Monday, March 27, 2017

మత్స్యావతార కథ - 15:

8-717-వ.
ఇట్లు వేదంబులు దొంగిలి దొంగరక్కసుండు మున్నీట మునింగిన, వాని జయింపవలసియు, మ్రానుదీఁగెల విత్తనంబుల పొత్తరలు పె న్నీట నాని చెడకుండ మనుపవలసియు నెల్ల కార్యంబులకుం గావలి యగునా పురుషోత్తముం డ ప్పెను రేయి చొరుదల యందు.
8-718-క.
కుఱుగఱులు వలుఁద మీసలు
చిఱుదోకయుఁ బసిఁడి యొడలు సిరిగల పొడలున్
నెఱి మొగము నొక్క కొమ్మును
మిఱుచూపులుఁ గలిగి యొక్క మీనం బయ్యెన్.

భావము:
ఈ విధంగా వేదాలను అపహరించుకు పోయి సముద్రంలో మునిగిన ఆ రాక్షసదొంగ హయగ్రీవుడిని జయించడం కోసమూ; వృక్షాలూ, తీగలూ అన్నింటి విత్తనాలు సమస్తం సముద్రంలో తడసిపోయి పాడయిపోకుండా రక్షించడం కోసమూ; జగత్తులోని సమస్త్ కార్యములకు స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువు ఆ ప్రళయకాల ఆరంభంలో మీనరూపం ధరించాడు.... అలా విష్ణుమూర్తి మత్యావతారం ఎత్తాడు. చిన్నచిన్న రెక్కలూ, పెద్దపెద్ద మీసాలూ, పొట్టితోకా, బంగారపు రంగు శరీరమూ, శ్రీకరమైన మచ్చలూ, చక్కని ముఖమూ, ఒక కొమ్మూ, మిరుమిట్లుగొలిపే చూపులు తోటి ఆ మహామత్య రూపం విరాజిల్లుతోంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=88&padyam=718

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: