Friday, March 3, 2017

కాళియమర్దనము – నిగ్రహమె

:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:


10.1-676-క.
నిగ్రహమె మము విషాస్యుల
నుగ్రుల శిక్షించు టెల్లనూహింప మహా
నుగ్రహము గాక మాకీ
నిగ్రహము విషాస్యభావనిర్గతిఁ జేసెన్.
10.1-677-ఉ.
ట్టి తపంబు జేసెనొకొయెట్టి సుకర్మములాచరించెనో?
యెట్టి నిజంబు బల్కెనొకొయీ ఫణి పూర్వభవంబునందు ము
న్నెట్టి మహానుభావులకు నెన్నఁడుఁ జేరువగాని నీవు నేఁ
డిట్టి వినోదలీలఁ దల లెక్కి నటించెద వీ ఫణీంద్రుపై.

టీకా:
నిగ్రహమె = అడ్డగించుటె, కాదు; మమున్ = మమ్ములను; విష = విషముగల; ఆస్యులన్ = మోముగలవారము; ఉగ్రులన్ = భయంకరులను; శిక్షించుట = దండించుటలు; ఎల్లన్ = సమస్తము; మహా = గొప్ప; అనుగ్రహము = అనుగ్రహము; కాక = కాకుండగ; మా = మా; కున్ = కు; ఈ = ఈ యొక్క; నిగ్రహము = దండన; విష = విషపు; అస్య = ముఖముల; భావ = తత్వమునుండి; నిర్గతి = విడుదలౌటను; చేసెన్ = కలిగించెను.
ఎట్టి = ఎలాంటి; తపంబున్ = తపస్సును; చేసెన్ = చేసెనో; ఒకొ = ఏమో; ఎట్టి = ఎలాంటి; సుకర్మములు = మంచిపనులు; ఆచరించెనో = చేసెనో; ఎట్టి = ఎలాంటి; నిజంబున్ = సత్యమును; పల్కెన్ = పలికెనో; ఒకొ = ఏమో; ఈ = ఈ యొక్క; ఫణి = సర్పము; పూర్వ = ముందు; భవంబున్ = జన్మము; అందున్ = లో; మున్ను = ఇంతకు పూర్వము; ఎట్టి = ఎలాంటి; మహానుభావుల = గొప్పవారల; కున్ = కు; ఎన్నడున్ = ఎప్పుడు; చేరువ = సన్నిహితుడు; కాని = కాని; నీవు = నీవు; నేడు = ఇవాళ; ఇట్టి = ఇటువంటి; వినోద = వినోద; లీన = విలాసములను; నటించెదవు = నాట్యము చేసెదవు; ఈ = ఈ యొక్క; ఫణి = పాము; ఇంద్రు = శ్రేష్టుని; పైన్ = మీద.

భావము:
నోట్లో విషం కలిగిఉండేవాళ్ళం. తీవ్రమైన కోపం కలవాళ్ళం. అలాంటి మాలాంటి వారిని శిక్షించడం నిజానికి దండనే కాదు. అది మమ్మల్ని గొప్పగా అనుగ్రహించుటమే. ఈ శిక్ష వలన మా కున్న విషంకలవాళ్ళ మనే పొగరు దిగిపోయేలా చేసింది.
పూర్వ జన్మలలో ఈ కాళియుడు ఎంతటి గొప్ప తపస్సు చేసాడో? ఏగొప్ప మంచిపనులు చేసాడో? ఏసత్యాలు పలికాడో? ఎప్పుడు ఎంతటి మహానుభావుల దగ్గరకువెళ్ళని నువ్వు ఇవేళ ఇలా వినోదంగా ఈ నాగరాజు పడగలమీదెక్కి నాట్యం చేసావు. అహా! ఎంత అదృష్టవంతుడో కదా ఇతడు?

No comments: