8-705-వ.
అని పలుకు సత్యవ్రత మహారాజునకు నయ్యుగంబు కడపటఁ బ్రళయ వేళ సముద్రంబున నేకాంతజన ప్రీతుండయి విహరింప నిచ్ఛించి మీన రూపధరుండైన హరి యిట్లనియె.
8-706-సీ.
"ఇటమీఁద నీ రాత్రికేడవదినమునఁ;
బద్మగర్భున కొక్క పగలు నిండు;
భూర్భువాదిక జగంబులు మూఁడు విలయాబ్ధి;
లోన మునుంగు; నాలోనఁ బెద్ద
నావ చేరఁగ వచ్చు; నా పంపు పెంపున;
దానిపై నోషధితతులు బీజ
రాసులు నిడి పయోరాశిలో విహరింపఁ;
గలవు సప్తర్షులుఁ గలసి తిరుఁగ
8-706.1-ఆ.
మ్రోలఁ గాన రాక ముంచు పెంజీఁకటి
మిడుకుచుండు మునుల మేనివెలుఁగుఁ
దొలకుచుండు జలధి దోధూయమాన మై
నావ దేలుచుండు నరవరేణ్య!
భావము:
ఇలా సత్యవ్రత మహారాజు ఈ మత్స్యావతార కారణం చెప్పమని అడిగాడు. ఆ యుగం చివర కాలంలోని ప్రణయవేళ సముద్రంలో ఒంటరిగా సంచరించాలని భావిస్తున్న శ్రీమహావిష్ణువు సత్యవ్రతునితో ఇలా అన్నాడు. “ఓ రాజా! ఈ రాత్రి గడచిన పిమ్మట రాబోయే ఏడవ నాటితో బ్రహ్మదేవుడికి ఒక పగలు పూర్తి అవుతోంది. భూలోకం మొదలు మూడులోకాలూ ప్రళయసముద్రంలో మునుగుతాయి. అప్పుడు నా ఆజ్ఞానుసారం ఒక పెద్ద నావ నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు నీవు సమస్త ఓషధులు, విత్తనాల రాసులూ ఆ నౌకపై పెట్టుకుని ప్రళయసముద్రంలో విహరించు. సప్తఋషులు నీతో కలిసి ఆ ఓడలో ఉంటారు. మీ ముందు అంతా పెనుచీకటి ఆవరిస్తుంది. మునుల మేని కాంతులు మిణుకు మిణుకు అంటూ మెరుస్తుంటాయి. సముద్రంలో నావ ఊగుతూ తేలుతూ సాగిపోతూ ఉంటుంది.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=87&Padyam=706
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment