Saturday, May 3, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 277

భూసురుడవు

1-162-క.

భూసురుఁడవు, బుద్ధిదయా
భాసురుఁడవు, శుద్ధవీరభటసందోహా
గ్రేసరుఁడవు, శిశుమారణ,
మాసురకృత్యంబు ధర్మ మగునే తండ్రీ!
          తండ్రీ! దివ్యమైన బ్రాహ్మణుడివి కదయ్య; వివేక, దయాదాక్షిణ్యాలతో ప్రకాశించేవాడవు కదయ్య; వీరాధివీరులందరిలో ముందుండే వాడవు కదయ్యా; అలాంటి నువ్వు బాలుర ప్రాణాలు తీసే ఇలాంటి రాక్షసకృత్యానికి ఒడిగట్టడం ధర్మమా చెప్పు.
అశ్వత్థామను కట్టి పట్టుకొచ్చి కృష్ణార్జునులు ద్రౌపది ముందు పడేసారు. స్థితప్రజ్ఞురాలైన ఆమె ఇలా ప్రశ్నిస్తోంది తమ పిల్లలను హతమార్చిన ఆ బాలఘాతకుని. ఎంతటి సంయమనం ఎంతటి ధార్మిక సంస్కారం. దానికి ఏమాత్రం తగ్గని పదవిన్యాసం.
1-162-ka.
bhoosuru@MDavu, buddhidayaa
bhaasuru@MDavu, SuddhaveerabhaTasaMdOhaa
graesaru@MDavu, SiSumaaraNa,
maasurakRtyaMbu dharma magunae taMDree!
భూసురుఁడవు = బ్రాహ్మణుడవు; బుద్ధి = బుద్దియందు; దయా = దయతో; భాసురుఁడవు = ప్రకాశించువాడవు; శుద్ధ = చక్కటి; వీర = వీరుల; భట = భటుల; సందోహ = సమూహములో; అగ్రేసరుఁడవు = పెద్దనాయకుడవు; శిశు = పిల్లలను; మారణము = సంహరించుట; అసుర = రాక్షసపు; కృత్యంబు = పని; ధర్మ = న్యాయము; అగునే = అవుతుందా; తండ్రీ = అయ్యా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Thursday, May 1, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 276

తండ్రిక్రియ

9-336-క.
తండ్రి క్రియ రామచంద్రుఁడు
తండ్రుల మఱపించి ప్రజలఁ దా రక్షింపన్
తండ్రుల నందఱు మఱచిరి
తండ్రిగదా రామచంద్రధరణిపుఁ డనుచున్.
          తండ్రిలా శ్రీరామచంద్రప్రభువు ప్రజలను కన్నతండ్రిని మించి కాపాడుతు రాజ్యం పాలించాడు. ప్రజ లందరు మా తండ్రి మహారాజు రామచంద్రుడే అని తమ తండ్రులను మరిచారు.
భాగవతంలోని రామాయణ ఘట్టంలోని శ్రీరామరాజ్య వర్ణన ఇది.
9-336-ka.
taMDrikriya raamachaMdru@MDu
taMDrula maRapiMchi prajala@M daa rakshiMpan
taMDrula naMdaRu maRachiri
taMDrigadaa raamachaMdradharaNipu@M Danuchun.
          తండ్రి = కన్నతండ్రి; క్రియన్ = వలె; రామచంద్రుడు = శ్రీరాముడు; తండ్రులన్ = కన్నతండ్రులను; మఱపించి = మరిపించి; ప్రజలన్ = లోకులను; తాన్ = తను; రక్షింపన్ = ఏలుతుండగా; తండ్రులన్ = కన్నతండ్రులను; అందఱున్ = అందరు; మఱచిరి = మరచిపోయిరి; తండ్రి = తండ్రి; కదా = కదా; రామచంద్ర = రామయ్యతండ్రి అనెడి; ధరణిపుడు = రాజు {ధరణిపుడు - ధరణిని ఏలెడివాడు, రాజు}; అనుచున్ = భావించుచు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

తెలుగు భాగవత తేనె సోనలు – 275

భీమంబై

8-112-శా.
భీమంబై తలఁద్రుంచి ప్రాణములఁ బాపెం జక్రమా శుక్రియన్
హేమక్ష్మాధర దేహముం జకిత వన్యేభేంద్ర సందోహముం
గామ క్రోధన గేహమున్ గరటి రక్తస్రావ గాహంబు ని
స్సీమోత్సాహము వీతదాహము జయశ్రీమోహమున్ గ్రాహమున్.
          రివ్వురివ్వున పోయి, చక్రాయధం మొసలి తలని భయంకరంగా తెగనరికింది. ఆ మకరం మేరు పర్వతమంత పెద్ద దేహం గలది, అడవి ఏనుగులకు సైతం భయం కలిగించేది, కామక్రోధాలతో నిండినది. గజరాజు రక్తధారల రుచిమరిగినది, అంతులేని ఉత్సాహంతో అలసటలేకుండ పోరాడుచున్నది, గెలుపుని నమ్మకంగా కోరుతున్నది. విష్ణుచక్రం వెళ్ళి అలాంటి మొసలి శిరస్సుని ఖండించి ప్రాణాలు తీసింది.
8-112-Saa.
bheemaMbai tala@MdruMchi praaNamula@M baapeM jakramaa Sukriyan
haemakshmaadhara daehamuM jakita vanyaebhaeMdra saMdOhamuM
gaama krOdhana gaehamun garaTi raktasraava gaahaMbu ni
sseemOtsaahamu veetadaahamu jayaSreemOhamun graahamun.
          భీమంబు = భయంకర మైనది; ఐ = అయ్యి; తలన్ = శిరస్సును; త్రుంచి = కత్తిరించి; ప్రాణములన్ = ప్రాణములను; పాపెన్ = తీసెను; చక్రమున్ = విష్ణు చక్రము; ఆశు = వేగవంత మైన; క్రియన్ = విధముగ; హేమక్ష్మాధర = మేరుపర్వతము వంటి {హేమక్ష్మాధరము - హేమ (బంగారు) క్ష్మాధరము (కొండ), మేరుపర్వతము}; దేహమున్ = శరీరము గల దానిని; చకిత = భయపెట్టబడిన; వన్య = అడవి; ఇభ = ఏనుగు; ఇంద్ర = శ్రేష్ఠముల; సందోహమున్ = సమూహము గల దానిని; కామ = కామము; క్రోధన = క్రోధములకు; గేహమున్ = నివాస మైన దానిని; కరటి = ఏనుగు యొక్క; రక్త = రక్తపు; స్రావ = ధారల యందు; గాహంబున్ = మునిగిన దానిని; నిస్సీమ = అంతులేని; ఉత్సాహమున్ = ఉత్సాహము గల దానిని; వీత = పోయిన; దాహమున్ = ఆయాసము గల దానిని; జయ = విజయ మనెడి; శ్రీ = సంపద యందు; మోహమున్ = మోహము గల దానిని; గ్రాహమున్ = మొసలిని.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~