78- వ.
అని రుక్మిణీదేవిని
హరి యూరడించె; నంత బలభద్ర ప్రముఖులైన యదువీరులు ప్రళయవేళ
మిన్నునం బన్ని బలుపిడుగు లడరించు పెనుమొగుళ్ళ వడువున జరాసంధాది పరిపంథి రాజచక్రంబు
మీఁద నవక్ర పరాక్రమంబున శిఖిశిఖా సంకాశ నిశిత శిలీముఖ నారాచ ప్రముఖంబులైన బహువిధ
బాణపరంపరలు గురియ నదియును విదళిత మత్త మాతంగంబును, విచ్ఛిన్న
తురంగంబును విభిన్న రథవరూధంబును, వినిహత పదాతి యూధంబును,
విఖండిత వాహ వారణ రథారోహణ మస్తకంబును, విశకలిత
వక్షోమధ్య కర్ణ కంఠ కపోల హస్తంబును, విస్ఫోటిత కపాలంబును,
వికీర్ణ కేశజాలంబును, విపాటిత చరణ జాను
జంఘంబును, విదళిత దంత సంఘంబును, విఘటిత
వీరమంజీర కేయూరంబును, విభ్రష్ట కుండల కిరీట హారంబును,
విశ్రుత వీరాలాపంబును, విదార్యమాణ గదాకుంత
తోమర పరశు పట్టిస ప్రాస కరవాల శూల చక్ర చాపంబును, వినిపాతిత
కేతన చామర ఛత్రంబును, విలూన తనుత్రాణంబును, వికీర్యమాణ ఘోటకసంఘ రింఖాసముద్ధూత ధరణీపరాగంబును, వినష్ట
రథ వేగంబును, వినివారిత సూత మాగధ వంది వాదంబును, వికుంఠిత హయహేషా పటహ భాంకార కరటిఘటా ఘీంకార రథనేమి పటాత్కార తురగ నాభిఘంటా
ఘణఘణాత్కార వీరహుంకార భూషణ ఝణఝణాత్కార నిస్సాణ ధణధణాత్కార మణినూపుర క్రేంకార
కింకిణీ కిణకిణాత్కార శింజనీటంకార భట పరస్పరధిక్కార నాదంబును, వినిర్భిద్యమాన రాజ సమూహంబును, విద్యమాన రక్తప్రవాహంబును,
విశ్రూయమాణ భూతబేతాళ కలకలంబును, విజృంభమాణ
ఫేరవ కాక కంకాది సంకులంబును, బ్రచలిత కబంధంబును బ్రభూత పలల
గంధంబును బ్రదీపిత మేదో మాంస రుధిర ఖాదనంబును, బ్రవర్తిత
డాకినీ ప్రమోదంబును, నయి యుండె; నప్పుడు.
ఇలా చెప్పి మాధవుడు రుక్మిణిని
ఊరడించాడు. ఈలోగా ప్రళయం వచ్చినప్పుడు ఆకాశమంతా కప్పేసి పెద్దపెద్ద పిడుగులు
కురుపించే కారు మబ్బులు లాగ బలరాముడు మొదలైన యాదవులు విజృంభించారు. జరాసంధుడు
మొదలైన పరపక్ష రాజులందరి మీద అవక్ర పరాక్రమంతో విరుచుకు పడ్డారు. అగ్నికీలలతో
సరితూగే ఉక్కుబాణాలు మొదలైన వాడి బాణాలు కురిపించారు. అప్పుడు శత్రు సేనలో ఏనుగులు
కూలిపోయాయి, గుర్రాలు చెల్లాచెదు రయ్యాయి. రథాలు ముక్క లయ్యాయి, కాల్భంట్లు బెదిరి
పోయారు, గజాశ్వ రథారోహకుల తలలు తెగి పోయాయి. గుండెలు, నడములు, చెవులు, కంఠాలు,
చెక్కిళ్ళు, చేతులు తునాతునక లయ్యాయి. కపాలాలు పగిలిపోయాయి, తలవెంట్రుకల చిక్కులు
రాలాయి. పాదాలు, మోకాళ్ళు, పిక్కలు తెగిపోయాయ. దంతాలు రాలిపోయాయి. వీరుల కాలి
యందెలు, భుజ కీర్తులు పడిపోయాయి. చెవిపోగులు, కిరీటాలు, కంఠహారాలు జారిపోయాయి.
వీరుల సింహనాదాలు మూగబోయాయి. గదలు, బల్లేలు, గుదియలు, గండ్రగొడ్డళ్ళు,
అడ్డకత్తులు, ఈటెలు, ఖడ్గాలు, శూలాలు, చక్రాలు, విల్లులు విరిగిపోయాయి. జండాలు,
గొడుగులు, వింజామరలు ఒరిగి పోయాయి. కవచాలు పగిలిపోయాయి. గుర్రాల కాలి గిట్టల
తాకిడికి రేగిన దుమ్ము కమ్మేసింది. రథాల వేగం నెమ్మదించింది. వందిమాగధ వైతాళికుల
స్తోత్ర పఠనాలు ఆగిపోయాయి. గుర్రాల సకిలింపులు, భేరీల భాంకారాలు, ఏనుగుగుంపుల
ఘీంకారాలు, రథచక్రాల పటపట శబ్దాలు, గుర్రాల నడుములకు కట్టిన గంటల గణగణలు, వీరుల
హుంకారాలు, ఆభరణాల గలగలలు, నగారాల ధణధణలు, మణిమంజీరాల క్రేంకారాలు, మువ్వల గలగలలు,
అల్లెతాళ్ళ టంకారాలు, భటులు ఒకరినొకరు దిక్కరించుకోవడాలు ఆణిగిపోయాయి. రాజ సమూహం
చెదిరిపోయింది. నెత్తుటేరులు పారాయి. భూత బేతళాల కలకల ద్వని వినిపిస్తోంది.
నక్కలు, కాకులు, గద్దలు, రాబందులు మొదలైన వాని అరుపులు చెలరేగాయి. తల తెగిన మొండెములు
కదలాడాయి. మాంసం కంపు గొట్టింది. మెదడు, మాంసం తింటూ రక్తం తాగుతూ ఉన్న డాకినీ
మొదలైన పిశాచాలకి ఆ రణరంగం ఆనందం కలిగిస్తోంది.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం:
:
No comments:
Post a Comment