Friday, January 16, 2015

రుక్మిణీకల్యాణం - ఇట్లు చంపక


92- వ.
ఇట్లు చంపక, బావా! రమ్మని చిఱునగవు నగుచు వానిం, బట్టి బంధించి, గడ్డంబును మీసంబునుం దలయును నొక కత్తివాతి యమ్మున రేవులువాఱఁ గొఱిగి విరూపిం జేసె; నంతట యదువీరులు పరసైన్యంబులం బాఱఁదోలి, తత్సమీపంబునకు వచ్చి; రప్పుడు హతప్రాణుండై కట్టుబడియున్న రుక్మిం జూచి కరుణజేసి, కామపాలుండు వాని బంధంబులు విడిచి హరి డగ్గఱి యిట్లనియె.
          ఇలా చంపడం మాని, శ్రీకృష్ణుడు వానిని బావా! రా అని పిలుస్తూ చిరునవ్వులు నవ్వుతు పట్టి బంధించాడు. ఓ కత్తిలాంటి పదునైన బాణంతో అతని గడ్డం మీసాలు తలకట్టు చారలు చారలుగా గీసి వికృతరూపిని చేసాడు. అంతలో యాదవ సైన్యాలు శత్రువులను తరిమేసి అక్కడకి వచ్చాయి. అప్పుడు బలరాముడు బంధించబడి దీనావస్థలో ఉన్న రుక్మిని చూసి జాలిపడి విడిపించాడు. మాధవునితో ఇలా అన్నాడు.
          ఇట్లు = ఈ విధముగ; చంపక = సంహరుంకుండ; బావా = బావా; రమ్ము = ఇటురావలసినది; అని = అని పిలిచి; చిఱునగవు = చిరునవ్వు; నగుచున్ = నవ్వుతు; వానిన్ = అతనిని; పట్టి = పట్టుకొని; బంధించి = కట్టవేసి; గడ్డంబును = గడ్డము; మీసంబును = మీసము; తలయున్ = తలమీదిజుట్టు; ఒక = ఒక; కత్తి = కత్తివంటి; వాతి = పదునుగల; అమ్మునన్ = బాణముతో; రేవులు = చారలు; పాఱన్ = ఏర్పడునట్లు; గొఱిగి = గీసి; విరూపిన్ = వికారరూపునిగా; చేసెన్ = చేసెను; అంతట = అటుపిమ్మట; యదు = యాదవ; వీరులు = యోధులు; పర = శత్రువుల; సైన్యంబులన్ = సేనలను; పాఱదోలి = తరిమేసి; తత్ = వారి; సమీపంబున = దగ్గర; కున్ = కు; వచ్చిరి = వచ్చిరి; అప్పుడు = అప్పుడు; హతప్రాయుండు = సగముచచ్చినవాడు; = అయ్యి; కట్టుబడి = బంధింపబడి; ఉన్న = ఉన్నట్టి; రుక్మిన్ = రుక్మిని; చూచి = చూసి; కరణజేసి = దయచూపి; కామపాలుండు = బలరాముడు; వాని = అతని; బంధంబులున్ = కట్టు; విడిచి = విప్పదీసి; హరిన్ = కృష్ణుని; డగ్గఱి = చేరి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

No comments: