Wednesday, May 7, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 280


ఉద్రేకంబున రారు

1-163-శా.
ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు కిం
చిద్ద్రోహంబును నీకుఁ జేయరు బలోత్సేకంబుతోఁ జీఁకటిన్
భద్రాకారులఁ బిన్నపాఁపల రణప్రౌఢ క్రియాహీనులన్
నిద్రాసక్తుల సంహరింప నకటా నీ చేతు లెట్లాడెనో?
          ఉద్రేకంతో నీ పైకి దూకలేదే; యుద్ధరంగంలో ఆయుధపాణులై ఎదురు నిలువలేదే; లవలేశం కూడా నీకు అపకారం చేయలేదే; అటువంటి చిన్నవాళ్లను, అందాలు చిందే పిన్నవాళ్లను, యుద్ధవిద్యలు ఇంకా సరిగా నేర్వని వాళ్లను, నిద్రలో ఆదమరచి ఉన్న వాళ్లను కారుచీకటిలో, వీరావేశంతో వధించటానికి అయ్యో! నీకు చేతు లెలా వచ్చాయయ్యా?
అశ్వత్థామను కట్టి పట్టుకొచ్చి కృష్ణార్జునులు ద్రౌపది ముందు పడేసారు. ఆమె ఇంత చిన్న పిల్లలను దయమాలి ఎలా హతమార్చావు అంటు ఇలా ప్రశ్నిస్తోంది.
1-163-Saa.
udraekaMbuna raaru Sastradharulai yuddhaavanin laeru kiM
chiddrOhaMbunu neeku@M jaeyaru balOtsaekaMbutO@M jee@MkaTin
bhadraakaarula@M binnapaa@Mpala raNaprauDha kriyaaheenulan
nidraasaktula saMhariMpa nakaTaa nee chaetu leTlaaDenO?
ఉద్రేకంబున = ఉద్రేకముతో; రారు = రారు; శస్త్ర = శస్త్రములు; ధరులు = ధరించిన వారు; ఐ = అయ్యి; యుద్ధ = రణ; అవనిన్ = భూమిలో; లేరు = లేరు; కించిత్ = కొంచెము కూడ; ద్రోహంబును = ద్రోహమును; నీకున్ = నీకు; చేయరు = చేయరు; బల = బలమువలని; ఉత్సేకంబు = ఉద్రేకము; తోన్ = తో; చీకటిన్ = చీకట్లో; భద్ర = బంగారం లాంటి; ఆకారులన్ = రూపమున్న వారిని; పిన్న = చిన్న; పాఁపల = పిల్లలను; రణ = యుద్ధము; ప్రౌఢ = నేర్పుగా; క్రియా = చేయట; హీనులన్ = రాని వారిని; నిద్ర = నిద్రపోవు; ఆసక్తులన్ = ఆసక్తి నున్నవారిని; సంహరింపన్ = సంహరించుటకు; అకటా = అయ్యో; నీ = నీ యొక్క; చేతులు = చేతులు; ఎట్లు = ఎలా; ఆడెనో = వచ్చెనో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Monday, May 5, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 279

సతి దన పతి

4-59-క.

సతి దన పతి యగు నా పశు
పతిఁ జూచి సముత్సుకతను భాషించె; ప్రజా
పతి మీ మామ మఖము సు
వ్రతమతి నొనరించుచున్న వాఁడఁట వింటే.
          అప్పుడు సతీదేవి అతిశయించిన కుతూహలంతో తన ప్రాణేశ్వరుడైన పరమేశ్వరునితో ఇలా అంటోంది “మీ మావగారు దక్షప్రజాపతి దీక్షాపరుడై యజ్ఞం చేస్తున్నా డట. మీరు విన్నారు కదా స్వామి!”
దక్షాధ్వర ధ్వంసం ఘట్టంలో, దక్షుడు తలపెట్టిన నిరీశ్వరయాగానికి తరలి వెళ్తున్న దేవతలను గమనించిన సతీదేవి భర్తను, వెళ్ధామని అడుగబోతో ఇదిగో ఇలా అంటోంది.
4-59-ka.
sati dana pati yagu naa paSu
pati@M joochi samutsukatanu bhaashiMche; prajaa
pati mee maama makhamu su
vratamati nonariMchuchunna vaa@MDa@MTa viMTae;
          సతి = సతీదేవి; తన = తన యొక్క; పతి = భర్త; అగు = అయిన; ఆ = ఆ; పశుపతిన్ = శివుని {పశుపతి - పాశములచే బంధించబడిన సకల జీవులను పాలించు అధిపతి, శివుడు}; చూచి = చూసి; సముత్సకతను = మంచి; ఉత్సుకతనున్ = ఉత్సాహముతో; భాషించెన్ = మాట్లాడెను; ప్రజాపతి = ప్రజాపతి; మీ = మీ యొక్క; మామ = మావగారు; మఖమున్ = యాగమును; సువ్రత = బాగుగా చేయు; మతిన్ = ఉద్దేశ్యముతో; ఒనరించుచున్ = చేస్తూ; ఉన్నవాడట = ఉన్నాడట; వింటే = విన్నారా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Sunday, May 4, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 278

పోడను బ్రాహ్మణుడు


10.1-1729-ఉ.
పోఁ డను బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి; వాసుదేవుఁడున్
రాఁ డను; నింకఁ బోయి హరి రమ్మని చీరెడు నిష్టబంధుడున్
లేఁ డను; రుక్మికిం దగవు లేదటు చైద్యున కిత్తు నంచు ను
న్నాఁ డను; గౌరి కీశ్వరికి నావలనం గృపలేదు నే డనున్.
          పంపిన విప్రుడు అగ్నిద్యోతనుడు అసలు యదువంశశ్రేష్ఠుడు శ్రీకృష్ణుని ద్వారకానగరానికి వెళ్ళి ఉండడేమో; అందుచేతనే ఆ వసుదేవ నందనుడైన శ్రీకృష్ణమూర్తి రాటంలేదేమో అని సందేహిస్తోంది; పోనీ ఇంకొకరిని పంపి పిలుచుకు రమ్మందాం అంటే అంతటి ఆప్తుడు ఇంకెవరు లేరుకదా అని బాధపడుతోంది; ఓ పక్క అన్నగారైన రుక్మి తన మాటకు అడ్డులేదని చైద్య దేశపు రాజు శిశుపాలుడికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఎలా అని విచారిస్తోంది; పరమేశ్వరి గౌరీదేవికి తనపై కృప తప్పిందేమో అని రుక్మిణీ దేవి చింతిస్తోంది .
10.1-1729-u.
pO@M Danu braahmaNuMDu yadupuMgavu veeTiki; vaasudaevu@MDun
raa@M Danu; niMka@M bOyi hari rammani cheereDu nishTabaMdhuDun
lae@M Danu; rukmikiM dagavu laedaTu chaidyuna kittu naMchu nu
nnaa@M Danu; gauri keeSvariki naavalanaM gRpalaedu nae Danun.
          పోడు = వెళ్ళి ఉండడు; అనున్ = అనును; బ్రాహ్మణుండు = విప్రుడు; యదు పుంగవు = కృష్ణుని {యదు పుంగవుడు - యాదవ వంశస్తులలో శ్రేష్ఠుడు, కృష్ణుడు}; వీటి = నగరమున; కిన్ = కు; వాసుదేవుడున్ = కృష్ణుడు {వాసుదేవుడు - వసుదేవుని కొడుకు, కృష్ణుడు}; రాడు = వచ్చుట లేదు; ఇంకన్ = ఇంకను; పోయి = వెళ్ళి; హరిన్ = కృష్ణుని; రమ్ము = రావలసినది; అని = అని; చీరెడు = పిలిచెడు; ఇష్ట = ఆప్తు డైన; బంధుడున్ = మేలు కోరువాడు; లేడు = ఎవడు లేడు; అనున్ = అనును; రుక్మి = రుక్మి {రుక్మి - రుక్మిణి పెద్దన్న}; కిన్ = కి; తగవు = న్యాయము; లేదు = లేదు; అటు = అలా; చైద్యున్ = శిశుపాలుని; కిన్ = కి; ఇత్తున్ = ఇస్తాను; అంచున్ = అనుచు; ఉన్నాడు = ఎంచి ఉన్నాడు; అనున్ = అనును; గౌరి = పార్వతీదేవి {గౌరి - గౌరవర్ణము కలామె, పార్వతి}; కిన్ = కి; ఈశ్వరి = పరమేశ్వరి; కిన్ = కి; నా = నా; వలనన్ = ఎడల; కృప = దయ; లేదు = లేదు; నేడు = ఇవాళ; అనున్ = అనును.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~