:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం
అందరం:
10.1-697-క.
నిను నే
శాసించిన కథ
మనమునఁ జింతించి రేపుమాపును గీర్తిం
చిన మనుజులు నీ భయమును
విను మెన్నడు బొంద రెందు విషవిజయముతోన్.
మనమునఁ జింతించి రేపుమాపును గీర్తిం
చిన మనుజులు నీ భయమును
విను మెన్నడు బొంద రెందు విషవిజయముతోన్.
10.1-698-మ.
ఇది మొద లెవ్వరైన నరు లీ యమునాతటినీ హ్రదంబులో
వదలక తోఁగి నన్ను నుపవాసముతోడఁ దలంచి కొల్చుచుం
గదలక దేవతాదులకుఁ గా జలతర్పణ మాచరించినన్
సదమలచిత్తులై దురితసంఘముఁ బాయుదు రా క్షణంబునన్.
వదలక తోఁగి నన్ను నుపవాసముతోడఁ దలంచి కొల్చుచుం
గదలక దేవతాదులకుఁ గా జలతర్పణ మాచరించినన్
సదమలచిత్తులై దురితసంఘముఁ బాయుదు రా క్షణంబునన్.
టీకా:
నినున్ = నిన్ను; నే = నేను; శాసించిన
= శిక్షించిన; కథ = వృత్తాంతము; మనమునన్
= మనసునందు; చింతించి = విచారించుకొని; రేపుమాపు = ప్రతిదినము; కీర్తించిన = స్తుతించినట్టి; మనుజులు = మానవులు; నీ =
నీ వలన; భయమును = భీతిని; వినుము
= వినుము; ఎన్నడున్ = ఎప్పుడును; పొందరు = పొందరు; ఎందున్
= ఎక్కడను; విష = విషమును; విజయము
= జయించుట; తోన్ = తోటి.
ఇది = ఇప్పటి; మొదలు = నుంచి; ఎవ్వరు
= ఎవరు; ఐనన్ = అయినను; నరులు
= మానవులు; ఈ = ఈ యొక్క; యమునాతటిన్
= యమునానదివద్ద; ఈ = ఈ యొక్క; హ్రదంబు
= మడుగు; లోన్ = అందు; వదలక =
పూని; తోగి = స్నానముచేసి; నన్నున్ = నన్ను; ఉపవాసము
= నిరాహారము; తోడన్ = తోటి; తలంచి
= ధ్యానించి; కొల్చుచున్ = సేవించుచు; కదలక = స్థిరముగా; దేవతలు
= దేవతలు; ఆదుల = మున్నగువారి; కున్ = కు; కాన్ =
అగునట్లు; జలతర్పణము = నీటినితృప్తికైసమర్పించుట; ఆచరించినన్ = చేసినచో; సత్ = మిక్కలి; అమల =
నిర్మలమైన; చిత్తులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; దురిత
= పాపముల; సంఘమున్ = సముదాయమును; పాయుదురు = వదలివేసెదరు; ఆ = ఆ; క్షణంబునన్
= క్షణమునందే.
భావము:
నిన్ను నేను శిక్షించిన ఈ కథను మనస్సులో
స్మరించి, ప్రతిరోజు పఠించే మనుషులు విషాన్ని జయించి
సురక్షితంగా ఉంటారు. వారు ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ ఇకపై మీ పాముల గురించి భయం పొందరు.
ఇప్పటి నుంచి ఈ యమునా నది మడుగులో
స్నానంచేసి, ఉపవాసం ఉండి, నన్ను
పూజించి, దేవతలు మొదలైన వారికి జలతర్పణాలు వదలిన వారెవరైనా
ఆ క్షణంలోనే నిర్మలమైన మనస్సు కల వారు అవుతారు, వారి
పాపాలన్నీ తత్క్షణమే తొలగి పోతాయి.
No comments:
Post a Comment