7-400-శా.
ఉత్సాహంబున నొక్క పాఁడిమొదవై యూథంబు ఘ్రాణించుచున్
వత్సంబై తనవెంట బ్రహ్మ నడవన్ వైకుంఠుఁ డేతెంచి యు
ద్యత్సత్త్వంబునఁ గూపమధ్య రసముం ద్రావెన్ విలోకించుచుం
దత్సౌభాగ్యనిమగ్ను లై మఱచి రా దైత్యుల్ నివారింపఁగన్.
7-401-వ.
ఇట్లు విష్ణుండు మోహనాకారంబున ధేను వయి వచ్చి త్రిపుర మధ్య కూపామృతరసంబు ద్రావిన నెఱింగి శోకాకులచిత్తు లయిన రసకూపపాలకులం జూచి మహాయోగి యైన మయుండు వెఱఁగుపడి దైవగతిం జింతించి శోకింపక యిట్లనియె.
టీకా:
ఉత్సాహంబునన్ = వేడుకతో; ఒక్క = ఒక; పాడి = పాలిచ్చెడి; మొదవు = ఆవు; ఐ = అయ్యి; ఊథంబున్ = పొదుగును; ఘ్రాణించుచున్ = మూర్కొనుచు; వత్సంబు = దూడ; ఐ = అయ్యి; తన = తన; వెంటన్ = కూడ; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; నడవన్ = నడచిరాగా; వైకుంఠుండు = విష్ణుమూర్తి; ఏతెంచి = వచ్చి; ఉద్యత్సత్త్వంబునన్ = గొప్పగడుసుదనముతో; కూప = బావి; మధ్య = లోనున్న; రసమున్ = సిద్దరసమును; త్రావెన్ = తాగివేసెను; విలోకించుచన్ = చూచునుండి; తత్ = దాని; సొభాగ్య = చక్కదనమునందు; నిమగ్నులు = తగుల్కొన్నవారు; ఐ = అయ్యి; మఱచిరి = మరచిపోయిరి; ఆ = ఆ; దైత్యుల్ = రాక్షసులు; నివారింపగన్ = అడ్డగించుటను. ఇట్లు = ఈ విధముగ; విష్ణుండు = విష్ణుమూర్తి; మోహన = మోహింజేసెడి; ఆకారంబునన్ = ఆకారముతో; ధేనువు = ఆవు; అయి = అయ్యి; వచ్చి = వచ్చి; త్రిపుర = త్రిపురముల; మధ్య = నడిమి; కూప = బావియందలి; అమృత = అమృతపు; రసంబు = ద్రవమును; త్రావినన్ = తాగేయగా; ఎఱింగి = తెలిసికొని; శోక = దుఃఖముచే; ఆకుల = కలతబారిన; చిత్తులు = మనసులుగలవారు; అయిన = ఐన; రస = అమృతరసపు; కూప = బావి; పాలకులన్ = కాపలాదారులను; చూచి = చూసి; మహా = గొప్ప; యోగి = యోగబలముగలవాడు; ఐన = అయిన; మయుండు = మయుడు; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; దైవగతిన్ = విధివిలాసమును; చింతించి = విచారించి; శోకింపక = దుఃఖింపక; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:
విష్ణుమూర్తి ఉత్సాహవంతమైన అందమైన పాడి ఆవు అయ్యాడు. బ్రహ్మదేవుడు ఆ పాడి ఆవు పొదుగు చుంబించే చిన్నారి ఆవుదూడగా మారాడు. ఆ ఆవుదూడలు జగన్మోహనంగా ఉన్నాయి. అవి మెల్లమెల్లగా వచ్చి ఆ సిద్ధబావిలోని సిద్ధరసం త్రాగుతున్నాయి. దానిని కాపలా కాస్తున్న రాక్షస భటులు వాటి అందచందాలు చూస్తూ వాటిని తోలటమే మరచిపోయారు. ఆవు దూడలు ఆ కూపంలోని సిద్ధరసం అంతా పూర్తిగా త్రాగేశాయి. అలా విష్ణుమూర్తి మోహనాకారంలో పాడిఆవుగా వచ్చి త్రిపురాల మధ్య గల బావిలోంచి సిద్ధరసం అంతా త్రాగేసిన విషయం తెలుసుకుని, ఆ కూపపాలకులు గుండెలు బాదుకుని దుఃఖించారు. వారిని చూసి మహాయోగి అయిన మయుడు జరిగినది తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అది విధివిలాసంగా గ్రహించి దుఃఖించక ఇలా అన్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=400
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment