8-693-వ.
అని మునిజనంబులు సూతు నడిగిన నతం డిట్లనియె మీర లడిగిన యీ యర్థంబుఁ బరీక్షిన్నరేంద్రుం డడిగిన భగవంతుం డగు బాదరా యణి యిట్లనియె.
8-694-సీ.
విభుఁ డీశ్వరుఁడు వేదవిప్రగోసురసాధు;
ధర్మార్థములఁ గావఁ దనువుఁ దాల్చి,
గాలిచందంబున ఘనరూపములయందుఁ;
దనురూపములయందుఁ దగిలియుండు;
నెక్కువఁ దక్కువ లెన్నఁడు నొందక;
నిర్గుణత్వంబున నెఱియు ఘనుఁడు;
గురుతయుఁ గొఱఁతయు గుణసంగతివహించు;
మనుజేశ! చోద్యమే మత్స్య మగుట?
8-694.1-తే.
వినుము పోయిన కల్పాంతవేళఁ దొల్లి
ద్రవిళదేశపురాజు సత్యవ్రతుండు
నీరు ద్రావుచు హరిఁగూర్చి నిష్ఠతోడఁ
దపముఁ గావించె నొకయేటి తటము నందు.
భావము:
అంటూ మీనావతారం కథ వివరించమని శౌనకాదులు అడిగారు. అంతట సూతమహర్షి వారితో ఇలా అన్నాడు “మీరు అడిగినట్లే పరీక్షిత్తు అడిగితే, భగవత్స్వరూపుడు అయిన శుకమహర్షి ఇలా చెప్పాడు. “వినుము పరీక్షిత్తు మహారాజా! ప్రభువు అయిన విష్ణుమూర్తి వేదాలనూ, బ్రాహ్మణులనూ, గోవులనూ, దేవతలనూ, సజ్జనులనూ, ధర్మాన్నీ, అర్థాన్ని రకించడం కోసం అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. వాయువులాగే గొప్పరూపాలలోనూ, సూక్ష్రూపాలలోనూ చేరి ఉంటాడు. ఎక్కువ తక్కువలు లేని గుణరహితుడై శాశ్వత నిర్గుణ పరబ్రహ్మము అయినప్పటికీ, అతను గొప్పదనాన్నీ, తక్కువతనాన్నీ. గుణాల కలయికనూ పొందుతూ ఉంటాడు. అందువలన అతడు చేపరూపు ధరించి మత్స్యవతారం ధరించడంలో ఆశ్చర్యం లేదు. పోయిన కల్పం పూర్తి అవుతున్న సమయంలో సత్యవ్రతుడు అనే ద్రవిడదేశపు రాజు కేవలం నీళ్ళే ఆహారంగా తీసుకుంటూ నది గట్టుమీద విష్ణుని గూర్చి తపస్సు చేసేవాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=694
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment