8-695-వ.
మఱియు, నొక్కనాఁ డమ్మేదినీ కాంతుండు గృతమాలిక యను నేటి పొంత హరిసమర్పణంబుగా జలతర్పణంబు జేయు చున్న సమ యంబున నా రాజు దోసిట నొక్క మీనుపిల్ల దవిలివచ్చిన నులికిపడి, మరలం దరంగిణీ జలంబు నందు శకుల శాబకంబు విడిచె; నట్లు విడి వడి నీటిలో నుండి జలచరపోతంబు భూతలేశ్వరున కి ట్లనియె.
8-696-మత్త.
"పాటువచ్చిన జ్ఞాతి ఘాతులు పాపజాతి ఝషంబు లీ
యేటఁ గొండొక మీనుపిల్లల నేఱి పట్టి వధింప న
చ్చోటు నుండక నీదు దోసిలి చొచ్చి వచ్చిన నన్ను న
ట్టేటఁ ద్రోవఁగఁ బాడియే? కృప యింత లేక దయానిధీ!
భావము:
ఒకనాడు సత్యవ్రతుడు కృతమాలిక అనే నది వద్ద విష్ణువుకు ప్రీతి కలిగేలా నీళ్ళతో తర్పణం వదులు తున్నాడు. ఆ సమయంలో అతని దోసిలిలోనికి ఒక చేపపిల్ల వచ్చి చేరింది. అతను ఉలిక్కిపడి, ఆ చేపపిల్లను మరల నదినీటిలోకి వదలిపెట్టాడు. ఆ చేపపిల్ల నీటిలోనుండి రాజు సత్యవ్రతుడితో ఇలా అన్నది. “ఓ దయామయా! దయమాలి దాయాదులను చంపే పాపపు జాతి చేపలు ఈ ఏటిలో ఉన్నాయి. అవి చిన్న చేపలను పట్టి మింగేస్తాయి. అందుకే ఇక్కడ ఉండలేక నీ దోసిలి లోనికి వచ్చి చేరాను. దయలేకుండా ఇలా నన్ను నట్టేటిలో వదిలేయం న్యాయం కాదు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=696
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
2 comments:
"నచ్ఛోటు" - నచ్చోటు
ధన్యవాదాలండి
Post a Comment