Sunday, March 19, 2017

మత్స్యావతార కథ - 10:



8-707-వ.
మఱియు న న్నావ మున్నీటి కరళ్ళకు లోనుఁ గాకుండ, నిరుఁ గెలం కుల వెనుక ముందట నేమఱకుండఁ, బెన్నెఱుఁలగు నా గఱులన్ జడి యుచుఁ బొడువ వచ్చిన బలుగ్రాహంబుల నొడియుచు సంచరించెద; ఒక్క పెనుఁబాము చేరువ నా యనుమతిం బొడచూపెడు దానంజేసి సుడిగాడ్పుల కతంబున నావ వడిం దిరుగంబడకుండ నా కొమ్ము తుదిం పదిలము చేసి నీకునుఁ దపసులకును నలజడి చెందకుండ మున్నీట ని ప్పాటం దమ్మిచూలి రేయి వేగునంతకు మెలంగెద; నది కారణంబుగా జలచర రూపంబుఁ గయికొంటి; మఱియు నొక ప్రయోజనంబుఁ గలదు; నా మహిమ పరబ్రహ్మం బని తెలియుము; నిన్ను ననుగ్రహించితి" నని సత్యవ్రతుండు చూడ హరి తిరోహితుం డయ్యె; అయ్యవసరంబున.
8-708-ఆ.
మత్స్యరూపి యైన మాధవు నుడుగులుఁ
దలఁచికొనుచు రాచతపసి యొక్క
దర్భశయ్యఁ దూర్పుఁ దలగడగాఁ బండి
కాచి యుండె నాఁటి కాలమునకు.

భావము:
మత్స్యరూపం ధరించిన నేను ఆ ఓడ సముద్రం అలలకు దెబ్బతినకుండా అన్నివైపులా నా పెద్ద ఈకలతో కూడిన నా రెక్కలను కదిలిస్తూ ఉంటాను. నావను ముక్కలు చేయడానిక వచ్చే పెద్ద పెద్ద జలచరాలను తరిమేస్తూ ఉంటాను. ఒక పెద్ద పాము నా ఆజ్ఞానుసారం, అక్కడ కనిపిస్తుంది. సుడిగాలులకు నావ తిరగబడకుండా ఆ పాముతో నా కొమ్ముకొనకు ఆ నావను బంధించు. నీకూ మునీశ్వరులకూ చేటు వాటిల్లకుండా ఆ ప్రళయకాలం గడిచేంతవరకు నేను రక్షిస్తూ ఉంటాను. ఇందుకోసమే నేను ఈ మీనరూపం ధరించాను. ఇంకోక విశేష ప్రయోజనం కూడా ఉన్నది అనుకో. పరబ్రహ్మ స్వరూపమైన నా మహిమ తెలుసుకో. మరి నేను నిన్ను అనుగ్రహిస్తాను.” ఇలా పలికి శ్రీమన్నారాయణుడు ఆ సత్యవ్రత మహారాజు చూస్తుండగా అదృశ్యం అయ్యాడు. అలా శ్రీ మహా విష్ణువు చేప రూపంతో చెప్పిన విషయాలను తలచుకుంటూ, తపశ్శాలి అయిన సత్యవ్రత మహారాజు తూర్పువైపుగా తలగడ పెట్టుకుని దర్బల శయ్యమీద పరుండి మీన రూపుడు చెప్పిన ప్రళయ సమయం కోసం వేచి ఉన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=87&Padyam=708

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: