Sunday, January 31, 2016

ప్రహ్లాదుని జన్మంబు - ఆడుదము

7-248-క.
డుదము మనము హరిరతిఁ
బాడుద మే ప్రొద్దు విష్ణుద్రయశంబుల్
వీడుదము దనుజసంగతిఁ
గూడుదము ముకుందభక్తికోటిన్ సూటిన్.
7-249-క.
విత్తము సంసృతిపటలము 
వ్రత్తము కామాదివైరిర్గంబుల నేఁ
డిత్తము చిత్తము హరికిని
జొత్తము నిర్వాణపదము శుభ మగు మనకున్."
టీకా:
          ఆడుదము = ఆడుకొనెదము; మనము = మనము; హరి = విష్ణుని యందలి {హరి - భక్తుల హృదయమును ఆకర్షించువాడు, విష్ణువు}; రతిన్ = ప్రీతిచేత; పాడుదము = పాడుదము; ఏ = అన్ని; ప్రొద్దున్ = వేళనైనను; విష్ణు = హరి; భద్ర = మంగళకరములైన; యశంబుల్ = కీర్తులు; వీడుదము = వదలివేసెదము; దనుజ = రాక్షసులతోడి; సంగతిన్ = చెలిమిని, సాంగత్యమును; ముకుంద = విష్ణుని {ముకుందుడు - ముక్తిని యిచ్చువాడు, విష్ణువు}; భక్తి = భక్తుల; కోటిన్ = సమూహమును; సూటిన్ = సూటిగా.
          విత్తము = విడగొట్టెదము; సంసృతి = సంసార; పటలమున్ = కూటమిని; వ్రత్తము = చీల్చెదము; కామాదివైరివర్గంబులన్ = అరిషడ్వర్గములను {అరిషడ్వర్గములు - 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు యనెడి ఆరుశత్రువులకూటములు}; నేడు = ఇప్పుడు; ఇత్తము = అప్పజెప్పెదము; చిత్తము = మనస్సును; హరి = విష్ణుని; కిని = కి; చొత్తము = చేరుదము; నిర్వాణపదమును = పరమపదమును; శుభము = క్షేమము; అగున్ = కలుగును; మన = మన; కున్ = కు.
భావము:
            మనం శ్రీహరి మీది చిత్తముతో ఆడుకుందాం రండి. మాధవుడిని మనసు నిండా నింపుకుని హరిసంకీర్తనలు పాడుకుందాం. మిగిలిన రాక్షసుల స్నేహం విడిచిపెడదాం. నిర్భయంగా విష్ణుభక్తులతో చేరిపోదాం రండి. ఆనందిద్దాం ఎల్లప్పుడు.
            ఈ సంసారం అనే మాయా బంధాన్ని తొలగించుకుందాం. అరిషడ్వర్గాలు అనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఈ ఆరు శత్రువర్గాలను చీల్చి చెండాడుదాం. చిత్తం శ్రీహరికి సమర్పిద్దాం. కైవల్య పదాన్ని అందుకుందాం. మనకు తప్పక శుభం కలుగుతుంది."

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Saturday, January 30, 2016

ప్రహ్లాదుని జన్మంబు - తెం డెల్ల పుస్తకంబులు

7-247-క.
తెం డెల్ల పుస్తకంబులు
నిం డాచార్యులకు మరల నేకతమునకున్
రండు విశేషము చెప్పెదఁ
బొం డొల్లనివారు కర్మపుంజము పాలై.
టీకా:
తెండు = తీసుకురండి; ఎల్ల = అన్ని; పుస్తకంబులున్ = పుస్తకములను; ఇండు = ఇవ్వండి; ఆచార్యున్ = గురువు; కున్ = కు; మరల = మళ్ళీ; ఏకతమున్ = ఏకాంతముల, కూడుటకు; కున్ = కు; రండు = రండి; విశేషమున్ = ప్రత్యేకతగలదానిని; చెప్పెదన్ = తెలిపెదను; పొండు = వెళ్ళిపోండి; ఒల్లని = అంగీకరించని; వారు = వారు; కర్మ = కర్మముల; పుంజము = సమూహమునకు; పాలు = లోబడి; ఐ = పోయి.
భావము:
            ఆ పుస్తకాలు అన్నీ తెచ్చి గురువులకు ఇచ్చేసి రండి. మళ్ళీ మనం ఏకాంతంగా కూర్చుందాం. ఇంకా చాలా మంచి విషయాలు చెప్తాను. ఇష్టంలేనివాళ్ళు వెళ్ళండి. మీ కర్మలు మీరు అనుభవించండి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Friday, January 29, 2016

ప్రహ్లాదుని జన్మంబు - గురువులు దమకును

7-246-క.
గురువులు దమకును లోఁబడు
తెరువులు చెప్పెదరు విష్ణు దివ్యపదవికిం
దెరువులు చెప్పరు; చీఁకటిఁ
రువులు పెట్టంగ నేలబాలకులారా!
టీకా:
గురువులు = గురువులు; తమ = తమ; కును = కు; లోబడు = తెలిసిన; తెరువులు = జాడలను; చెప్పెదరు = చెప్పెదరు; విష్ణు = విష్ణుమూర్తి యొక్క {విష్ణువు - (విశ్వమున) వ్యాపించి యుండువాడు, హరి}; దివ్య = దివ్యమైన; పదవికిన్ = స్థానమున; కిన్ = కు; తెరువున్ = దారి; చెప్పరు = తెలుపరు; చీకటిన్ = చీకటిలో; పరువులు = పరుగులు; పెట్టంగన్ = దీయుట; ఏలన్ = దేనికి; బాలకులారా = బాలలూ.
భావము:
            బాలలూ! మీ అమాయకత్వం వదలండి. మన ఉపాధ్యాయులు వారికి తెలిసిన చదువులే చెప్పగలరు; చెప్తున్నారు. అంతే కాని దివ్యమైన శ్రీహరి సాన్నిధ్యం పొందటానికి అవసరమైన మార్గాలు చెప్పరు. మనం ఈ గుడ్డి చదువులు చదివి వారి వెంట అజ్ఞానం అనే చీకటిలో పరుగెత్తటం దేనికి? చెప్పండి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Thursday, January 28, 2016

ప్రహ్లాదుని జన్మంబు - దనుజ భుజగ

7-245-ఆ.
నుజ భుజగ యక్ష దైత్య మృగాభీర
సుందరీ విహంగ శూద్ర శబరు
లైనఁ బాపజీవు లైన ముక్తికిఁ బోదు
ఖిల జగము విష్ణుఁ నుచుఁ దలఁచి.
టీకా:
దనుజ = రాక్షసులు; భుజగ = సర్పములు; యక్ష = యక్షులు; దైత్య రాక్షసులు; మృగ జంతువులు; ఆభీర ఆభీరదేశపు; సుందరీ స్త్రీలు; విహంగ పక్షులు; శూద్ర = శూద్రులు; శబర = శబరులు, ఎఱుకలు; ఐన = అయిన; పాప = పాపములుచేసినవారైను; జీవులు ప్రాణులు; ఐన అయినను; ముక్తి = పరమపదమున; కిన్ = కి; పోదురు = వెళ్ళెదరు; అఖిల = సమస్తమైన; జగమున్ = విశ్వము; విష్ణుడు = విష్ణుమూర్తి; అనుచున్ = అనుచు; తలచి = భావించి.
భావము:
            దనుజులు, రాక్షసులు, నాగులు, యక్షులు, దైత్యులు, జంతువులు, గొల్లలు, స్త్రీలు, శూద్రులు, శబరులు, ఇంకా ఏ జాతి వారైనా సరే,ఏ పాపజీవనులు అయినా సరే సర్వం విష్ణుమయం జగత్ అని మనసారా తలచినట్లైతే చాలు, ముక్తిని పొందుతారు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Wednesday, January 27, 2016

ప్రహ్లాదుని జన్మంబు - చాలదు

7-244-క.
చాదు భూదేవత్వము
చాదు దేవత్వ మధిక శాంతత్వంబుం
జాదు హరి మెప్పింప వి
శాలోద్యములార! భక్తి చాలిన భంగిన్.
టీకా:
చాలదు = సరిపడదు; భూదేవత్వమున్ = బ్రాహ్మణత్వము; చాలదు = సరిపడదు; దేవత్వము = దేవత్వము; అధిక = మిక్కిలి; శాంతత్వంబున్ = సాధుస్వభావము; చాలదు = సరిపోదు; హరిన్ = నారాయణుని; మెప్పింపన్ = మెచ్చునట్లు చేయుటకు; విశాల = గొప్ప; ఉద్యములారా = యత్నముకలవారలారా; భక్తి = భక్తి; చాలిన = సరిపడిన; భంగిని = విధముగ.
భావము:
మంచి శ్రద్ధ గల బాలకులారా! విష్ణువును మెప్పించడానికి భక్తి సరిపోయినట్లు, బ్రాహ్మణత్వం సరిపోదు, దైవత్వం సరిపోదు, గొప్ప శాంత స్వభావమూ చాలదు. విష్ణుదేవుని ప్రసన్నం చేసుకోడానికి భక్తి ఒక్కటే ఉత్తమమైన మార్గం,
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Tuesday, January 26, 2016

ప్రహ్లాదుని జన్మంబు - చిక్కఁడు

7-243-క.
చిక్కఁడు వ్రతములఁ గ్రతువులఁ
జిక్కఁడు దానముల శౌచశీలతపములం
జిక్కఁడు యుక్తిని భక్తిని
జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండీ!
టీకా:
చిక్కడు = దొరకడు; వ్రతములన్ = వ్రతములచేత; క్రతువులన్ = యజ్ఞములుచేత; చిక్కడు = దొరకడు; దానములన్ = దానములుచేయుటచేత; శౌచ = శుచి శుభ్రముల; శీల = మంచినడవడికల; తపములన్ = తపస్సులచేత; చిక్కడు = దొరకడు; యుక్తిని = తెలివిచేత; భక్తిని = భక్తివలన; చిక్కిన = దొరకిన; క్రియన్ = వలె; అచ్యుతుండు = హరి {అచ్యుతుడు - చ్యుతము (జారిపోవుట) లేనివాడు, విష్ణువు}; సిద్ధము = సత్యము; సుండీ = సుమా.
భావము:
భగవంతుడు గాఢ మైన భక్తికి వశమై నట్లు; నోములు, యగాలు, దానాలు, శుచిత్వాలు, మంచి నడవడికలు, తపస్సులు, యుక్తులు లాంటివి వాటికి వేటికీ వశము కాడు. భక్తి ఒక్కటే ఆ స్వామిని పొందడానికి సాధనం. భక్తి వినా వేరు మార్గం లేనే లేదు. 
దిగజారిపోవడమే లేనట్టి ఉన్నతతమ శాశ్వత స్థితిలో ఉండే భగవంతుడు ఇంకే మార్గంలో పట్టుకుందా మన్నా, బిగించే కొద్దీ వేళ్ళ మధ్యనుండి జారిపోయే నీళ్ళలా జారి పోతుంటాడు. భక్తికి అయితేనే భద్రంగా చిక్కుతాడు. 
ఈ పద్యం ఎంతో గొప్పది అని చెప్పవచ్చు. భాగవత తత్వార్థాన్ని చిన్న చిన్న పదాల్లో సిద్దాంతీకరించి భక్తాగ్రేసరు డైన రాక్షసబాలుని నోట ఈ పద్యం రూపంలో ఇలా పలికించాడు పోతన గారు. ప్రహ్లాదుడు సహాధ్యాయులు అయిన రాక్షసబాలురకు తన ప్రపత్తిమార్గ మైన నారదోపదిష్ట భాగవతతత్వాన్ని తెలిపి విష్ణుభక్తి విలక్షణత వివరించాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Monday, January 25, 2016

ప్రహ్లాదుని జన్మంబు - దానవ దైత్య

7-242-క.
దావ దైత్య భుజంగమ
మావ గంధర్వ సుర సమాజములో ల
క్ష్మీనాథు చరణకమల
ధ్యానంబున నెవ్వఁడయిన న్యత నొందున్.
టీకా:
దానవ = దానవులు; దైత్య = దితిజులు; భుజంగమ = నాగులు; మానవ = మానవులు; గంధర్వ = గంధర్వులు; సుర = దేవతలయొక్క; సమాజము = సమూహముల; లోన్ = అందు; లక్ష్మీనాథు = నారాయణుని {లక్ష్మీనాథడు - లక్ష్మీదేవికి భర్త, విష్ణువు}; చరణ = పాదములనెడి; కమల = పద్మముల; ధ్యానంబునన్ = చింతనముచేత; ఎవ్వడు = ఎవడు; అయినన్ = అయినను; ధన్యతన్ = కృతార్థత్వంబును; ఒందున్ = పొందును.
భావము:
శ్రీహరి పాదపద్మాలను సేవిస్తే చాలు, దానవులు, దైత్యులు, సర్పరాజులు, మానవులు, గంధర్వులు, దేవతలు ఎవరైనా సరే, పుణ్యాత్ములు అవుతారు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Sunday, January 24, 2016

ప్రహ్లాదుని జన్మంబు - కావున, రాగాదియుక్త

7-241-వ.
కావున, రాగాదియుక్త మనస్కుం డయిన శరీరికి సంసారచక్రనివర్తకం బయిన హరిచింతనంబు బ్రహ్మమందలి నిర్వాణసుఖం బెట్టిదట్టి దని బుధులు దెలియుదురు; హరిభజనంబు దుర్గమంబుగాదు; హరి సకల ప్రాణిహృదయంబుల యందు నంతర్యామియై యాకాశంబు భంగి నుండు; విషయార్జనంబుల నయ్యెడిది లేదు; నిమిషభంగుర ప్రాణు లయిన మర్త్యులకు మమతాస్పదంబులును జంచలంబులును నైన పుత్ర మిత్ర కళత్ర పశు భృత్య బల బంధు రాజ్య కోశ మణి మందిర మంత్రి మాంతంగ మహీ ప్రముఖ విభవంబులు నిరర్థకంబులు; యాగ ప్రముఖ పుణ్యలబ్దంబు లైన స్వర్గాదిలోక భోగంబులు పుణ్యానుభవక్షీణంబులు గాని నిత్యంబులు గావు; నరుండు విద్వాంసుండ నని యభిమానించి కర్మంబు లాచరించి యమోఘంబు లయిన విపరీత ఫలంబుల నొందు; కర్మంబులు గోరక చేయవలయు; కోరి చేసిన దుఃఖంబులు ప్రాపించు; పురుషుండు దేహంబుకొఱకు భోగంబుల నపేక్షించు; దేహంబు నిత్యంబు కాదు తోడ రాదు; మృతం బైన దేహంబును శునకాదులు భక్షించు; దేహి కర్మంబు లాచరించి కర్మబద్ధుండయి క్రమ్మఱం గర్మానుకూలంబయిన దేహంబుఁ దాల్చు; అజ్ఞానంబునం జేసి పురుషుండు కర్మదేహంబుల విస్తరించు; అజ్ఞాన తంత్రంబులు ధర్మార్థ కామంబులు; జ్ఞాన లభ్యంబు మోక్షంబు; మోక్షప్రదాత యగు హరి సకల భూతంబులకు నాత్మేశ్వరుండు ప్రియుండు; తన చేత నయిన మహాభూతంబులతోడ జీవసంజ్ఞితుండై యుండు; నిష్కాములై హృదయగతుం డయిన హరిని నిజభక్తిని భజింపవలయు.
టీకా:
కావునన్ = కనుక; రాగాది = రాగద్వేషాదులతో {రాగద్వేషాదులు - 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 10అసూయ 11దంభము 12దర్పము 13అహంకారము}; యుక్త = కూడిన; మనస్కుండు = మనసుగలవాడు; అయిన = ఐన; శరీరి = జీవుని, దేహి; కిన్ = కి; సంసార = సంసారమనెడి; చక్ర = చక్రమునుండి; నివర్తకంబు = మరలజేయునది; అయిన = ఐన; హరి = నారాయణుని; చింతనంబు = ధ్యానము; బ్రహ్మము = పరబ్రహ్మము; అందలి = లోని; నిర్వాణ = మోక్షము యొక్క; సుఖంబున్ = సుఖము; ఎట్టిద = ఎలాంటిదో; అట్టిది = అలాంటిది; అని = అని; బుధులు = జ్ఞానులు; తెలియుదురు = తెలిసి యుందురు; హరి = నారాయణుని {హరి - భక్తుల హృదయములను ఆకర్షించువాడు, విష్ణువు}; భజనంబు = సేవ; దుర్గమంబు = పొందరానిది; కాదు = కాదు; హరి = విష్ణువు; సకల = అఖిలమైన; ప్రాణి = జీవుల; హృదయంబుల్ = హృదయముల; అందున్ = లోను; అంతర్యామి = లోన వ్యాపించినవాడు; ఐ = అయ్యి; ఆకాశంబు = ఆకాశము; భంగిన్ = వలె; ఉండున్ = ఉండును; విషయ = ఇంద్రియార్థముల, భోగముల; ఆర్జనంబులన్ = సంపాదించుటవలన; అయ్యెడిది = కలిగెడి లాభము; లేదు = లేదు; నిమిష = రెప్పపాటులో; భంగుర = చెడిపోవు; ప్రాణులు = ప్రాణములుగలవారు; అయిన = ఐన; మర్త్యుల్ = మానవుల {మర్త్యులు - మరణించెడి నైజముగలవారు, మనుషులు}; కున్ = కు; మమతా = నాదియనెడి మోహమునకు; ఆస్పదంబులు = స్థానములైనవి; చంచలంబులు = అస్థిరములు {చంచలములు - మిక్కిలి చలించెడివి, అస్థిరములు}; ఐన = అయిన; పుత్ర = సంతానము; మిత్ర = స్నేహితులు; కళత్ర = భార్యలు; పశు = గొడ్లు; భృత్య = సేవకులు; బల = సైన్యము; బంధు = చుట్టములు; రాజ్య = రాజ్యాధికారము; కోశ = కోశాగారము; మణి = రత్నాదులు; మందిర = భవనములు; మంత్రి = సచివులు; మాతంగ = ఏనుగులు {మాతంగము - మతంగజము, మతంగుడను ఋషివలన పుట్టినది, ఏనుగు}; మహీ = రాజ్యము, భూములు; ప్రముఖ = మొదలగు ముఖ్యమైన; విభవంబులు = వైభవములు; నిరర్థకంబులు = ప్రయోజనములేనివి; యాగ = యజ్ఞములు; ప్రముఖ = మొదలగు ముఖ్యమైన; పుణ్య = పుణ్యములవలన; లబ్దంబులు = దొరకునవి; ఐన = అయిన; స్వర్గ = స్వర్గవాసము; ఆది = మొదలగు; భోగంబులు = భోగములు; పుణ్య = పుణ్యములకు; అనుభవ = అనుభవించుటచే; క్షీణంబులు = తగ్గించెడివి; కాని = తప్పించి; నిత్యంబులు = శాశ్వతములు; కావు = కావు; నరుండు = మానవుడు; విద్వాంసుడను = తెలిసినవాడను; అని = అని; అభిమానించి = అహంకరించి; కర్మంబుల్ = కర్మములను; ఆచరించి = చేసి; అమోఘంబులు = వ్యర్థముగానివి; అయిన = ఐన; విపరీత = ప్రతికూలమైన; ఫలంబులన్ = ఫలితములను; ఒందు = పొందును; కర్మంబులున్ = కర్మలను; కోరక = ఫలాపేక్షలేక; చేయవలయున్ = చేయవలయును; కోరి = ఫలమపేక్షించి; చేసినన్ = చేసినట్లయినచో; దుఃఖంబులు = దుఃఖములు; ప్రాపించున్ = పొందును; పురుషుండు = మానవుడు; దేహంబున్ = శరీరము; కొఱకున్ = కోసము; భోగంబులన్ = స్రక్చందనాదులు {భోగాష్టకములు - 1పుష్పమాలిక 2గంధము 3వస్త్రము 4అన్నము 5శయ్య 6తాంబూలము 7స్త్రీ 8గానములు, స్రక్చందనాదులు}; అపేక్షించి = కోరి; అపేక్షించును = కావాలని కోరును; దేహంబున్ = శరీరము; నిత్యంబు = శాశ్వతమైనది; కాదు = కాదు; తోడన్ = మరణించిన జీవుని వెంబడి; రాదు = రాదు; మృతంబు = ప్రాణములుబాసినది; ఐన = అయిన; దేహంబును = దేహమును; శునక = కుక్కలు; ఆదులు = మొదలగునవి; భక్షించున్ = తినును; దేహి = జీవుడు; కర్మంబులు = కర్మలను; ఆచరించి = చేసి, కూడిచరించి; కర్మ = కర్మములకు; బద్ధుండు = కట్టబడినవాడు; అయి = అయ్యి; క్రమ్మఱన్ = మరల; కర్మా = కర్మములు చేయుటకు; అనుకూలంబు = తగినవి; అయిన = ఐన; దేహంబున్ = శరీరమును; తాల్చున్ = ధరించును; అజ్ఞానంబునన్ = తెలియకపోవుట; చేసి = వలన; పురుషుండు = మానవుడు; కర్మ = కర్మములను; దేహంబులన్ = శరీరములను; విస్తరించున్ = పెంచుకొనును; అజ్ఞాన = అజ్ఞానముచేత; తంత్రంబులు = నడపబడునవి; ధర్మార్థకామంబులు = ధర్మార్థకామములు; జ్ఞాన = జ్ఞానముచేత; లభ్యంబు = దొరకునది; మోక్షంబు = ముక్తిపదము; మోక్ష = పరమపదమును; ప్రదాత = ఇచ్చువాడు; అగు = అయిన; హరి = విష్ణువు; సకల = సమస్తమైన; భూతంబుల్ = జీవుల; కున్ = కు; ఆత్మేశ్వరుండు = ఆత్మరూపుడైన ప్రభువు; ప్రియుండు = మిక్కిలి ఇష్ఠమైనవాడు; తన = తన; చేతన్ = వలన; అయిన = కల్పితములైన; మహాభూతంబుల్ = భూతపంచకంబు {మహాభూతములు - 1భూమి 2నీరు 3వాయువు 4అగ్ని 5 ఆకాశము అనెడి ఐదు భూతములు}; తోడన్ = తోటి; జీవ = జీవుడు యనెడి; సంజ్ఞితుండు = పేరుగలవాడు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; నిష్కాములు = కోరికలులేనివారు; ఐ = అయ్యి; హృదయ = హృదయమునందు; గతుండు = ఉన్నవాడు; అయిన = ఐన; హరిని = విష్ణుని; నిజ = అచ్చపు; భక్తిని = భక్తితో; భజింపవలయున్ = సేవింపవలయును.
భావము:
కాబట్టి, రాగాదులతో బద్ధుడై కోరికల వలలో పడిన మానవుడికి ఈ సంసార చక్రాన్ని ఛేదించాలి అంటే విష్ణు సంకీర్తన ఒక్కటే ఉపాయం. “పరబ్రహ్మంతో ఐక్యం అయితే అనుభవించే ఆనందం ఎంతటిదో, అంతటి ఆనందాన్ని శ్రీహరి ఆరాధన అందిస్తుంది” అని పండితులు చెప్తారు. మాధవుడిని సేవించటం కష్టమైన పని కాదు. విష్ణువు సమస్త ప్రాణుల హృదయాలలో అంతర్యామి అయి ఆకాశం వలె వ్యాపించి ఉంటాడు. సిరి సంపదలు సంపాదించటం వలన ఏమాత్రం సుఖం లేదు. మానవుల జీవితాలు క్షణభంగురాలు. ఇలాంటి మానవులకు మమత, అనుబంధాలు, పెంచే భార్యాపిల్లలు, బంధుమిత్రులు, మడిమాన్యాలు, పాడిపంటలు, రాజ్య కోశాలు, మణిమందిరాలు, మంత్రులు, మత్తేభాలు మొదలైనవి అన్ని అనవసరమైనవి, అస్థిరమైనవి. యజ్ఞ యాగాదుల వలన లభించే స్వర్గ సుఖాలు శాశ్వతాలు కావు, అవి పుణ్యం క్షీణించగానే నశించేవే. తాను ఘనుడను అనుకుని, మానవుడు తనపై తాను అభిమానం పెంచుకుని, వివిధ కర్మలు ఆచరించి విపరీతమైన ఫలితాలు విశేషంగా పొందుతాడు. కోరికలతో చేసే కర్మలన్నీ దుఃఖాలనే కలిగిస్తాయి. కనుక, ఎటువంటి కోరికలు లేకుండా కర్మలు ఆచరించాలి. దేహం ధరించినవాడు దేహి, దేహి తన దేహం కోసం భోగాలు కోరుకుంటాడు. కానీ, దేహం శాశ్వతమైనది కాదు, తనతో వచ్చేదీ కాదు. ప్రాణం పోగానే ఈ శరీరం కుక్కలు, నక్కలు పాలవటానికి పనికి వస్తుంది అంతే. దేహం ధరించిన వ్యక్తి కర్మలను చేసి, ఆ కర్మలకు బద్ధుడు అయిపోతాడు. మరల ఆ చేసిన కర్మలకు అనుకూలమైన దేహం ధరిస్తాడు. అజ్ఞానం వలన కర్మలు అధికంగా చేయటం, మరల మరల దేహాలు ధరిస్తూ ఉండటం. ఇలా కర్మ దేహాలలో పురుషుడు సంచరిస్తూ ఉంటాడు. అజ్ఞానంతో కూడిన కర్మలు ధర్మార్థకామాలను మాత్రమే అందిస్తాయి. జ్ఞానం ఒక్కటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆ మోక్షాన్ని అందించేవాడు విష్ణువు మాత్రమే. సర్వ ప్రాణికోటికి ఆ మోక్షప్రదాత అయిన శ్రీహరే ఆత్మేశ్వరుడు, ప్రియుడు. తన చేత సృష్టించబడిన పంచభూతాలతో కూడిన వాడై ఆ పరమాత్మే “జీవుడు” అనబడతాడు. కాబట్టి, ప్రతి వ్యక్తీ తమ హృదయంలో ఉండే ఆ భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో నిస్వార్థంగా సేవించాలి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Saturday, January 23, 2016

ప్రహ్లాదుని జన్మంబు - దనుజారి

7-240-సీ.
నుజారి లీలావతారంబు లందలిశౌర్యకర్మంబులు ద్గుణములు
విని భక్తుఁ డగువాఁడు వేడ్కతోఁ బులకించి; న్నుల హర్షాశ్రుణము లొలుక
ద్గదస్వరముతోఁ మలాక్ష! వైకుంఠ!; రద! నారాయణ! వాసుదేవ! 
నుచు నొత్తిలిపాడునాడు; నాక్రోశించు; గుఁ; జింతనము జేయుతి యొనర్చు;
7-240.1-తే.
రులు కొని యుండుఁ; దనలోన మాటలాడు; వేల్పు సోఁకిన పురుషుని వృత్తి దిరుగు;
బంధములఁ బాసి యజ్ఞానటలిఁ గాల్చి; విష్ణుఁ బ్రాపించుఁ; దుది భక్తి వివశుఁ డగుచు.
టీకా:
దనుజారి = నారాయణుని; లీలా = వేడకకొఱకైన; అవతారంబులు = అవతారముల; అందలి = లోని; శౌర్య = పరాక్రమపు; కర్మంబులు = చేతలు; సద్గుణములు = మంచిగుణములు; విని = విని; భక్తుడు = ప్రపన్నుడు; అగువాడు = అయ్యెడివాడు; వేడ్కన్ = కౌతుకము; తోన్ = తోటి; పులకించి = గగుర్పాటుచెంది; కన్నులన్ = కళ్ళనుండి; హర్ష = ఆనందపు; అశ్రు = కన్నీటి; కణములు = బిందువులు; ఒలుకన్ = జాలువారగా; గద్గద = డగ్గుతిక; స్వరము = గొంతు; తోన్ = తోటి; కమలాక్ష = హరి {కమలాక్షుడు - కమలములవంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; వైకుంఠ = హరి {వైకుంఠుడు - కుంఠము(ఓటమి) లేనివాడు, హరి}; వరద = హరి {వరద - వరములను యిచ్చువాడు, విష్ణువు}; నారాయణ = హరి {నారాయణ - శబ్దములకు ఆధారభూతుడైన వాడు, విష్ణువు}; వాసుదేవ = హరి {వాసుదేవ - వసుదేవునికొడుకు, విష్ణువు}; అనుచున్ = అనుచు; ఒత్తిలి = గట్టిగా; పాడున్ = పాడును; ఆడున్ = నాట్యముచేయును; ఆక్రోశించున్ = వాపోవును; నగున్ = నవ్వును; చింతనము = ధ్యానము; చేయును = చేయును; నతిన్ = మ్రొక్కుట; ఒనర్చున్ = చేయును. 
మరులుకొని = మోహము చెంది; ఉండున్ = ఉండును; తనలోన = తనలోతనే; మాటలాడున్ = మాట్లాడుకొనును; వేల్పు = దయ్యము, పూనకము; సోకిన = పట్టిన, వచ్చిన; పురుషుని = మానవుని; వృత్తిన్ = విధముగ; తిరుగున్ = వర్తించును; బంధములన్ = సాంసారిక బంధనములను; పాసి = తొలగించుకొని; అజ్ఞాన = అవిద్యా; పటలిన్ = సమూహమును; కాల్చి = మసిచేసి; విష్ణున్ = విష్ణుమూర్తిని; ప్రాపించున్ = చెందును, లీనమగును; తుదిన్ = చివరకు; భక్తి = భక్తివలన; వివశుడు = మైమరచినవాడు; అగుచు = అయిపోతూ.
భావము:
            భగవంతుని లీలావతారాలలోని పరాక్రమ గాథలు విని భక్తుడైనవాడు పొంగిపోతాడు. సుగుణాలు విని పులకరించి పోతాడు. భక్తి పారవశ్యంతో కళ్ళలో ఆనందభాష్పాలు ఒలుకుతుండగా గద్గద కంఠంతో “కమలాక్షా! వైకుంఠా! వరదా! నారాయణా! వాసుదేవా!” అని గొంతెత్తి పాడతాడు. ఆడతాడు. అరుస్తాడు. నవ్వుతాడు. ఇంకా నమస్కరిస్తాడు. ఎప్పుడు ఆ దేవుడిమీద మోహం కలిగి ఉంటాడు. తనలో తానే మాట్లాడుకుంటాడు. అంతే కాదు దయ్యం పట్టినట్లు తిరుగుతాడు. ఇట్లు భక్తి తత్పరుడు అయి ఉండి, చివరకు కర్మబంధాలను విడిచి, అజ్ఞానం తొలగించుకుని, భక్తి వివశుడై, విష్ణువు నందు ఐక్యం అవుతాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :