:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం
అందరం:
10.1-673-వ.
కని దండప్రణామంబు లాచరించి నిటలతటఘటిత కరకమలలై
యిట్లనిరి.
10.1-674-క.
"క్రూరాత్ముల దండింపఁగ
ధారుణిపై నవతరించి తనరెడి నీ కీ
క్రూరాత్ముని దండించుట
క్రూరత్వము గాదు సాధుగుణము గుణాఢ్యా!
ధారుణిపై నవతరించి తనరెడి నీ కీ
క్రూరాత్ముని దండించుట
క్రూరత్వము గాదు సాధుగుణము గుణాఢ్యా!
10.1-675-క.
పగవారి సుతుల యందును
బగ యించుక లేక సమతఁ బరగెడి నీకుం
బగగలదె? ఖలుల నడఁచుట
జగదవనముకొఱకుఁ గాక జగదాధారా!
బగ యించుక లేక సమతఁ బరగెడి నీకుం
బగగలదె? ఖలుల నడఁచుట
జగదవనముకొఱకుఁ గాక జగదాధారా!
టీకా:
కని = దర్శించి; దండప్రణామంబులు = సాష్టాంగనమస్కారములు; ఆచరించి = చేసి; నిటల =
నొసటి; తట = ప్రదేశమున; ఘటిత =
కూర్చబడిన; కర = చేతులు అనెడి; కమలలు
= పద్మములు కలవారు; ఐ = అయ్యి; ఇట్లు
= ఇలా; అనిరి = పలికిరి.
క్రూర = కఠినమైన; ఆత్ములన్ = మనసులు కలవారిని; దండింపగ = శిక్షించుటకు; ధారుణి = భూమి; పైన్ =
మీద; అవతరించి = పుట్టి; తనరెడి
= ఒప్పునట్టి; నీ = నీ; కున్ =
కు; ఈ = ఈ యొక్క; క్రూరాత్ముని
= కఠినాత్ముని; దండించుట = శిక్షించుట; క్రూరత్వము = కఠినత్వము; కాదు = కాదు; సాధుగుణము
= మృదుత్వము; గుణాఢ్యా = త్రిగుణసంపన్నుడా, కృష్ణా.
పగవారి = శత్రులు యొక్క; సుతులన్ = బిడ్డలను; అందునున్ = ఎడల; పగ =
శత్రుత్వము; ఇంచుక = కొద్దిగా కూడ; లేకన్ = లేకుండగ; సమతన్
= సమభావమున; పరగెడి = మెలగెడి; నీ =
నీ; కున్ = కు; పగ =
శత్రుభావము; కలదె = ఉన్నదా, లేదు; ఖలులన్ = దుష్టులను; అణచుట = శిక్షించుట; జగత్ = లోకమునకు; అవనము
= రక్షించుట; కొఱకున్ = కోసము; కాక =
తప్ప; జగదాధరా = కృష్ణా {జగదాధారుడు
- జగత్తునకు ఆధారభూతమైనవాడు,
విష్ణువు}.
భావము:
ఆ నాగకాంతలు కృష్ణుని దర్శించి
సాష్టాంగనమస్కారాలు చేసి, నుదుట చేతులు జోడించి ఇలా అన్నారు:
“సర్వగుణ
సంపన్నుడవైన కృష్ణా! క్రూరులను దండించడానికి అవతరించిన వాడవు నీవు. క్రూరుడైన
కాళియుని శిక్షించుట నీ వీరత్వమే గాని క్రూరత్వం కాదు.
సమస్త లోకాలకు ఆధారభూతమైనవాడా!
శ్రీకృష్ణా! శత్రువుల కొడుకులందు సైతము కొంచం కూడ శత్రుత్వం చూపకుండ నీవు సమానత్వం
చూపుతావు. నీకు పగ అన్నది లేదు కదా. నీవు దుష్టులను శిక్షించుట లోకాలను
రక్షంచడానికే కదా.
1 comment:
అర్ధంతో ఇచ్చారు.బాగుంది.ఉత్సాహం ఉండి తెలుసుకునేవారికి బాగా ఉపయోగపడతాయి.నేడు చాలామందికి పుస్తకాలు చదివే ఓపిక లేదుకదా!కనీసం కొంతైనా వారి బుర్రలోకి ఎక్కించే ప్రయత్నం బాగుంది.
Post a Comment