Sunday, June 29, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 336

చిక్కడు


10.1-383-క.
చిక్కఁడు సిరికౌగిలిలోఁ
జిక్కఁడు సనకాదియోగిచిత్తాబ్జములం
జిక్కఁడు శ్రుతిలతికావళిఁ
జిక్కె నతఁడు లీలఁ దల్లి చేతన్ ఱోలన్.
   ఆ లీలా గోపాలకృష్ణుడు సామాన్యమైనవాడా కాదు. లక్ష్మీదేవి కౌగిటలోను చిక్కలేదు, సనకసనందాది మహార్షుల చిత్తాలకు చిక్కలేదు. ఉపనిషత్తులకు చిక్కలేదు. ఆహా! అంతటి వాడు లీలగా అవలీలగా తల్లి చేతికి చిక్కి రోటికి కట్టివేయబడ్డాడు.
భక్తపరాధీనుడు గనుక తల్లి యనే మిషచే తనకు అంతరంగ భక్తురాలు గనుక యశోదచేతికి చిక్కాడు.
10.1-383-ka.
chikka@MDu sirikaugililO@M
jikka@MDu sanakaadiyOgichittaabjamulaM
jikka@MDu SrutilatikaavaLi@M
jikke nata@MDu leela@M dalli chaetan ROlan
          చిక్కడు = చిక్కుకొనడు; సిరి = లక్ష్మీదేవి యొక్క; కౌగిలి = రెండు చేతుల నడుమ; లోన్ = అందును; చిక్కడు = దొరకడు; సనక = సనకుడు {సనకాది - 1సనక 2సనందన 3సనత్కుమార 4సనత్సుజాతులు అనెడి ఆది యోగులు}; ఆది = మున్నగు; యోగి = యోగుల; చిత్త = మనసు లనెడి; అబ్జములన్ = పద్మముల నైనను; చిక్కడు = కట్టుబడడు; శ్రుతి = వేదము లనెడి; లతికా = తీగల; ఆవళిన్ = సమూహమున కైనను; చిక్కెను = దొరికెను; అతడు = అట్టివాడు; లీలన్ = అవలీలగా, మాయతో; తల్లి = తల్లి యొక్క; చేతన్ = చేతిలో; ఱోలన్ = రోటికి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

1 comment:

Anonymous said...

adbhtam!! emi pothana gaarandi!!