Thursday, March 16, 2017

మత్స్యావతార కథ - 7:


8-702-సీ.
ఒక దినంబున శతయోజనమాత్రము;
విస్తరించెదు నీవు; వినము చూడ
మిటువంటి ఝషముల నెన్నఁడు నెఱుఁగము;
మీనజాతుల కిట్టి మేను గలదె?
యేమిటి కెవ్వఁడ? వీ లీలఁ ద్రిప్పెదు;
కరుణ నా పన్నులఁ గావ వేఁడి
యంభశ్చరంబైన హరివి నే నెఱిఁగితి;
నవ్యయ నారాయణాభిధాన
8-702.1-తే.
జనన సంస్థితి సంహార చతురచిత్త!
దీనులకు భక్తులకు మాకు దిక్కు నీవ;
నీదు లీలావతారముల్ నిఖిలభూత
భూతి హేతువుల్ మ్రొక్కెదఁ బురుషవర్య!

భావము:
“ఒక్క రోజులో నూరు యోజనాల మేర పెరిగిపోయావు. ఇలాంటి చేపలను మేము ఎప్పుడూ కనివిని ఎరుగము. ఝషజాతులకు ఎక్కడా ఇలాంటి శరీరం ఉండదు. నీవు ఎవరవు? ఎందుకోసం నన్ను తిప్పలమ్మట తిప్పుతున్నావు. దీనులను కాపాడటానికి ఈ మహా మీన రూపం ధరించిన నీవు విష్ణువే అని గతెలుసుకున్నాను. అచ్యుతా! నారాయణా! పురుషోత్తమా! లోకాలను సృష్టించి పోషించి లయం చేసుకునే మహానుభావుడవు నీవే. దీనులకు, భక్తులకు నీవే దిక్కు. మహిమాన్వితమైన నీ లీలావతారాలు సర్వ ప్రాణులకూ మేలు కలిగిస్తాయి. అటువంటి నీకు మ్రొక్కుతున్నాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=702

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: