8-701-వ.
అదియును ముహూర్తమాత్రంబునకు మూఁడు చేతుల నిడుపై యుదంచంబు నిండి పట్టు చాలక వేఱొండుఁ దె మ్మనవుడు నా రాచ పట్టి కరుణాగుణంబునకు నాటపట్టుఁ గావున గండకంబు నొండొక్క చిఱుతమడుఁగున నునిచె; నదియు నా సరోవర జలంబునకు నగ్గలం బై తనకు సంచరింప నది గొంచెం బని పలికినం బుడమిఱేడు మంచి వాఁడగుటం జేసి యా కంచరంబు నుదంచిత జలాస్పదంబైన హ్రదం బునందు నిడియె; నదియు నా సలిలాశయంబునకును నధికంబై పెరుఁగ నిమ్ము చాలదని చెప్పికొనిన నప్పుణ్యుం డొప్పెడి నడవడిం దప్పని వాఁడైన కతంబున న మ్మహామీనంబును మహార్ణవంబున విడిచె; నదియును మకరాకరంబునం బడి రాజున కిట్లను "పెను మొ సళ్ళు ముసరికొని కసిమసంగి మ్రింగెడి; నింతకాలంబు నడపి కడ పట దిగవిడువకు వెడలఁ దిగువు" మని యెలింగింప దెలిసి కడపట యన్నీటితిరుగుడు ప్రోడకుం బుడమిఱేఁ డిట్లనియె.
భావము:
ఒక్క క్షణంలో ఆ మీనం మూడు చేతుల పొడవు పెరిగిపోయి, (ఆంధ్ర వాచస్పతము చెయ్యి = రెండు మూరల పొడవు అంటే మూడడుగులు) ఆ గంగాళం అంతా నిండిపోయింది. చోటు సరిపోక ఇంకొకటి తెమ్మంది. దయానిధి అయిన ఆ రాకుమారుడు ఆ మత్స్యాన్ని చిన్న మడుగులోకి మార్పించాడు. ఆ మడుగుకూడా సరిపోనంత పెరిగిపోయి “నాకు తిరగడానికి చోటు చాలటం లేదు” అంది. ఆ భూపాలకుడు మంచివాడు కనుక ఆ జలచరాన్ని నీరు సమృద్ధిగా ఉన్న పెద్ద సరస్సులో ఉంచాడు. అది కూడా సరిపోనంతా పెరిగిపోయి ఆ మహామత్స్యం చోటు చాలటంలేదని చెప్పుకుంది. బహు దొడ్డ సన్మార్గ చరితుడూ, పుణ్యశీలీ కనుక ఆ మహా మీనాన్ని తీసుకెళ్ళి మహా సముద్రంలో వదిలాడు. సముద్రానికి మొసళ్ళకు నెలవు అని పేరుకదా. “ఈ సముద్రంలో పడ్డ నన్ను పెద్ద మొసళ్ళు చుట్టుముట్టి చంపి తినేస్తాయి. ఇన్నాళ్ళూ కాపాడి, ఇవాళ నన్ను ఇలా వదలివేయకు, బయటకు తీసుకురా” అని మొరపెట్టుకుంది. ప్రాజ్ఞుడైన ఆ మహా జలచరంతో రాజు ఇలా అన్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=701
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment