84- వ.
అని
యిట్లు జరాసంధుండు నతని యొద్ది రాజులును శిశుపాలుని పరితాపంబు నివారించి, తమతమ భూములకుం జనిరి; శిశుపాలుండు ననుచర సేనాసమేతుండయి
తన నగరంబునకుం జనియె నంత రుక్మి యనువాఁడు కృష్ణుండు రాక్షసవివాహంబునం దన చెలియలిం గొనిపోవుటకు
సహింపక, యేకాక్షౌహిణీ బలంబు తోడ సమర సన్నాహంబునం గృష్ణుని
వెనుదగిలి పోవుచుఁ దన సారథితో యిట్లనియె.
ఇలా చెప్పి శిశుపాలుడి
మనోవేదన పోగొట్టి జరాసంధుడు అక్కడి రాజులు తమతమ దేశాలకి వెళ్ళిపోయారు. శిశుపాలుడు
తన సేనతో తన పట్టణానికి వెళ్ళిపోయాడు. ఇంతలో రుక్మి, కృష్ణుడు తన చెల్లెలిని
తీసుకుపోవడం సహించక, యుద్దానికి సిద్దమై ఒక అక్షౌహిణి సేనతో చక్రి వెంటబడి సారథితో
ఇలా అన్నాడు.
అని = అని; ఇట్లు = ఈ విధముగ; జరాసంధుండున్ = జరాసంధుడు; అతని = అతని; ఒద్ధి = దగ్గరున్న; రాజులును = రాజులు; శిశుపాలుని = శిశుపాలుడు యొక్క; పరితాపంబున్ = విచారమును; నివారించి = పోగొట్టి; తమతమ = వారివారి; భూముల్ = రాజ్యముల; కున్ = కు; చనిరి = వెళ్ళిపోయిరి; శిశుపాలుండున్ = శిశుపాలుండు కూడ; అనుచర = అనుసరించుతున్న; సేనా = సైన్యముతో; సమేతుండు = కూడినవాడు; అయి = ఐ; తన = తన యొక్క; నగరంబున్ = పట్టణమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళిపోయెను; అంత = అటుపిమ్మట; రుక్మి = రుక్మి; అనువాడు = అనెడివాడు; కృష్ణుండు = కృష్ణుడు; రాక్షసవివాహంబున = రాక్షసపెండ్లిపద్ధతిలో; తన = అతని; చెలియలిన్ = చెల్లెలును; కొనిపోవుట = తీసుకుపోవుట; కున్ = కు; సహింపకన్ = ఓర్చుకొలేక; ఏక = ఒక; అక్షౌహీణీ = అక్షౌహిణుల; బలంబు = సేనల; తోడన్ = తోటి; సమర = యుద్ధ; సన్నాహంబునన్ = ప్రయత్నముతో; కృష్ణుని = కృష్ణుని; వెనుదగిలి = వెంబడించి; పోవుచున్ = వెళ్తూ; తన = తన యొక్క; సారథి = రథసారథి; తోన్ = తోటి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :
No comments:
Post a Comment