88- వ.
అని
పలికిన నగధరుండు నగి, యొక్క బాణంబున వాని కోదండంబు ఖండించి,
యాఱు శరంబుల శరీరంబు దూఱనేసి, యెనిమిది విశిఖంబుల
రథ్యంబులం గూల్చి రెండమ్ముల సారథిం జంపి మూడు వాఁడి తూపులం గేతనంబుఁ ద్రుంచి మఱియు
నొక్క విల్లందినం ద్రుంచి, వెండియు నొక్క ధనువు పట్టిన విదళించి క్రమంబునఁ బరిఘ
పట్టిస శూల చర్మాసి శక్తి తోమరంబులు ధరియించినం దునుకలు చేసి క్రమ్మఱ నాయుధంబు
లెన్ని యెత్తిన నన్నియు శకలంబులు గావించె; నంతటం దనివిజనక
వాఁడు రథంబు డిగ్గి ఖడ్గహస్తుండై దవానలంబు పైఁబడు మిడుత చందంబునం గదిసిన ఖడ్గ కవచంబులు
చూర్ణంబులు చేసి, సహింపక మెఱుంగులు చెదర నడిదంబుపెఱికి జళిపించి
వాని శిరంబు తెగవ్రేయుదు నని గమకించి నడచుచున్న, నడ్డంబు
వచ్చి రుక్మిణీదేవి హరిచరణారవిందంబులు పట్టుకొని యిట్లనియె.
ఇలా రుక్మిప్రగల్భాలు పలుకుతుంటే,
గోవర్దనగిరిధారి కృష్ణుడు నవ్వి, ఒక బాణంతో వాని విల్లు విరిచాడు. ఆరు బాణాలు
శరీరంలో దిగేసాడు. ఎనిమిది బాణాలతో రథాశ్వాలని కూల్చేసాడు. రెండింటితో సారథిని
చంపాడు. మూడు బాణాలతో జండాకర్ర విరిచాడు. ఇంకొక విల్లు తీసుకొంటే దానిని విరిచాడు.
అలా వరసగా పట్టిన ఇంకో ధనుస్సు, పరిఘ, అడ్డకత్తి, శూలం, కత్తి, డాలు, శక్తి, తోమరం
అన్నిటిని ముక్కలు చేసాడు. రుక్మి అంతటితో పారిపోక కార్చిచ్చు పై వచ్చి పడే మిడతలా, రథం దిగి కత్తి పట్టి రాగా కత్తి, కవచం
పిండిపిండి చేసేసాడు. ఒరలోని కత్తి దూసి నిప్పురవ్వలు రాల్తుండగా జళిపించి వాని తల
నరకబోగా, రుక్మిణి పరమపురుషుని పాదాలు పట్టుకొని ఇలా వేడుకొంది.
అని = అని; పలికినన్ = పలుకగా; నగధరుండు = కృష్ణుడు {నగధరుడు - (గోవర్థన) నగమును ధరించినవాడు, కృష్ణుడు}; నగి = నవ్వి; ఒక్క = ఒక; బాణంబునన్ = బాణముతో; వాని = అతని; కోదండంబున్ = ధనుస్సును; ఖండించి = ముక్కలుచేసి; ఆఱు = ఆరు (6); శరంబులన్ = బాణములతో; శరీరంబున్ = దేహము నందు; దూరన్ = దూరునట్లుగా; ఏసి = వేసి; ఎనిమిది = ఎనిమిది (8); విశిఖంబులన్ = బాణములచేత {విశిఖము - ముల్లులేని బాణము}; రథ్యంబులన్ = రథగుర్రములను; కూల్చి = పడగొట్టి; రెండు = రెండు (2); అమ్ములన్ = బాణములచేత; సారథిన్ = రథసారథిని; చంపి = చంపి; మూడు = మూడు (3); వాడి = వాడి యైన; తూపులన్ = బాణములచేత; కేతనంబు = జండా; త్రుంచి = తెంచివేసి; మఱియున్ = ఇంక; ఒక్క = ఒక; విల్లున్ = ధనుస్సును; అందినన్ = అందుకొనగా; త్రుంచి = తునకలుచేసి; వెండియున్ = మరల; ఒక్క = ఒక; ధనువున్ = వింటిని; పట్టినన్ = పూనగా; విదళించి = చీల్చేసి; క్రమంబునన్ = వరుసగా; పరిఘ = ఇనపకట్లగుదియ; పట్టిస = అడ్డకత్తి; శూల = శూలము; చర్మ = డాలు; అసి = ఖడ్గము; శక్తి = శక్తి; తోమరంబులు
= చర్నాకోలలు; ధరియించినన్ = చేపట్టగా; తునుకలు = ముక్కలు; చేసి = చేసి; క్రమ్మఱన్ = మరల; ఆయుధంబులున్ = ఆయుధములను; ఎన్ని = ఎన్ని; ఎత్తినన్ = చేపట్టినను; అన్నియును = అన్నిటిని; శకలంబులు = ముక్కలుగా;
కావించెన్ = చేసెను; అంతట
= అటుపిమ్మట; తనివి = తృప్తి; చనక =
తీరక; వాడు = అతడు; రథంబున్ = రథమును; డిగ్గి = దిగి; ఖడ్గ =
కత్తిని; హస్తుండు = చేతపట్టుకొన్నవాడు; ఐ = అయ్యి; దవానలంబు = కార్చిచ్చు; పైన్ = మీద; పడు = పడెడి; మిడుత
= మిడుత; చందంబునన్ = వలె; కదిసినన్ =
దగ్గరకురాగా; ఖడ్గ = కత్తిని; కవచంబులున్
= కవచములను; చూర్ణంబులు = పొడిపొడిగా; చేసి
= చేసి; సహింపక = ఓరిమిపట్టలేక; మెఱుంగులు
= కాంతులు, నిప్పురవ్వలు; చెదరన్ =
వ్యాపించగా; అడిదంబు = కత్తిని; పెఱికి
= ఒరనుండిబైటికితీసి; జళిపించి = చలింపజేసి; వాని = అతని; శిరంబున్ = తలను; తెగవ్రేయుదును = నరికెదను; అని = అని; గమకించి = సిద్ధపడి; నడచుచున్న = వెళ్ళుతుండగా;
అడ్డంబు = అడ్డముగా; వచ్చి = వచ్చి; రుక్మిణీదేవి = రుక్మిణీదేవి; హరి = కృష్ణుని;
చరణ = పాదములు అనెడి; అరవిందంబులున్ =
పద్మములను; పట్టుకొని = పట్టుకొని; ఇట్లు
= ఈ విధముగ; అనియె = పలికెను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం:
:
No comments:
Post a Comment