Friday, March 10, 2017

మత్స్యావతార కథ - 1:

8-692-సీ.
విమలాత్మ! విన మాకు వేడ్క యయ్యెడి; మున్ను;
హరి మత్స్యమైన వృత్తాంతమెల్లఁ;
గర్మబద్ధుని భంగి ఘనుఁ డీశ్వరుఁడు లోక;
నిందితంబై తమోనిలయమైన
మీనరూపము నేల మే లని ధరియించె? ;
నెక్కడ వర్తించె? నేమి చేసె?
నాద్యమై వెలయు న య్యవతారమునకు నె;
య్యది కారణంబు? గార్యాంశ మెట్లు?
8-692.1-ఆ.
నీవు దగుదు మాకు నిఖిలంబు నెఱిఁగింపఁ
దెలియఁ జెప్పవలయు, దేవదేవు
చరిత మఖిలలోక సౌభాగ్య కరణంబు
గాదె? విస్తరింపు క్రమముతోడ.

భావము:
“సూతమహర్షి! నీవు బహునిర్మల హృదయం కలవాడవు. పూర్వం విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు కదా, ఆ కథ అంతా వినాలని బాగా ఆసక్తిగా ఉంది. కర్మానికి కట్టుబడి ఉండే జీవుడు లోకంలో గౌరవమూ, జ్ఞానమూ లేని చేపగా పుడుతూ ఉండవచ్చు గానీ, భగవంతుడు అయిన విష్ణుమూర్తి ఎందుకు అలాంటి చేపరూపు ఏదో మంచిది అన్నట్లు ధరించాడు? అలా ధరించి ఎక్కడ ఉన్నాడు? ఏమి కార్యాలు సాధించాడు? అవతారాలలో మొదటి వరుసలోది అయిన ఆ మీనావతారం ఎత్తడానికి కారణం ఏమిటి? దాని అవసరం ఏమిటి? ఇవన్నీ వివరంగా తెలుపడానికి నివే సమర్థుడవు. దేవాధిదేవుడు విష్ణుమూర్తి కథలు సకల లోకాలకూ మేలు చేకూర్చేవి కదా, కనుక ఈ వృత్తాంత సవివరంగా విశదీకరించు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=692

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: