుందరీ మాన హారీ = శ్రీరామా {సుందరీ మాన హారుడు - అందగత్తెల అభిమానమును అపహరించువాడు, రాముడు}; విగత కలుష పోషీ = శ్రీరామా {విగతకలుష పోషుడు - విగతకలుష (పుణ్యాత్ములను) పోషించువాడు, రాముడు}; వీర విద్యాభిలాషీ = శ్రీరామా {వీర విద్యాభిలాషుడు - వీరత్వము చూపు టందు ఆసక్తి కలవాడు, రాముడు}; స్వ గురు హృదయ తోషీ = శ్రీరామా {స్వ గురు హృదయ తోషుడు - తన గురువుల మనసులను సంతోషపరచువాడు, రాముడు}; సర్వదా సత్య భాషీ = శ్రీరామా {సర్వదా సత్య భాషి - ఎల్లప్పుడు సత్యమునే పలుకువాడు, రాముడు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Friday, July 4, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 341

ఆదిన్ శ్రీసతికొప్పుపై 


8-592-శా.
ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనవుపై, నంసోత్తరీయంబుపై,
బాదాబ్జంబులపైఁ, గపోలతటిపై, బాలిండ్లపై నూత్నమ
ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్
గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?
          ఇతడు దానం కావాలని చాచినచేయి ఎంతో గొప్పది కదా! మొదట లక్ష్మీదేవి యొక్క కొప్పు ముడి మీద, శరీరం మీద, పైట చెంగు మీద, పాదపద్మాల మీద, చెక్కిళ్ళ మీద, పాలిండ్ల మీద సరికొత్త మర్యాదలు పొందే దివ్యమైన హస్తం. అంతటి చెయ్యి కిందది కావటం నాచెయ్యి పైది కావటం ఎంత అదృష్టం! ఎంత మేలు! దీని ముందు ఈ రాజ్యం ఏ పాటిది! ఇదేమైనా శాశ్వతంగా ఉండేదా! ఈ శరీరం ఏమైనా పడిపోకుండా ఉండిపోతుందా.
ఈ దానం ప్రమాదకరం అందుచేత అబద్దమాడినా ఏం పరవాలేదు వామనునికి దానం ఇయ్య వద్దని దానవకులాచార్యుడు శుక్రనీతి చెప్తుంటే, మహా దానశీలుడు బలిచక్రవర్తి అంగీకరించకుండా ఈ దానం ఇచ్చి తీరతాను అబద్ధం ఆడను అంటు ఇలా చెప్తున్నాడు.
8-592-Saa.
aadin Sreesati koppupai@M, danavupai, naMsOttareeyaMbupai,
baadaabjaMbulapai@M, gapOlataTipai, baaliMDlapai nootnama
ryaadaM jeMdu karaMbu griM daguTa mee@Mdai naa karaMbuMTa mael
gaadae? raajyamu geejyamun satatamae? kaayaMbu naapaayamae?
          ఆదిన్ = ముందుగా; శ్రీసతి = లక్ష్మీదేవి; కొప్పు = జుట్టుముడి; పైనన్ = మీద; అంసోత్తరీయంబు = పైట; పైన్ = మీద; పాద = పాదములు యనెడి; అబ్జంబుల = పద్మముల; పైన్ = మీద; కపోలతటి = చెక్కిళ్ళ; పైన్ = మీద; పాలిండ్ల = స్తనముల; పైన్ = మీద; నూత్న = సరకొత్త; మర్యాదన్ = గౌరవమును; చెందు = పొందెడి; కరంబు = చేయి; క్రింద = కింద ఉన్నది; అగుట = అగుట; మీద = పైన ఉన్నది; ఐ = అయ్యి; నా = నా యొక్క; కరంబున్ = చేయి; ఉంటన్ = ఉండుట; మేల్ = గొప్ప; కాదే = కాదా ఏమిటి; రాజ్యమున్ = రాజ్యము; గీజ్యమున్ = గీజ్యము; సతతమే = శాశ్వతమా కాదు; కాయంబు = దేహము; నాపాయమే = చెడిపోనిదా కాదు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Thursday, July 3, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 340

అలసితివిగదన్న


10.1-259-ఆ.
అలసితివి గదన్న! యాకొంటివి గదన్న!
మంచి యన్న! యేడ్పు మాను మన్న!
చన్నుఁగుడువు మన్న! సంతసపడు మన్న!
యనుచుఁ జన్నుఁగుడిపె నర్భకునకు.
                ఓ నా చిన్ని కన్నా! అలసిపోయావా నాయనా! ఆకలేస్తోందా కన్నా! మంచి వాడివి కదా కన్నా! ఏడుపు ఇక ఆపు నాయనా! దా పాలు తాగి చిరునవ్వులు చిందించు కన్నా! అంటు లాలిస్తు యశోదాదేవి పాలిచ్చింది బిడ్డడికి.
చంటి పిల్లాడుగా ఉన్న కృష్ణుని పక్కమీద నిద్రపుచ్చి యశోద పనులలో ఉంది. ఇంతలో నిద్రలేచిన ఆ మాయా శిశువు ఏడుపు లంకించుకొని శకటాసురుని ఓ తన్ను తన్ని శిక్షించాడు. అందరు ఆశ్చర్యపోతుంటే. ఏడుపు విన్న యశోద వచ్చి ఇలా లాలిస్తు పాలిచ్చింది. ‘న్న’తో వృత్యనుప్రాస అలకరించబడింది యీ పద్యంలో. ఒకే హల్లు పలుమారులు వస్తే వృత్యనుప్రాసాలంకారం.
10.1-259-aa.
alasitivi gadanna! yaakoMTivi gadanna!
maMchi yanna! yaeDpu maanu manna!
channu@MguDuvu manna! saMtasapaDu manna!
yanuchu@M jannu@MguDipe narbhakunaku.
          అలసితివి = అలసిపోయావు; కద = కదా; అన్న = నాయనా; ఆకొంటివి = ఆకలివేసినది; కద = కదా; అన్న = నాయనా; మంచి = బుద్ధిమంతుడివి; అన్న = నాయనా; ఏడ్పున్ = రోదనమును; మానుము = మానివేయుము; అన్న = నాయనా; చన్ను = చనుబాలు; కుడువుము = తాగుము; అన్న = నాయనా; సంతసపడుము = సంతోషింపుము; అన్న = నాయనా; అనుచున్ = అంటూ; చన్నున్ = చనుబాలు; కుడిపెన్ = తాగించెను; అర్భకున్ = పిల్లవాని; కున్ = కి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~