Sunday, June 8, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 310

నల్లనివాడు


10.1-1012-ఉ.
ల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు గృపారసంబు పైఁ
ల్లెడువాఁడు మౌళిపరిర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడు మోమువాఁ డొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె నో!
ల్లియలార! మీ పొదలమాటున లేఁడు గదమ్మ! చెప్పరే!
          నల్లని దేహము వాడు, కమలములవంటి కన్నులు గల వాడు, కరుణా రసము కురిపించే వాడు, సిగపై నెరపిన నెమలి పింఛము కల వాడు, చిరునవ్వు చెలువారే చక్కని మోము కల వాడు నైన ఓ కుర్రవాడు మా మానినీమణుల మానధనం దోచి తెచ్చాడు. ఓ మల్లెలార! మీ మల్లె పొదల మాటున కాని ఉన్నాడేమో కొంచం చెప్పండమ్మా.
తమతో క్రీడిస్తున్న గోపాలకృష్ణుడు కనుమరుగు కాగా తదాత్మకత్వమున పరవశులైన గోపికలు కృష్ణుని వెతుక్కుంటున్నారు. కనిపించిన చెట్టుచేమ అన్నిటిని అడుగుతున్నారు. భాగవతంలో అత్యద్భుతమైన పద్యాలలో ఎన్నదగినది యిది. దీని కవల పద్యం అనదగ్గది, దీనికంటె ప్రసిద్ధమైన పద్యం ఇదే వృత్తంతో ఇదే శైలితో ఇలాంటి పదాలతోనే ల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు. . . అని మరొక పద్యం నవమ స్కంధంలో (9-361-ఉ.) రాముని ఉద్దేశించిన పద్యం ఉంది.
10.1-1012-u.
nallanivaa@MDu padmanayanaMbulavaa@MDu gRpaarasaMbu pai@M
jalleDuvaa@MDu mauLiparisarpita piMChamuvaa@MDu navvu raa
jilleDu mOmuvaa@M Doka@MDu chelvala maanadhanaMbu@M dechche nO!
malliyalaara! mee podalamaaTuna lae@MDu gadamma! chepparae!
          నల్లనివాడు = నల్లని రంగు వాడు,కృష్ణుడు; పద్మనయనంబుల వాడు = పద్మాక్షుడు, కృష్ణుడు; కృపారసంబున్ = దయను; పైన్ = మీద; చల్లెడువాడు = చిలికెడివాడు; మౌళి = సిగ యందు; పరిసర్పిత = చుట్టబడిన; పింఛమువాడు = నెమలిపింఛము గలవాడు; నవ్వు = చిరునవ్వులు; రాజిల్లెడు = ప్రకాశించెడి; మోమువాడు = ముఖము కలవాడు; ఒకడు = ఒకానొకడు; చెల్వలన్ = స్త్రీల; మాన = శీలము అనెడి; ధనంబున్ = సంపదను; తెచ్చెను = దొంగిలించు కొచ్చెను; = ; మల్లియలారా = మల్లపూలు; మీ = మీ; పొదలన్ = పొంద లందు; మాటున = దాగుకొని; లేడు = లేడు; కదా = కదా; అమ్మ = తల్లి; చెప్పరే = చెప్పండి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: